TDP-BJP: తెలుగుదేశంతో దోస్తీ దిశగానే బీజేపీ చర్యలు?
కేంద్ర పెద్దలను కలిసి చర్చిస్తానని పవన్ ప్రకటించిన తర్వాత.. దానిని పురందేశ్వరి సమర్థించారు. ఇది అధికార వైసీపీకి మింగుడు పడడం లేదు.

TDP-BJP: ఏపీలో పొత్తుల విషయంలో బిజెపి సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి జాతీయ నాయకులు ఎవరూ నోరు మెదపడం లేదు. రాష్ట్ర బిజెపి నాయకులు మాత్రం సానుకూలంగా ఉన్నారు. పొత్తులపై బిజెపి పెద్దలతోనే నేరుగా మాట్లాడుతానని పవన్ ప్రకటించడాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమర్థించారు. మమ్మల్ని విస్మరించి.. అగ్రనేతలతో చర్చిస్తానన్న పవన్ మాటలతో పురందేశ్వరి నుంచి విమర్శలు వస్తాయని భావించారు. కానీ ఆమె పవన్ వ్యాఖ్యలను స్వాగతించారు. అగ్రనేతలతో చర్చించడమే కరెక్ట్ అని తేల్చేశారు. తద్వారా తాము పొత్తులకు రెడీగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు.
ప్రస్తుతం ఏపీలో బిజెపి బలమైన ఓటు బ్యాంకు ఉన్న పార్టీ కాదు. అయినా సరే పొత్తులకు వెనుకడుగు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో కలవడం బిజెపి అగ్ర నేతలకు ఇష్టం లేదని టాక్ నడుస్తోంది. కానీ అటువంటిదేమీ లేదని రాష్ట్ర బిజెపి నాయకులు కొంతమంది చెప్పుకొస్తున్నారు. కచ్చితంగా ఎన్నికల్లో కలిసి నడుస్తామని చెబుతున్నారు. కానీ తమకు తాముగా ప్రకటించడం లేదు. కేవలం పవన్ వ్యాఖ్యలను, ప్రయత్నాలను మాత్రం సమర్థిస్తున్నారు. తమకు కూడా పొత్తు అవసరమేనని అంతర్గతంగా చెబుతున్నారు. బాహాటంగా చెప్పేందుకు మాత్రం వారికి ధైర్యం చాలడం లేదు.
కేంద్ర పెద్దలను కలిసి చర్చిస్తానని పవన్ ప్రకటించిన తర్వాత.. దానిని పురందేశ్వరి సమర్థించారు. ఇది అధికార వైసీపీకి మింగుడు పడడం లేదు. చర్చించడానికి పవన్ ఎవరని.. రాష్ట్ర బిజెపి నాయకులు డమ్మీ అంటూ వైసీపీ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. పవన్ అలా ప్రకటించిన వెంటనే పురందేశ్వరి కౌంటర్ ఇచ్చి ఉంటే.. వైసిపి దానిని తనకు అనుకూలంగా మార్చుకునేది. కానీ పురందేశ్వరి నోటి నుంచి పవన్ పై సానుకూల వ్యాఖ్యలు రావడంతో వైసిపి షాక్ కు గురైంది.పైగా బిజెపి అగ్ర నేతలు ఎవరూ నోరు మెదపకపోవడంతో వైసిపి డిఫెన్స్ లో పడిపోయింది.
టిడిపి తో పొత్తును ప్రకటించిన పవన్.. తన వెనుక బిజెపి ఉందన్న సంకేతాలు ఇచ్చారు. బిజెపి కలిసి వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో భారతీయ జనతా పార్టీ అనుమతయిన తీసుకుని ఉండాలి.. లేకుంటే కటీఫ్ అని చెప్పైనా ఉండాలి. ఈ అనుమానం వైసీపీని వెంటాడుతోంది. ప్రస్తుతానికైతే బిజెపి అగ్రనేతలు గుంభనంగా ఉండవచ్చు కానీ.. టిడిపి తో పొత్తునకు వారు సానుకూలంగా ఉన్నారన్న వార్తలు వైసీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తమ ద్వారా తప్పులు చేయించి.. చంద్రబాబుకు సానుభూతి వచ్చేలా ప్లాన్ చేశారా అన్న అనుమానం కూడా వైసీపీలో ఉంది. వైసీపీ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత వచ్చేలా రామోజీ ఫిలిం సిటీ లో వ్యూహరచన జరిగిందని అనుమానిస్తున్న వైసిపి నాయకులు ఉన్నారు. ఇటువంటి తరుణంలో వైసీపీ బీజేపీ అగ్రనేతల వైపు అనుమానపు చూపులు చూస్తుండడం విశేషం.
