Bengaluru’s Epsilon నిండా మునిగిన వారికి చలి ఏంటి? అన్న చందంగా మారింది బెంగళూరు వాసుల దుస్థితి. ఇప్పుడు బెంగలూరులో ఎక్కడ చూసినా వరద బురదే. కనీసం నడిచి వెళ్లడానికి కూడా తోవలేని పరిస్థితి. మొత్తం నీటితో నిండి ఉండడంతో పడవలు, ట్రాక్టర్లే దిక్కవుతున్నాయి. ఎంతో మంది బడాబాబులున్న నగరంలో ఇప్పుడు వరదలతో హోటల్ రూంలకు భారీ గిరాకీ ఏర్పడింది.
విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ, బైజూస్ సీఈవో రవీంద్రన్ వంటి బిలియనీర్లు ఉన్న బెంగళూరులోని ఎప్సిలాన్ ఉన్నతస్థాయి గేటెడ్ అపార్ట్‌మెంట్ నీటిలో మునిగిపోయింది. వారి కార్లు, ఇతర వాహనాలు నీటిలో తేలియాడుతున్నాయి. ఖరీదైన వారి అపార్ట్‌మెంట్‌ల నుండి నిర్వాసితులను ఖాళీ చేయడానికి పడవలను ఉపయోగించారు. దేశంలోనే అత్యంత సంపాదనపరులు కూడా వరదల ధాటికి తరలిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బెంగళూరులోనే ఖరీదైన పారిశ్రామికవేత్తలున్న ప్రాంతం ఎప్సిలాన్. ఇక్కడ ప్రాథమిక విల్లా ధర ₹10 కోట్లు. అంతటి ఖరీదైన ప్రాంతం కూడా నీటిలో కూరుకుపోయింది. కార్లు మునిగేంత వరద ఉంది. దీంతో ఈ డబ్బున్న బాబులు కూడా అపార్ట్ మెంట్స్ ఖాళీ చేసే ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. ఇక్కడ కరెంట్ సరఫరా లేకపోవడం.. తాగేందుకు నీరు, ఇతర సౌకర్యాలు లేకపోవడంతో కట్టుబట్టలతో వెళ్లిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
నగరంలో వరదల కారణంగా బెంగళూరులో హోటల్ రూమ్ ధరలు ఒక రాత్రికి ₹30,000 నుంచి ₹40,000కి రెట్టింపు చేశారు. అనేక మంది నిర్వాసితులు, వారి ఇళ్లు ముంపునకు గురై హోటళ్లలోకి వెళ్లడం ప్రారంభించిన తర్వాత ధరలకు రెక్కలు వచ్చాయి..
ఐటీ సిటీ అయిన బెంగళూరులో బడా పారిశ్రామికవేత్తలు, ఐటీ ఉద్యోగులు ఎక్కువ. వీరు అసౌకర్యాన్ని తట్టుకోలేక ఖరీదైన హోటల్స్ కు మారుతున్నారు. దీంతో హోటల్ రూంలకు రెక్కలొస్తున్నాయి. వరదలు పోయేవరకూ హోటల్స్ లో బస చేసేందుకు వస్తుండడంతో హోటల్ గదుల రేట్లు ఏకంగా పది రెట్లు పెరిగాయి.
నివేదికల ప్రకారం.. ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్, వైట్‌ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్ మరియు కోరమంగళలోని అనేక హోటళ్లు శుక్రవారం వరకు పూర్తిగా బుక్ చేయబడ్డాయి. ఇక్కడ ఒక రాత్రికి ఏకంగా 40 వేల వరకూ డిమాండ్ పలుకుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.