Etela Rajender Lands: ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వందల ఎకరాల భూములు ఆక్రమించని, జగదీష్ రెడ్డి సూర్యాపేట కలెక్టరేట్ తన భూముల పక్కనే నిర్మించుకోని, దళిత బంధులో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య ఇష్టానుసారంగా వ్యవహరించని, నిర్మల్ లో ఇంద్రకరణ్ రెడ్డి అటవీ భూములను చెరపట్టని, జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చెరువునే మింగేయనీ.. ఇవన్నీ కేసీఆర్ కు ఎక్కవు. ఎక్కినా పెద్దగా చర్యలు ఉండవు. ఎందుకంటే వారు ఎదురు తిరగలేరు కాబట్టి.. మేమే ఓనర్లమని చెప్పలేరు కాబట్టి.. కీలు ఎరిగి వాత పెట్టడంలో, అదును చూసి దెబ్బ కొట్టడంలో కేసీఆర్ సిద్ధహస్తుడు. ఆలే నరేంద్ర నుంచి విజయశాంతి దాకా ఎవరు తనకు ఎదురు తిరిగినా సహించే మనస్తత్వం కేసీఆర్ ది కాదు. అలాంటి కేసీఆర్ గుణం తెలిసినా, అతడి మనస్తత్వం చాలా ఏళ్ల గానే ఎరిగినా ఈటల రాజేందర్ ఎదురు తిరిగారు. పార్టీకి మేమే ఓనర్ల మంటూ స్వరం పెంచారు. సీన్ కట్ చేస్తే ఆ పార్టీ నుంచి ఆయనే అవమనకర రీతిలో వెళ్ళిపోయారు. పైగా అసైన్డ్ భూములు కబ్జా చేశారని ఆరోపణలను ఎదుర్కొన్నారు. కొన్నాళ్లు జనాల నోళ్ళల్లో నానిన ఆ కేసు తర్వాత కోల్డ్ స్టోరేజ్ కి వెళ్ళింది. కేసీఆర్ కు దేన్ని ఎప్పుడు ఎలా వాడుకోవాలో తెలుసు కాబట్టి అలా పక్కన ఉంచారు. ఇప్పుడు మళ్లీ బూజు దులిపారు.

Etela Rajender, KCR
అమిత్ షా భేటీ తో
హుజరాబాద్ గెలుపు తర్వాత ఈటల రాజేందర్ కు బీజేపీ లో క్రియాశీలకమైన పాత్ర లభిస్తుందని అందరూ ఆశించారు. కానీ జరిగింది వేరు. తుక్కుగూడ సభలో బండి సంజయ్ కి, ఈటల రాజేందర్ కు విభేదాలు ఉన్నట్లు గమనించిన అమిత్ షా.. రంగంలోకి దిగారు. ఈటల రాజేందర్ ను ఢిల్లీకి పిలిపించుకొని నచ్చజెప్పారు. అంతే కాదు గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ ఎదిగేందుకు చేయాలని కొత్త బాధ్యతలు అప్పజెప్పారు. తర్వాత ఈటల రాజేందర్ తన ఫోకస్ గజ్వేల్ మీదకి మళ్లించారు. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అన్న తీరుగా సీఎం నియోజకవర్గంలోని నాయకులతో మంతనాలు జరపడం ప్రారంభించారు. ఒకరిద్దరు నాయకులను బీజేపీలోకి చేర్పించేందుకు దాదాపు ప్రణాళికలు సిద్ధం చేశారు. తెలంగాణలో చీమ చిటుక్కుమన్నా తెలుసుకునే కేసీఆర్.. గజ్వేల్ లో చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈటల రాజేందర్ చతురతను గమనించారు. ఆదిలోనే దానికి చెక్ పెట్టేలా కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టారు.
Also Read: AP Employees GPF Money : ఉద్యోగుల జీపీఎఫ్ డబ్బులు మాయం ఉద్యోగుల రూ.800 కోట్లు ఎటు మళ్లించారు?
తెరపైకి అసైన్డ్ భూముల పంపిణీ
రాష్ట్ర వ్యాప్తంగా తమ పోడు భూములకు పట్టాలివ్వాలని గిరిజన రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోని కేసీఆర్.. ఆగమేఘాల మీద ఈటల రాజేందర్ ఆధీనంలో ఉన్న అసైన్డ్ భూములను రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే ఆయా రైతులు అధికారులను కలిసినట్టు తెలుస్తోంది. మాసాయిపేట మండలంలోని హకీంపేట, అచ్చంపేట లోని జమున హేచరీస్ భూములను కలెక్టర్ హరీష్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. సుమారు 56 మంది రైతుల చెందిన 70 ఎకరాల అసైన్డ్ భూములు ఆక్రమణకు గురైనట్టు వారు తేల్చారు. నేడో రేపో ఆ భూముల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Etela Rajender, kcr
ప్రధాని పర్యటన నేపథ్యంలో..
జూలై 2, 3 తేదీల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాదులో పర్యటించనున్నారు. ఆయన తో పాటుగా బీజేపీ కి చెందిన అతిరథ మహారధులు కూడా రాబోతున్నారు. ఈ మధ్య మూడు సార్లు తెలంగాణకు మోదీ వచ్చినప్పుడు ఈటల రాజేందర్ ను ప్రత్యేకంగా అభినందించారు. వైపు ఈటల రాజేందర్ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగడుగునా ఎండగడుతున్నారు. దీనికి కౌంటర్ ఇచ్చే సాహసం టీఆర్ఎస్ లో ఎవరూ చేయలేకపోతున్నారు. పైగా అసైన్డ్ భూముల ఆక్రమణ వ్యవహారంలో సర్కారు వ్యవహరించిన తీరు ఈటల రాజేందర్ కే లబ్ధి చేకూర్చింది. అదే ఆయన్ను హుజరాబాద్ లో గెలిచేలా చేసింది. మరోవైపు ఈటల రాజేందర్ పై రగిలిపోతున్న కేసీఆర్ ఏదో ఒకటి చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఆయన ఆధీనంలో ఉన్న అసైన్డ్ భూములను రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీనికి తెర వెనుక మంత్రి హరీష్ రావు సహకారం అందిస్తుండగా.. కలెక్టర్ హరీష్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సర్వేలను ముమ్మరం చేస్తున్నారు.
రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నందునేనా?
అటు మోదీ ప్రత్యేకంగా అభినందించడం, ఇటు అమిత్ షా అభయం ఇవ్వడంతో ఈటల రాజేందర్ రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. మొన్నామధ్య ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాన్ని ఈటల రాజేందర్ పరామర్శించారు. అదేవిధంగా ఇటీవల ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న బిజెపి కార్యకర్త సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ సమయంలో సర్కార్ చేస్తున్న తప్పిదాలను గణాంకాలతో సహా వివరించారు. దీనికి తోడు బిజెపిలో అంతకంతకు ఈటెల రాజేందర్ ప్రాధాన్యం ఇటీవల పెరుగుతుండటంతో కెసిఆర్ తట్టుకోలేక భూముల పంపిణీ అంశాన్ని తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. బోధన్ వాణిజ్య పన్నుల కేసు, డ్రగ్స్ కేసు, మియాపూర్ భూ కుంభకోణం వంటి వాటిని కోల్డ్ స్టోరేజీలో పడేసిన కేసీఆర్.. ఇప్పుడు జమున హేచరీస్ కేసును తెరపైకి తేవడం, అందునా ప్రధానమంత్రి పర్యటనకు ముందుగానే దీనికి రూపకల్పన చేయటం.. ఆసక్తికరంగా మారింది.
Also Read:PM Modi AP Tour: మోదీ రాక.. ఏపీ బీజేపీ రాత మార్చేనా!?.. కమలం వ్యూహం ఏమిటి?