BJP manifesto: హుజూరాబాద్ ఎన్నికలు వేడికిస్తున్నాయి. నిన్నటితో ప్రచార పర్వానికి తెరపడింది. దీంతో ఇప్పుడు హుజూరాబాద్ సైలెంట్‌గా మారిపోయింది. కానీ ఎవరికీ కనిపించకుండా జరగాల్సిన కార్యకలాపాలన్నీ చడీ చప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. అందులో భాగంగానే తాము గెలిస్తే ఇది చేస్తాం, తాము గెలిస్తే అది చేస్తామని హామీలు ఇచ్చారు.
టీఆర్ ఎస్‌కు కౌంటర్‌గా బీజేపీ ప్రమాణ పత్రం..
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండున్నరేండ్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుందని, అందుకే తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని హుజూరాబాద్‌ను అభివృద్ధి చేసుకోవాలని హరీశ్‌రావు ఓటర్లకు సూచించారు. కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇక్కడ ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఏం అభివృద్ధి జరగదని ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే ఆయన ప్రచారానికి కౌంటర్ ఇస్తు బీజేపీ ప్రమాణ పత్రం పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో హుజూరాబాద్ అభివృద్ధికి తీసుకోబోతున్న చర్యలను వివరించింది. కేంద్ర సాయంతో హుజూరాబాద్‌ను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామని చెప్పింది.
కేంద్ర పథకాలే ఎక్కువ ?
అయితే ఈ మేనిఫెస్టోలో అన్ని కేంద్ర పథకాలే ఉన్నాయి. ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పథకం, ప్రధాన మంత్రి కౌషల్ యోజనా, క్రిషి సంచాయ్ యోజన, శామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్, ప్రధాన్ మంత్రి కిసాన్ మన్ దన్ యోజన వంటి పథకాలు ఉన్నాయి. ఈ పథకాలు ప్రస్తుతం దేశం మొత్తం అమలులో ఉన్నాయి. దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథ పిల్లలను ప్రత్యేక కార్యచరణ, వివిధ పథకాల కింద చర్యలు తీసుకుంటామని తెలిపారు. నియోజకవర్గంలోని పట్టణలు, గ్రామాలకు రక్షిత మంచినీటి పథకం అమలు చేస్తామని చెప్పింది. నియోజకవర్గంలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధి, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిల నిర్మాణం జమ్మికుంట రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించింది.
అలా చేయొచ్చా ?
మేనిఫెస్టోలో ఎక్కువగా కేంద్ర పథకాలు మాత్రమే ఉండటం రాజకీయ విశ్లేషకులను ఆలోచింపజేస్తోంది. బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో బీజేపీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా ఈ పథకాలు అమలు చేయాల్సిందే. ప్రత్యేకంగా ఒక్క చోటనే ఇలాంటి పథకాలు అమలు చేయాలంటే చట్టాలు ఒప్పుకోవు. అలాగే ఒక స్థానంలో ఎమ్మెల్యే అధికార పార్టీకి చెందిన వ్యక్తి కాకపోయినా.. ఆ రాష్ట్రంలో అమలవుతున్నా పథకాలన్నీ ఆ నియోజవకర్గంలో కచ్చితంగా అమలు చేయాల్సిందే. కేవలం ఆ నియోజవకర్గంపై వివక్ష చూపడం చట్ట ప్రకారం తప్పు. కావున అక్కడ బీజేపీ గెలిచినా, టీఆర్ఎస్ గెలిచినా మన చట్టం నిర్దేశించిన విధంగా హుజూరాబాద్‌లో కేంద్ర, రాష్ట్ర పథకాలు రెండు అమలు చేయాల్సి ఉంటుంది. దేశంలో ఎక్కడైనా రాజ్యాగం ప్రకారమే పాలన సాగాల్సి ఉంటుంది. ఒక ప్రాంతంపై ప్రత్యేక ప్రేమ, వివక్ష చూపడానికి వీల్లేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్న చోట మినహా.. మిగితా దేశం అంతా ఒకే రకంగా చట్టాలు అమలవుతాయి. మరి హుజూరాబాద్ ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టనున్నారో తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.
Also Read: CM Jagan: ఏపీ అభివృద్ధిపై కేసీఆర్ వ్యాఖ్యలు జగన్ కు లాభమా ? నష్టమా ?