AP BJP- Chandrababu: ఏపీలో సరికొత్త రాజకీయానికి కేంద్ర బీజేపీ పెద్దలు వ్యూహం పన్నుతున్నారా? ఏపీపై దాదాపు ఆశలు వదులుకున్నారా? ప్రత్యక్షంగా గెలవకపోయినా.. పరోక్షంగా పైచేయి సాధించాలనుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో అవసరాలకు అనుగుణంగా పావులు కదిపేందుకు ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి ఏపీలో బీజేపీ అంత ఆశించిన స్థాయిలో లేదు. తెలంగాణతో పోల్చుకుంటే పార్టీ బలపడిన దాఖలాలు కనిపించడం లేదు. అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏపీ ప్రజలు తమ ముఖం చూడడం లేదు. అయితే ఇందుకు ప్రధాన బాధ్యుడి మాత్రం చంద్రబాబుగా బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. నాడు 1999లో, 2014లో కలిసి అడుగులేసిన సందర్భాల్లో చంద్రబాబు బీజేపీని ఎంత తొక్కాలో..అంత తొక్కేసారన్న భావన మాత్రం బీజేపీ పెద్దల్లో ఇప్పటికీ నానుతోంది. ఆయనకు అవకాశమివ్వరాదని వారు భావిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో వైసీపీయే గెలిచి అధికారంలోకి రావాలని భావిస్తున్నారట. ఇదేమి రాజకీయం అని ఆశ్చర్యపోవచ్చు. కానీ ప్రస్తుతం తెర వెనక ఇదే రకమైన రాజకీయం సాగుతోంది అని ప్రచారం సాగుతోంది. ఒక పక్క పవన్ అటు టీడీపీ, ఇటు బీజేపీని కలిపే ప్రయత్నం చేస్తుండగా.. ఏంటీ కథ అన్న చర్చ అయితే నడుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ ఢిల్లీ పెద్దలతో జగన్ సఖ్యతగానే నడుస్తున్నారు. బీజేపీ, వైసీపీ కింది స్థాయి నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నా జగన్ విషయానికి వచ్చే సరికి మాత్రం అవి కనిపించడం లేదు. తనపై కేసుల భయంతోనో.. లేకుంటే బీజేపీ చంద్రబాబును చేరదీసి తనకు ఇబ్బందులు పెడుతుందన్న భయమో కానీ.. అనేక రకాలుగా బీజేపీ ప్రభుత్వానికి వైసీపీ మద్దతు ఇచ్చిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర పెద్దలకు జగన్ మీద గురి కుదిరింది.

somu veerraju, chandrababu
మూడోసారి అధికారంలోకి రావడానికి..
కేంద్రంలో మూడో సారి అధికారంలోకి రావడం బీజేపీకి అంత సులువు కాదు.ఎన్డీఏలో ఇప్పుడున్న ఒకటి రెండు పార్టీలు కాదు. ప్రాంతీయ పార్టీల మద్దతు పెరగాలి. అప్పుడే అధికారం చేపట్టగలమని మోదీ, షా ద్వయం ఆలోచిస్తుందట. అలాంటి సమయంలో నమ్మకమైన వారు తోడుగా ఉండాలి అన్నది బీజేపీ అగ్ర నేతల ఆలోచన. ఏపీలో చంద్రబాబు జగన్ విషయం తీసుకుంటే బాబు కంటే జగనే బీజేపీ ఎక్కువగా నమ్ముతోంది అంటున్నారు.దానికి కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ వల్ల దెబ్బ తిని జైలుకు వెళ్ళిన జగన్ కాంగ్రెస్ అంటే ఏ టైమ్ లో అయినా ఆమడదూరం జరుగుతారని కాషాయ దళానికి తెలుసు. ఇక కాంగ్రెస్ బీజేపీకి జాతీయ స్థాయిలో వైరి పక్షం అని కూడా ఇక్కడ చూడాల్సిన విషయం. అదే విధంగా చూస్తే చంద్రబాబుది అవకాశ వాద రాజకీయం అని కూడా బీజేపీ వారు భావిస్తున్నారుట.ఈ రోజు అధికారంలో లేక బాబు ఎన్ని మాటలు చెప్పినా రేపటి రోజున ఆయన చేతికి డబుల్ డిజిట్ నంబర్ లో ఎంపీలు ఉంటే ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వచ్చి మరీ చక్రం తిప్పేస్తారు అన్న డౌట్లు కూడా ఉన్నాయట. అంతే కాదు 2018లో బాబు ఒకసారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన దాన్ని కూడా వారు గుర్తు చేసుకుంటున్నారుట. అందుకే ఏపీలో వైసీపీకి ఎంపీ సీట్లు ఎక్కువగా వస్తే అవి తమ ఖాతాలో ఇండైరెక్ట్ గా అయినా పడతాయి అన్నది బీజేపీ వ్యూహకర్తల ఆలోచనగా ఉంది అంటున్నారు. ఇక ఏపీలో చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో నెగ్గితే మాత్రం ఆయన రాజకీయ చాతుర్యం చాణక్యంతో ఇబ్బంది పడాల్సి వస్తుందని ఇక బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ కనుక రాకపోతే ఢిల్లీలో బాబు రూపంలో కూడా కొత్త ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారుట.
Also Read: Chandrababu-NTR Family: ఏకతాటిపై ఎన్టీఆర్ కుటుంబం.. ఆ ఒక్కరు తప్ప.. చంద్రబాబు భారీ స్కెచ్
పవన్ ను నచ్చజెప్పేందుకు..
అందుకే టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు వద్దని వారు అనుకోవడమే కాదు పవన్ కళ్యాణ్ కి కూడా నచ్చచెబుతున్నారుట. ఏపీలో టీడీపీని దూరం పెట్టాల్సిందే అన్నది బీజేపీ అజెండాగా ఉంది అని చెబుతున్నారు. బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ కావాలని పవన్ చాలా కాలంగా అడుగుతున్నారు. అయితే బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ లో జనసేన బీజేపీ బలోపేతం అవడమే ఉంటుదని 2024లో దానికి పునాదులు వేసుకుని గట్టి పక్షంగా నిలబడితే 2029లో రాజకీయం పూర్తిగా తమ కూటమికే అనుకూలంగా ఉంటుందని కూడా చెబుతున్నారుట. ఇదే బీజేపీ రోడ్ మ్యాప్ లో ఉంటుందిట.

pawan kalyan, modi, Chandrababu
ఇక పవన్ కి ఈ సందర్భంగా కొన్ని హామీలు కూడా బీజేపీ కేంద్ర పెద్దల నుంచి ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. 2024లో బీజేపీ కేంద్రంలో మరోమారు అధికారంలోకి వస్తే పవన్ కి కేంద్ర స్థాయిలో కీలకమైన పదవి ఇస్తారని కూడా అంటున్నారు. అంటే పవన్ కి అధికార వైభోగం మీద హామీ ఇస్తూనే బాబు నుంచి వేరు చేయలన్నది బీజేపీ అగ్రనాయకుల వ్యూహం అని తెలుస్తోంది. అలాగే ఏపీలో జనసేన ఒక కీలక శక్తిగా ఎదిగేలా అన్ని విధాలుగా బీజేపీ అండగా నిలుస్తుందని కూడా చెబుతున్నారుట.ఈ విధంగా ఒక వైపు జగన్ మరో వైపు పవన్ని దగ్గరపెట్టుకుని ఏపీ పాలిటిక్స్ నుంచి చంద్రబాబును టీడీపీని ఎలిమినేట్ చేయాలన్నదే కమలం పార్టీ పక్కా ప్లాన్ అని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో పవన్ ఎంతరవకూ అంగీకరించి ముందుకు సాగుతారు అన్నదే ఇక్కడ చూడాల్సిన విషయం. పవన్ బీజేపీ రోడ్ మ్యాప్ కి కనుక ఓకే చెప్పకపోతే ఈ రెండు పార్టీల దారులు వేరు అవుతాయనే అంటున్నారు. మొత్తానికి బాబుకి ఏపీలో పొలిటికల్ గా అప్ లిఫ్ట్ ఇవ్వరాదు అన్న బీజేపీ డెసిషన్ లో ఏ రకమైన మార్పు లేదనే అంటున్నారు.
మసకబారున్న మోదీ ప్రభ..
ఇదిలావుంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠ మసకబారుతోందా? అన్న అనుమానాలు ఇటీవలికాలంలో ముసురుకుంటున్నాయి. బీజేపీ శ్రేణులకు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అందుకే ముందస్తుగా కొన్ని మిత్ర పక్షాలను చెరదీసుకుంటున్నారు. ఇప్పటివరకు నరేంద్ర మోదీ నిప్పులాంటి వాడని బీజేపీ నాయకులు, కార్యకర్తలు గర్వంగా చెప్పుకొనేవారు. ఇప్పుడు గౌతం అదానీ రూపంలో ప్రధాని మోదీపై మచ్చ పడింది. శ్రీలంకలో 5000 కోట్ల రూపాయల విద్యుత్ ప్రాజెక్టును అదానీకే కట్టబెట్టాలని ప్రధాని మోదీ తమ దేశాధ్యక్షుడిపై ఒత్తిడి తెచ్చారని శ్రీలంకకు చెందిన అధికారి చేసిన ఆరోపణ సంచలనం రేకెత్తించింది. ఇది నిజమైతే ప్రధాని చర్య దేశానికే అప్రతిష్ఠ. విదేశాల్లో కాంట్రాక్టులను తమవారికి ఇప్పించడానికి ప్రయత్నించినట్టు మన దేశ ప్రధానుల్లో ఇంతవరకు ఒక్కరిపై కూడా ఆరోపణలు రాలేదు. ఇప్పుడు మొదటిసారిగా నరేంద్ర మోదీపై ఆరోపణ వచ్చింది. దీనిపై మోదీనే సమాధానం చెప్పాలి. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక ఈ ఎనిమిదేళ్లలో గౌతం అదానీ వ్యాపార సామ్రాజ్యం మర్రిచెట్టులా విస్తరించింది. అంతులేని సంపద ఇప్పుడు ఆయన సొంతం. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, బొగ్గు గనులు, విద్యుత్ కేంద్రాలలో అదానీ గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అండదండలతోనే ఇది సాధ్యమైందన్న విమర్శలు ఉన్నాయి. ఒక వ్యాపారవేత్త కోసం ప్రధానమంత్రి పట్టుపట్టడం నిజమైతే మాత్రం అది మనందరికీ తలవంపు. మామూలుగా అయితే ఇటువంటి ఆరోపణలు రుజువైతే ప్రధాని పదవికి రాజీనామా చేయవలసి వస్తుంది.
అగ్నిపథ్ తో అంతా వ్యతిరేకం..
ఇక ఆర్మీకి సంబంధించిన ‘అగ్నిపథ్’ పేరిట ప్రభుత్వం ప్రకటించిన నియామక ప్రక్రియ కూడా విమర్శలకే కాకుండా దేశవ్యాప్త ఆందోళనలకు కారణమైంది. ఉత్తరాదినే కాకుండా హైదరాబాద్‌లో కూడా యువత ఆందోళనకు దిగింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసం జరగడం, పోలీసు కాల్పుల్లో ఒక యువకుడు మరణించడం చూశాం. అగ్నిపథ్ పేరుతో నాలుగేళ్ల కాల పరిమితితో రక్షణ బాధ్యతలు చేపట్టడానికి యువకులను ఎంపిక చేయాలన్న నిర్ణయమే అపసవ్యంగా ఉంది. కరోనా కారణంగా రెండేళ్లుగా ఆర్మీ రిక్రూట్‌మెంట్ కూడా నిలిచిపోయింది. దాంతో తీవ్ర నిరాశలో ఉన్న యువత ఈ నిర్ణయంతో మండిపడింది. ఫలితంగా విధ్వంసాలకు పూనుకుంటున్నారు. దేశంలో నిరుద్యోగం యువతను కుంగదీస్తోంది. దాని పర్యవసానమే ఆందోళనలు. అగ్నిపథ్ పథకం కూడా ప్రధాని మోదీకి అప్రతిష్ఠను తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. ఇప్పటివరకు మోదీకి దేశంలో ఎదురులేకుండా ఉండింది. ఇప్పుడు ఆయన నాయకత్వం ముందు కొత్త కొత్త సవాళ్లు వస్తున్నాయి. ఈ సవాళ్లను ఆయన ఎలా అధిగమిస్తారో వేచి చూద్దాం. అగ్నివీర్‌ల నియామకం మెరుగైన విధానమే అయితే, అది ఎలాగో యువతకు వివరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. హడావుడిగా ప్రకటన చేయడంవల్లనే ప్రస్తుత ఆందోళనలు. కేంద్రం చేపట్టిన దిద్దుబాటు చర్యలు పరిస్థితులను అదుపులోకి తెస్తాయో లేదో వేచి చూడాలి.
Also Read: KCR CBI Attacks: కేసీఆర్ పై సీబీ‘ఐ’.. కేఏపాల్ తో మోడీ నరుక్కొస్తున్నారా?