Babu Mohan: బాబు మోహన్ హెచ్చరికలకు తలొగ్గిన బిజెపి
2018 ఎన్నికలకు ముందు బాబు మోహన్ బిఆర్ఎస్ లో ఉండేవారు. 2014 ఎన్నికల్లో ఆందోల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. కెసిఆర్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు.

Babu Mohan: ప్రముఖ హాస్యనటుడు బాబు మోహన్ తన పంతం నెగ్గించుకున్నారు. బిజెపి హై కమాండ్ కు హెచ్చరించి మరీ ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి బిజెపి మూడో జాబితాను ఈరోజు విడుదల చేసింది. మొత్తం 35 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ జాబితాలో బాబు మోహన్ ఉండడం విశేషం. కొద్దిరోజుల కిందట అలకపాన్పు ఎక్కిన ఆయన రాజీనామా అస్త్రాన్ని సంధించారు.రాష్ట్ర నాయకత్వం పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబంలో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. కానీ ఇవేవీ మనసులో పెట్టుకొని బిజెపి హై కమాండ్ ఆందోల్ నియోజకవర్గం టిక్కెట్ను బాబు మోహన్ కు కట్టబెట్టడం విశేషం.
2018 ఎన్నికలకు ముందు బాబు మోహన్ బిఆర్ఎస్ లో ఉండేవారు. 2014 ఎన్నికల్లో ఆందోల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. కెసిఆర్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. అయితే 2018 ఎన్నికల్లో ఆయన పనితీరు బాగాలేదని చెప్పి కెసిఆర్ టికెట్ కు నిరాకరించారు. దీంతో బాబు మోహన్ బిజెపిలో చేరారు. బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఏకంగా మూడో స్థానానికి పడిపోయారు. దీంతో తాజా ఎన్నికల్లో బాబు మోహన్ కు బిజెపి టిక్కెట్ ఇవ్వదని ప్రచారం జరిగింది. ఆయన స్థానంలో కుమారుడికి టికెట్ ఇస్తారని టాక్ నడిచింది. దీంతో మనస్థాపానికి గురైన బాబు మోహన్ బిజెపిని వీడేందుకు సిద్ధమయ్యారు.
గత నెలలో ఏకంగా మీడియా సమావేశం పెట్టి బిజెపి నేతల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు తాను ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడికి టికెట్ ఇచ్చే ఉద్దేశం ఉంటే చెప్పాలని.. అనవసరంగా తండ్రీ కొడుకుల మధ్య గొడవ పెడతారని ప్రశ్నించారు. తనకంటూ ఓ సినీ గ్లామర్ ఉందని.. అటువంటి నన్ను తొలి జాబితాలో ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. దీంతో బాబు మోహన్ పై బిజెపి అధినాయకత్వం చర్యలు తీసుకుంటుందని అంతా భావించారు. కానీ ఆయనకు ఆందోల్ నియోజకవర్గం టిక్కెట్ కేటాయిస్తూ ప్రకటన జారీ చేయడం విశేషం. ఒక విధంగా నాయకత్వానికి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి బాబు మోహన్ టిక్కెట్ దక్కించుకున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.
