AP Police – BJP : ఏపీ పోలీస్ కాళ్ల కింద నలిగిన బీజేపీ పరువు
నిరసన తెలిపేందుకు వచ్చిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కాన్వాయ్ ను అడ్డుకుంటారేమోనన్న ఉద్దేశంతో రోడ్డు పక్కన ఉన్న వారిని కూడా వదిలి పెట్టకుండా లాగేశారు. ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారి రెండుకాళ్ల మధ్య నలిగిపోతూ ఓ నేత ఫొటోకు చిక్కారు. దీంతో క్షణాల్లో అది వైరల్ అయ్యింది.

AP Police – BJP : ఓ పోలీస్ అధికారి రెండు కాళ్ల మధ్య ఒక వ్యక్తి తల ఉంటుంది. బయటపడలేక సదరు వ్యక్తి బిగ్గరగా అరుస్తూ కనిపిస్తుంటాడు. సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది. ఆయనెవరో ప్రజా సంఘాల నేతో.. లేకుంటే టీడీపీ, జనసేన నాయకుడంటే మీరు పొరబడినట్టే. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన నాయకుడు. కావలిలో చుక్కల భూమి పట్టాలను సీఎం జగన్ లబ్ధిదారులకు అందించిన సంగతి తెలిసిందే. వివిధ సమస్యలపై నిరసన తెలిపేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించగా ..ఇలా పోలీసులు ప్రతిఘటించడంతో కాషాయదళం ఉక్కిరిబిక్కిరయ్యింది. పోలీసుల దాష్టీకాన్ని నిష్టూరమాడింది. అయితే ఏదైనా తన దాకా వస్తే కానీ ఆ పెయిన్ తెలియదంటారు. ఇప్పుడు బీజేపీ నేతలకు ఆ బాధ బాగానే తగిలిందన్న మాట.
నిరసన తెలిపితే..
వైసీపీతో బీజేపీ దోస్తానా ఉందని ఊరూ వాడా కోడై కూస్తోంది. అదే సమయంలో పచ్చ పార్టీపై అభిమానం ఉన్నవారు కూడా బీజేపీలో కోకొల్లలు. దీంతో నిజమైన కాషాయదళం చాలా ఇబ్బందులు పడుతోంది. అటువంటి బ్యాచ్ ఒకటి సీఎం సభలో నిరసన తెలిపేందుకు బయలుదేరింది. దీంతో వారిపై పోలీసులు ప్రతాపం చూపారు. నిరసన తెలిపేందుకు వచ్చిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అసలు సభ దగ్గరకు కూడా వెళ్లలేదు. కాన్వాయ్ ను అడ్డుకుంటారేమోనన్న ఉద్దేశంతో రోడ్డు పక్కన ఉన్న వారిని కూడా వదిలి పెట్టకుండా లాగేశారు. పక్కకు తోసే క్రమంలో కొందరు కిందకు పడిపోయారు. అటువంటి వారు ప్రతిఘటించేలోపే చుట్టుముట్టేశారు. ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారి రెండుకాళ్ల మధ్య నలిగిపోతూ ఓ నేత ఫొటోకు చిక్కారు. దీంతో క్షణాల్లో అది వైరల్ అయ్యింది.
బీజేపీపైనే విసుర్లు..
అయితే ఇక్కడ వైసీపీ అరాచకం కంటే ఆ పార్టీతో బీజేపీ దోస్తానే పెద్ద హైలెట్ అవుతోంది. ఏపీలో పోలీసు అరాచకాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపేలా ఉన్న ఆ ఫోటో ఇప్పుడు బీజేపీకి వైసీపీ తన స్థానాన్ని చూపించిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ ఘటన జరిగినప్పుడు కన్నా.. ఫోటో వైరల్ అయిన తర్వాత బీజేపీ నేతలు, శ్రేణుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. రాష్ట్రంలో అరాచక పాలనకు నిలువెత్తు నిదర్శనం ఈ దృశ్యమంటూ సోషల్ మీడియాలో కామెంట్లు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో మీదాకా వస్తే తెలిసిందా అంటూ నెటిజన్లు బీజేపీని టార్గెట్ చేసుకున్నారు. ఇకనైనా మేల్కొండి అంటూ హితబోధ చేశారు.
రియాక్ట్ అయినా..
ఈఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రియాక్టయ్యారు. పోలీసులు అరాచకంగా వ్యవహరించి భయానక వాతావరణాన్ని సృష్టించారని మండిపడ్డారు. సమస్యలు చెప్పుకుందామని వెళితే ఇదా ట్రీట్ మెంట్ అంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలొ ఉన్నామా నిరంకుశ రాచరిక వ్యవస్ధలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు. అయితే అక్కడ అంత సినిమా జరగలేదని పోలీస్ వర్గాలు చెబతుున్నాయి. అయితే బీజేపీ నేత నలిగిన ఫొటో మాత్ర సగటు కాషాయదళం సభ్యుడికి తెగ కోపం తెప్పిస్తోంది. అయితే హైకమాండ్ స్నేహంగా ఉండడంతో మనలాంటి వారికి ఎందుకీ పరిస్థితి అంటూ ఎవరికి వారే చర్చించుకుంటున్నారు. హైకమాండ్ దోస్తీ చేసి మమ్మల్ని పోరాడమంటే పరిస్థితి ఇలానే ఉంటుందని నిట్టూరుస్తున్నారు.
