Delhi Liquor Scam Case Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బిగ్ ట్విస్ట్: కవిత ఏమన్నారంటే?
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను కట్టడి చేయాలని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.. ఈ పిటిషన్ ను విచారించే బాధ్యత జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ కు సుప్రీంకోర్టు అప్పగించింది. అయితే ఆయన అందుబాటులో లేని కారణంగా సోమవారం కోర్టు నెంబర్ 2 కార్యకలాపాలు రద్దయ్యాయి.

Delhi Liquor Scam Case Kavitha: కొన్నాళ్లపాటు ఎటువంటి అలికిడి లేని ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో.. మరోసారి కదలిక వచ్చింది. సోమవారం ఈ కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టుకు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత రావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఈ కేసు విచారణ వాయిదా పడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని, సుప్రీంకోర్టును భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత ఆశ్రయించిన విషయం తెలిసిందే. తనపై ఇటువంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను కట్టడి చేయాలని ఆమె కోరిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన విచారణ సోమవారం కోర్టు ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ కేసు విషయంలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితను భారతీయ జనతా పార్టీ పెద్దలు కాపాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు చెందిన నాయకులు ఒక ఒప్పందానికి వచ్చారని, దానికి కట్టుబడే కవితను కాపాడుతున్నారని విమర్శిస్తున్నారు. ఈ కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో కోర్ట్ నంబర్ 2,8 కార్యకలాపాలు రద్దయ్యాయి. దీంతో కేసు వాయిదా పడింది.
జస్టిస్ అందుబాటులో లేని కారణంగా..
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను కట్టడి చేయాలని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.. ఈ పిటిషన్ ను విచారించే బాధ్యత జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ కు సుప్రీంకోర్టు అప్పగించింది. అయితే ఆయన అందుబాటులో లేని కారణంగా సోమవారం కోర్టు నెంబర్ 2 కార్యకలాపాలు రద్దయ్యాయి. దీంతో కవిత దాఖలు చేసిన కేసు విచారణ వాయిదా పడింది. న్యాయమూర్తి అందుబాటులో లేని కారణంగా ఆ కోర్టు కార్యకలాపాలు రద్దు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. జస్టిస్ ఎస్. రవీంద్ర భట్ అందుబాటులో లేకపోవడంతో కోర్టు నంబర్ 8 కార్యకలాపాలు కూడా రద్దయ్యాయి. కోర్టు నెంబర్ 2,8 లో రద్దయిన కేసుల విచారణ తేదీలు త్వరలో తెలియజేస్తామని సుప్రీంకోర్టు వివరించింది.
మీడియాలో హడావిడి
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను కట్టడి చేయాలని కొద్ది రోజుల క్రితం భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసు కు సంబంధించి కవిత దగ్గర పని చేసిన మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు అప్రూవర్ గా మారాడు. సౌత్ గ్రూప్ ద్వారా ఈ కుంభకోణంలో కవిత కీలకపాత్ర పోషించారని అతడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట ఒప్పుకున్నాడు. మరోవైపు శరత్ చంద్రా రెడ్డి కూడా ఇదే విషయాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులకు చెప్పాడు. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి కవిత పాత్ర బలంగా ఉందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఒక అంచనాకొచ్చారు.. ఇందులో భాగంగా రెండుసార్లు ఆమెను విచారించారు. మరోసారి విచారణకు హాజరు కావాలని అధికారులు కోరగా.. కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విచారణ సోమవారం చేపట్టాల్సి ఉండగా.. ఈ కేసును విచారించే న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడింది. కాగా సుప్రీంకోర్టు బెంచ్ ఎదుటకు ఈ కేసు విచారణ కు రావడంతో సోమవారం ఢిల్లీలో హడావిడి నెలకొంది. కవితకు ఊరట ఇచ్చేలా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుందా? ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చర్యలను సమర్థిస్తుందా? అని అందరూ ఎదురు చూశారు. కానీ అనూహ్యంగా న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో కేసు విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ ఎప్పుడు అనేది చెబుతామని సుప్రీంకోర్టు వెల్లడించింది.
కవిత ఏమన్నారంటే..
ఇక ఈ కేసు విచారణ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి చేరుకున్నారు. పార్టీ అంతర్గత వర్గాలు చెప్పిన దాని ప్రకారం ఆమె ఆదివారం సాయంత్రమే ఢిల్లీ వెళ్లారు. కేసీఆర్ అధికారిక గృహంలో బస చేశారు. సోమవారం తన వ్యక్తిగత లాయర్ తో మాట్లాడారు. తర్వాత కేసు విచారణ పడిందని తెలుసుకొని హైదరాబాద్ కు తిరిగి ప్రయాణమయ్యారు. తప్పకుండా న్యాయం గెలుస్తుందని, అంతిమ విజయం తనదే అని పార్టీ కార్యకర్తలతో జరిపిన అంతర్గత సంభాషణలో ఆమె పేర్కొన్నారు.
