Telangana BJP: వద్దన్నవారికి టికెట్.. కావాలన్నవారికి మొండిచేయి!
బీజేపీ నుంచి ఈసారి పోటీ చేయనని బాబు మోహన్ రెండు రోజుల క్రితమే ప్రకటించారు. ఈమేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రెస్‌మీట్ కూడా పెట్టారు.

Telangana BJP: బీజేపీలో తెలంగాణ అసెంబ్లీ టికెట్ల కేటాయింపు అందరి అంచనాలను తారుమారు చేస్తోంది. తాజాగా బీజేపీ 35 మందితో మూడో జాబితా విడుదల చేసింది. ఇందులో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ముషీరాబాద్, సికింద్రాబాద్ టికెట్ ఆశించిన బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి టికెట్లు ఆశించారు. కానీ మూడో జాబితాలో వారికి టికెట్లు దక్కలేదు. వారు ఆశించిన స్థానాల్లో ఇతరులకు టికెట్ ఇచ్చారు.
టికెట్ వద్దన బాబు మోహన్‌కు టికెట్..
బీజేపీ నుంచి ఈసారి పోటీ చేయనని బాబు మోహన్ రెండు రోజుల క్రితమే ప్రకటించారు. ఈమేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రెస్‌మీట్ కూడా పెట్టారు. కానీ, మూడో జాబితాలో బీజేపీ అధిష్టానం ఆయనకు టికెట్ ఇచ్చారు. అలాగే గద్వాల నుంచి కూడా పోటీకి డీకే.అరుణ నిరాకరించారు. ఆ టికెట్ బీసీలకు ఇవ్వాలన్నారు. గద్వాల టికెట్ కూడా పెడింగ్‌లో పెట్టారు.
తనకు బాధ్యతలు ఇవ్వలేదని..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా.. తనను ఎవరూ పట్టించుకోవడం లేదని బాబు మోహన్ ఆరోపించారు. కిషన్‌రెడ్డికి ఫోన్ చేసినా స్పందించడం లేదని, తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదని పేర్కొన్నారు. అందుకే ఈసారి తాను ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. తన స్థానంలో ఎవరైనా అర్హులకు టికెట్ ఇవ్వాలని సూచించారు. కానీ బీజేపీ టికెట్ వద్దన్న బాబు మోహన్‌నే వరించింది.
టిక్కెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం..
ఇదిలా ఉండగా బీజేపీ ఇప్పటి వరకు 88 స్థానాలకు టికెట్లు కేటాయించింది. ఇందులో ఓబీసీలకు 33, బీసీలకు 33, ఎస్సీలకు 13, ఎస్టీలకు 9 టికెట్లు కేటాయించింది. ముందు నుంచి చెబుతున్నట్లుగానే బీసీలకు బీజేపీ తగిన ప్రాధాన్యం ఇస్తుంది. అయితే మహిళల విషయంలోనే బీఆర్‌ఎస్ కంటే ఎక్కువ టిక్కెట్లు ఇస్తామని ప్రకటించిన బీజేపీ పూర్తిజాబితా వచ్చిన తర్వాత ఎంతమందికి టిక్కెట్లు ఇచ్చింది అన్నది నిర్ధారణ కానుంది.
