Telangana BJP : బీజేపీ ఫస్ట్ లిస్ట్ రెడీ.. అసెంబ్లీ బరిలో కిషన్ రెడ్డి, బండి..
. అంబర్‌పేట నుంచి కిషన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఆర్మూర్ నుంచి ధర్మపురం అర్వింద్, బోథ్ నుంచి సోయం బాపూరావు, చెన్నూరు నుంచి వివేక్ వెంకటస్వామి, మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మెదక్ నుంచి విజయశాంతి, రాజేంద్రనగర్ లేదా తాండూరు నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, ఖమ్మం నుంచి పొంగులేటి సుధాకర రెడ్డి పేర్లు ఖరారయ్యాయి.

Telangana BJP : తెలంగాణలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలు అభ్యర్థ్దుల ప్రకటనపైన కసరత్తు వేగవంతం చేశాయి. ఈ రేసులో బీఆర్‌ఎస్ ముందు ఉంది. ఆగస్టు 21న తొలిజాబితా విడుదల చేసేందుకు గులాబీ బాస్ సిద్ధమయ్యారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ కూడా తమ అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేస్తున్నాయి.
అమిత్‌షా పర్యటనలోగా ఆమోదం..
ఈ నెల 27న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఆ సమయంలోనే తొలి జాబితాకు ఆమోదం పొందేలా కమలం నేతల అడుగులు పడుతున్నాయి. కీలక నేతలు ఈ జాబితాలో ఉన్నారు. నియోకజవర్గాల్లో బలమైన నేతలు ఉన్న వారితో కలిపి దాదాపు 45 మందితో తొలి జాబితా ప్రకటనకు కసరత్తు చేస్తున్నారు. పార్టీ ఎంపీలుగా ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ ఈసారి అసెంబ్లీ బరిలో నిలవనున్నారు. అంబర్‌పేట నుంచి కిషన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఆర్మూర్ నుంచి ధర్మపురం అర్వింద్, బోథ్ నుంచి సోయం బాపూరావు, చెన్నూరు నుంచి వివేక్ వెంకటస్వామి, మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మెదక్ నుంచి విజయశాంతి, రాజేంద్రనగర్ లేదా తాండూరు నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, ఖమ్మం నుంచి పొంగులేటి సుధాకర రెడ్డి పేర్లు ఖరారయ్యాయి.
ఎవరెవరు ఎక్కడ నుంచి..
ఈటల రాజేందర్ సతీమణి హుజూరాబాద్ నుంచి పోటీ చేయనున్నారు. గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ పోటీకి దిగే అవకాశం ఉంది. సికింద్రాబాద్ నుంచి జయసుధ, ఇబ్రహీంపట్నం నుంచి బూర నర్సయ్యగౌడ్ లేదా వీరేందర్‌గౌడ్ పోటీకి దిగనున్నారు. మల్కాజ్‌గిరి నుంచి రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ పోటీలో ఉన్నారు. గద్వాల నుంచి డీకే.అరుణ పోటీ చేయనున్నారు. సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. వీరితోపాటుగా ఖాయంగా పోటీ చేసే అవకాశం ఉన్న వారి పేర్లను ఖరారు చేస్తూ తొలి జాబితా విడుదల చేయనున్నారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ జాబితాల తర్వాత..
ఇక బీజేపీ రెండో జాబితా మాత్రం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్దుల జాబితాల తరువాత మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. సీట్ల కోసం పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ప్రత్యర్ధి పార్టీల అభ్యర్థ్దులు ఖరారైన తరువాత నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే 20 సీట్లకు అభ్యర్థ్దులను ఎంపిక చేసింది. మరో 25 మంది పేర్లు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. మిగిలిన నియోకవర్గాల్లో సర్వేలు కొనసాగుతున్నాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నుంచి అక్కడ అమలు చేస్తున్న సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. తొలి జాబితా ఈ నెలాఖరులోగా విడుదల చేసి.. రెండో జాబితా సెప్టెంబర్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే, ఎంపీలు నలుగురు అసెంబ్లీ బరిలో నిలిచేందుకు పార్టీ అధినాయకత్వం ఆమోదం తెలుపుతుందా.. లేక మార్గదర్శకం ఏం చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
