BJP – YS Jagan Alliance : ముసుగు తీసిన బీజేపీ… ఇక జగన్ వైపేనే
తనను అకారణంగా జైలుపాలు చేసిందని.. సీబీఐ కేసులు నమోదుచేయించిందని ఇప్పటికీ జగన్ బాధపడుతుంటారు. చంద్రబాబు, కేసీఆర్ లా జగన్ కాంగ్రెస్ వ్యతిరేక స్టాండ్ మారదని బీజేపీ పెద్దలు నమ్ముతున్నారుట. ఈ కారణం చేతనే ఇన్నాళ్లు అదృశ్య శక్తిగా సహకరించిన బీజేపీ… ఎన్నికల ముంగిట ముసుగు తీసేసింది.

BJP – YS Jagan Alliance : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయా? ముఖ్యంగా అధికార వైసీపీ, బీజేపీ మధ్య వ్యూహాలు మారుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీ నిర్ణయాలపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఒక వైపు అవినాష్ రెడ్డి ఇష్యూ, మరోవైపు రెవెన్యూ లోటు నిధుల విడుదలతో వైసీపీకి సపోర్టుగా నిలబడుతోంది బీజేపీ. ఇప్పటివరకూ అదృశ్య శక్తిగా అభయమిచ్చిన బీజేపీ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల వరకూ జగన్ సర్కారు తప్పిదాలపై చార్జిషీట్ లు అంటూ హడావుడి చేసిన కమలనాథులు సెడన్ గా యూటర్న్ తీసుకున్నారు. తమకు ఓట్లు, సీట్లతో పనిలేదు. నమ్మదగిన మిత్రుడు జగన్ బాగుంటే చాలు అన్నట్టు బీజేపీ హైకమాండ్ వ్యవహార శైలి ఉంది.
వైసీపీ సర్కారుపై బీజేపీ నేతలు విమర్శల డోసు పెంచారు. కానీ ఇటీవల తగ్గించారు. దీని వెనుక పెద్ద స్కెచ్చే ఉన్నట్టు తెలుస్తోంది. గత నాలుగేళ్లుగా బీజేపీ జగన్ సర్కారు పట్ల మెతక వైఖరే కనబరిచింది. స్థానిక నేతలు ఎన్ని రకాల విమర్శలు చేసినా కేంద్ర పెద్దలు మాత్రం జగన్ న్ని కానివ్వండి ఆయన ప్రభుత్వాన్ని కానివ్వండి పల్లెత్తు మాట అనకుండా మౌనం వహించేవారు. అడపా దడపా జగన్ పాలన పై కితాబు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీంతో స్థానిక బీజేపీ నాయకులు ఎవరేమనుకుంటే తమకేం మోదీ-షా, ద్వయం ఆశీస్సులు తమకు పుష్కలంగా ఉన్నాయనే ధైర్యం వైసీపీ నేతల్లో కనిపించేది. ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయనేది రాజకీయ పండితుల భావన. గత కొద్దిరోజులుగా వివేకా హత్యకేసు విచారణే దీనికి ఉదాహరణ.
కేంద్రం అనుమతి లేనిదే సీబీఐ అంత సాహసం చేయలగలదా? అంటే లేదనే సమాధానం. బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత విపక్షాలపై సీబీఐ, ఈడీలను ప్రయోగించింది. తమకు రాజకీయంగా అడ్డంకి వచ్చే ఏ ఒక్కర్నీ విడిచిపెట్టడం లేదు. తమనే టార్గెట్ చేస్తారా అంటూ ఢిల్లీలోని ఆప్ సర్కారుపైనే కన్నెర్ర జేశారు. ఏకంగా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సిసోడియానే సీబీఐ ద్వారా అదుపులోకి తీసుకున్నారు. చివరకు తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తెను సైతం విచారణకు పిలిచారు. సీబీఐ అంటే కేవలం రాజకీయం కోసమేనన్నట్టు వాడుకుంటున్నారు. అటువంటి సీబీఐ అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో మీనమేషాలు లెక్కిస్తుందంటే దాని వెనుక ఉన్న అదృశ్య శక్తి బీజేపీయేనని తేలిపోయింది. సందట్లో సడేమియా అన్నట్టు ఎప్పడో చంద్రబాబు కాలం నాటి రెవెన్యూ లోటు నిధులను జగన్ చేతిలో పెట్టింది. 2014, 15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ లోటు కింద రూ.10,460.87 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం కింద ఈ మొత్తాన్ని మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థికశాఖ (వ్యయ) అసిస్టెంట్ డైరెక్టర్ మహేంద్ర చండేలియా ఆదేశాలు ఇవ్వడం విశేషం.
అయితే సరిగ్గా కర్నాటక ఎన్నికల తరువాత బీజేపీ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. దక్షిణాదిన లోక్ సభ సీట్లు గణనీయంగా తగ్గుముఖం పడతాయి. అది జగన్ ద్వారా భర్తీ చేసుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి నమ్మదగిన మిత్రుడు ఏపీ సీఎం జగన్ గా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఆయన కాంగ్రెస్ కు వ్యతిరేకి కావడమే. కాంగ్రెస్ ను బీజేపీ ఎంత ద్వేషిస్తుందో… జగన్ కూడా అంతే ద్వేషిస్తారు. తనను అకారణంగా జైలుపాలు చేసిందని.. సీబీఐ కేసులు నమోదుచేయించిందని ఇప్పటికీ జగన్ బాధపడుతుంటారు. చంద్రబాబు, కేసీఆర్ లా జగన్ కాంగ్రెస్ వ్యతిరేక స్టాండ్ మారదని బీజేపీ పెద్దలు నమ్ముతున్నారుట. ఈ కారణం చేతనే ఇన్నాళ్లు అదృశ్య శక్తిగా సహకరించిన బీజేపీ… ఎన్నికల ముంగిట ముసుగు తీసేసింది.