KCR CBI Attacks: ప్రత్యర్థులను ఎలా దెబ్బతీయాలో కేంద్రంలోని మోడీ సర్కార్ కు బాగా తెలుసు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ నే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీతో విచారణ చేయించి ముప్పుతిప్పలు పెడుతున్న మోడీ సర్కార్.. దక్షిణాదిలో తోక జాడిస్తున్న కేసీఆర్ ను ఊరికే వదిలిపెడుతుందా? ఇప్పుడు అదే పనిచేసింది. ఇటీవలే కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిసి చర్చలు జరిపిన ప్రజాశాంతి వ్యవస్థాపకులు కేఏ పాల్ ఇప్పుడు అన్నంత పనిచేశారు. కేసీఆర్ పై సీబీఐకి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ 9వేల కోట్లు దోచుకున్నారని.. వెంటనే సీబీఐతో విచారణ చేయాలని కోరడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ ను ఇరికించేందుకే మోడీ సర్కార్ ‘కేఏపాల్’పై గన్ పెట్టి కేసీఆర్ ను కాల్చబోతోందని రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరో బాంబ్ పేల్చారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ పై కస్సుబుస్సులాడుతున్న ఆయన తాజాగా సీబీఐ డైరెక్టర్ సుభోద్ కుమార్ జైశ్వాల్ ను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో భారీగా అవినీతి జరిగిందని, ఈ అవినీతిపై సమగ్ర విచారణ చేయాలని ఫిర్యాదు చేశారు. ప్రత్యేక తెలంగాణలో అభివృద్ధి పనుల పేరిట సీఎం కేసీఆర్, కొంతమంది నాయకులు వేల కోట్లు దోచుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పిన కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారని అందులో తెలిపారు. సీబీఐకి ఫిర్యాదు చేసిన కాపీని కేంద్ర మంత్రులకు కూడా పంపినట్లు కేఏ పాల్ తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఈ సమయంలో తెలంగాణలో రూ.60 కోట్ల మిగులు బడ్జెట్ ఉంది. కానీ కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనలో నాలుగున్నర లక్షల కోట్ల అప్పులు చేశారని కేఏ పాల్ విమర్శించారు. తెలంగాణలో లక్షల ఎకరాలకు సాగునీరు తెస్తానని చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.. ఈ ప్రాజెక్టు విలువ లక్షా 5 వేల కోట్లు కాగా.. పనుల కోసం కేవలం రూ.35 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. మిగిలిన 75 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని అన్నారు.
రాష్ట్రంలోని ప్రముఖ యాదాద్రి దేవాలయ నిర్మాణంలోనూ కేసీఆర్ భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని కేఏ పాల్ ఆరోపించారు. ఈ దేవాలయ అభివృద్ది పేరిట రూ.2 వేల కోట్లు కేటాయించారన్నారు. అయితే కేవలం రూ.200 కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగిలినదంతా దోచుకున్నారని అన్నారు. కేసీఆర్ తో పాటు హరీశ్ రావు, కేటీఆర్, సంతోష్, ఎమ్మెల్సీ కవితలు భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ కుటుంబం మొత్తం తెలంగాణలో రూ.9 వేల కోట్లు దోచుకున్నారని, వీరిపై వెంటనే దర్యాప్తు చేయాలని కేఏ పాల్ ఫిర్యాదు చేశారు.
కేసీఆర్ అవినీతిపై సమగ్ర విచారణ జరిపిస్తే తాను పూర్తిగా సహకరిస్తానని కేఏ పాల్ సీబీఐ డైరెక్టర్ కు తెలిపారు. తాను కేసీఆర్ అవినీతిపై ప్రశ్నిస్తున్నందుకు కొందరు నాపై దాడికి యత్నిస్తున్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులపై సమగ్రంగా విచారణ జరిపితే అసలు విషయాలు బయటికి వస్తాయని అన్నారు. సీబీఐ దర్యాప్తుతోనే నష్టాల్లో ఉన్న తెలంగాణకు న్యాయం చేసినట్లవుతుందని తెలిపారు. ఇక సీబీఐకి ఫిర్యాదు చేసిన కాపీనీ కేంద్ర మంత్రులు అమిత్ షా, పురుషోత్తం రూపాలకు కూడా పంపించినట్లు పాల్ తెలిపారు.
కేఏ పాల్ చేసిన ఫిర్యాదుపై సీబీఐ స్పందించి కేంద్రం కనుక యుద్ధానికి పంపితే కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు చిక్కుల్లో పడడం ఖాయం. దక్షిణాది నుంచి జాతీయ స్థాయి నేతగా ఎదిగేందుకు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న కేసీఆర్ బీజేపీ తన అస్త్రశస్త్రమైన ‘సీబీఐ’ని ప్రయోగించడానికి రెడీ అయినట్టుగా తెలుస్తోంది. కేంద్రంలో మోడీ వచ్చాక సీబీఐ, ఈడీ పేరుతో ప్రత్యర్థి పార్టీలపై ఉసిగొల్పుతున్నారన్న విమర్శలున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలపై సీబీఐ, ఈడీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ ను దాంతోనే భయపెట్టేలా తమ చేతికి మట్టి అంటకుండా కేఏ పాల్ తో నరుక్కురావడానికి బీజేపీ ప్లాన్ చేసినట్టు తెలిసింది. త్వరలోనే కేసీఆర్ పై ఈ దాడులు జరుగవచ్చని అంటున్నారు.