Gujarat Elections- Arvind Kejriwal: స్వచ్ఛమైన రాజకీయాల పేరుతో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ శుద్ధ పూస కాదు అని మరోసారి తేలిపోయింది.. ఢిల్లీ లిక్కర్ స్కాం లో పీకలలోతు మునిగిపోయిన ఆ పార్టీ మరో కుంభకోణంలో ఇరుక్కుంది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నామని పదేపదే డబ్బా కొట్టుకుంటున్న అరవింద్ కేజ్రీవాల్.. తరగతి గదుల నిర్మాణం పేరుతో 1300 కోట్లు నొక్కేసారని సమాచారం. దీనిపై ప్రత్యేక దర్యాప్తుకు విజిలెన్స్ డైరెక్టరేట్ సిఫారసు చేయడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం చెలరేగుతున్నది. లిక్కర్ స్కాం మీద ఒక వైపు దర్యాప్తు జరుగుతోంది. ఇది మరవక ముందే ఈ కేసు తెర పైకి రావడం గమనార్హం.

Gujarat Elections- Arvind Kejriwal
విజిలెన్స్ డైరెక్టరేట్ సిఫారసు
ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలల తరగతి గదుల నిర్మాణంలో భారీ అవినీతి జరిగింది.. దీనిపై ప్రత్యేక విచారణ జరిపించాలని విజిలెన్స్ డైరెక్టరేట్ సిఫారసు చేసింది.. మొత్తం 193 పాఠశాలల్లో 2,405 తరగతి గదుల నిర్మాణంలో ₹1300 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు విజిలెన్స్ విభాగం చెప్పడం సంచలనాన్ని రేకెత్తిస్తోంది. పైగా వీటి నిర్మాణంలో భారీగా ఉల్లంఘనలు, అవినీతి జరగడంతో అధికారులను బాధ్యులను చేయాలని విజిలెన్స్ డైరెక్టరేట్ సూచించింది. 2015లో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అదనపు తరగతి గదుల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది.. వీటి నిర్మాణంలో అక్రమాలు జరిగాయని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ 2020 ఫిబ్రవరి 17న నివేదిక ఇచ్చింది.. దీనిని ఢిల్లీ విజిలెన్స్ డైరెక్టరేట్ కు పంపింది. అయితే రెండు సంవత్సరాలుగా దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.. ఇక ఈ నివేదికను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తప్పు పట్టారు..
గుజరాత్ ఎన్నికల ముందు
గుజరాత్ రాష్ట్రంలో ఈసారి త్రిముఖ పోరు నెలకొన్నది. ఒకానొక దశలో ఆమ్ ఆద్మీ పార్టీ బిజెపికి గట్టి పోటీ ఇస్తుందని మొన్నటిదాకా పలు సర్వేలు తేల్చి చెప్పాయి. ఈ క్రమంలో ఇటీవల ఢిల్లీ తీహార్ జైల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత సత్యేంద్ర జైన్ మసాజ్ చేయించుకుంటున్న వీడియో బయటకు వచ్చింది. అయితే ఆ సమయంలో ఆయన ఫిజియో థెరపీ చేయించుకుంటున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కవర్ చేశారు. కానీ అతడికి మసాజ్ చేసింది కరడుగట్టిన నేరగాడు.. కన్న కూతురిపై అత్యాచారం చేసి జైలుకు వెళ్లిన వ్యక్తితో సత్యేంద్రజైన్ మసాజ్ చేయించుకున్నారు.. దీనిని పూర్తి ఆధారాలతో బిజెపి బయట పెట్టడంతో ఆప్ కక్కలేక మింగలేక ఉండిపోయింది. ఇది సరిపోదు అన్నట్టు ఇప్పుడు తరగతి గదుల కుంభకోణం తెరపైకి రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి డిఫెన్స్ లో పడింది. వీటిని చూపించుకుంటూ బిజెపి నాయకులు గుజరాత్ రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సుద్దపూస కాదని ప్రజలకు చేరువ చేస్తున్నారు.

Gujarat Elections- Arvind Kejriwal
యువకులను ఆకట్టుకునే యత్నం
ఆమ్ ఆద్మీ పార్టీపై వరుస ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కాం పై ఈడీ అధికారులు పట్టు బిగించారు. మొన్నటిదాకా మనీష్ సిసోడియాను కార్నర్ చేసిన అధికారులు… ఈసారి మరిన్ని పెద్ద తలకాయలను టార్గెట్ చేశారు. పదివేల పేజీలతో దర్యాప్తు నివేదికను తయారు చేశాయి.. అయితే ఈ కేసులో భారీ ఎత్తున నగదు మారినట్టు ఈడి అధికారులు చెబుతున్నారు. అయితే ఈ వరుస ఘటనలతో ఆప్ ప్రభ గుజరాత్ రాష్ట్రంలో క్రమంగా మసక బారే ప్రమాదం కనిపిస్తోంది. మొన్నటిదాకా యువకులు ఆప్ వెంట తిరిగారు. కానీ బిజెపి నాయకులు వరుస కుంభకోణాల విషయాలను వారికి అర్థమయ్యేలా చెబుతూ ఆకర్షిస్తున్నారు. పాటి దార్లు కూడా ఈసారి బిజెపి వైపే ఉండటం గమనార్హం.