Bangladesh vs India : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో భారత జట్టు స్థానం నాలుగు.. బంగ్లాదేశ్ ర్యాంకు 7. ఇలా ఏ లెక్కన చూసుకున్నా భారత జట్టు దే పై చేయి.. కానీ ఏం జరిగింది? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, లాంటి మేటి బ్యాట్స్మెన్ ఉన్న జట్టు ఎంత స్కోరు సాధించింది? ముక్కి మూలిగి 186. ఈ పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునేందుకు నానా తంటాలు పడింది. కానీ చివరకు బంగ్లాదేశ్ జట్టు చేతిలో ఓడిపోయింది. మరో ఏడాదిలో వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచి ఇది జట్టా? ఇదే జట్టా? అనే ప్రశ్నలు ప్రేక్షకుల మెదళ్ళల్లో నానేలా చేసింది. వెంటనే ఈ జట్టును ప్రక్షాళన చేసి వన్డే వరల్ట్ కప్ కు బలమైన టీంను తయారు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
-బంగ్లా బదులు తీర్చుకుంది
టి20 మెన్స్ వరల్డ్ కప్ లో ఓటమికి బంగ్లాదేశ్ బదులు తీర్చుకుంది.. ఆదివారం స్వదేశంలో జరిగిన మొదటి వన్డేలో భారత జట్టుపై బంగ్లాదేశ్ ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. బౌలర్ల ఆధిపత్యం నడిచిన ఈ మ్యాచ్లో ఒకే రోజు 19 వికెట్లు నేల కూలాయి. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు ఆదిలోనే తడబడ్డది. కీలకమైన వికెట్లు వెంటనే కోల్పోయింది. మొత్తానికి 186 పరుగులు సాధించింది. కేఎల్ రాహుల్ కనుక నిలబడకపోయి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేది. వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టే ఔట్ అయి వెళ్లిపోతుండటంతో కేఎల్ రాహుల్ ఒక్కడే నిలబడ్డాడు. దాదాపు ఒంటరి పోరాటం చేశాడు.. ఐదో బ్యాట్స్మెన్ గా వచ్చిన రాహుల్.. తొమ్మిదో వికెట్ గా వెనుతిరిగాడు. 70 బంతులు ఎదుర్కొని 73 పరుగులు చేశాడు. ఇందులో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఇక ఆట మొదలుపెట్టిన ఇండియా బ్యాట్స్మెన్ మాకెందుకు వచ్చిన తంటా అన్నట్టుగా ఆడారు. బంగ్లాదేశ్ బౌలర్లు నిప్పులాంటి బాళ్ళు వేస్తుండడంతో గల్లి స్థాయి మాదిరి ఆడారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్లిపోయారు. రోహిత్ 27, ధావన్ 7, కోహ్లీ 9, అయ్యర్ 24, వాషింగ్టన్ సుందర్ 19 పరుగులు మాత్రమే చేసి ఉసురుమనిపించారు.
-బంగ్లా బౌలర్లా మజాకా
మ్యాచ్ ప్రారంభం నుంచే బంగ్లా బౌలర్లు తమ దూకుడు ప్రదర్శించారు. ముఖ్యంగా షకీబ్ భారత టాప్ ఆర్డర్ వెన్ను విరిచాడు. ఐదు వికెట్లు తీసి షాక్ ఇచ్చాడు. ఇతనికి హుస్సేన్ తోడయ్యాడు. అతడు కూడా నాలుగు వికెట్లు తీశాడు. వీరిద్దరి దెబ్బకి భారత బ్యాట్స్మెన్ క్రీజ్ లో కుదురుకునేందుకే ఇబ్బంది పడ్డారు.
-ఆదుకున్న లిటన్ దాస్, మిరాజ్
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ డర్టీ కూడా భారత బౌలర్ల ధాటికి ఇబ్బంది పడింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. ఒక దశలో భారత జట్టే గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ లిటన్ దాస్, మీరాజ్ భారత బౌలర్లను ప్రతిఘటించారు. వీరిద్దరూ కనుక నిలబడకపోయి ఉంటే బంగ్లా జట్టు 120 లోపే ఆల్ అవుట్ అయ్యేది. భారత బౌలర్లలో సిరాజ్ మూడు, కుల్ దీప్ సేన్ 2, సుందర్ 2, శార్దూల్ 1, దీపక్ 1 వికెట్లు తీశారు. భారత బౌలర్లలో సిరాజ్ బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ ను వణికించాడు.
ఎలా చూసుకున్న మన టీమిండియాతో పోల్చితే బంగ్లా దేశ్ చిన్న జట్టే. కానీ సొంతగడ్డపై వాళ్లు నిజంగానే పులులు అనిపించారు. మనోళ్లు ఐపీఎల్ లో.. స్వదేశంలో తప్ప బలమైన జట్లపై ఆడలేరని నిరూపించుకున్నారు. టీ20 వరల్డ్ కప్, అంతకుముందు ఆసియా కప్.. ఇప్పుడు బంగ్లా, న్యూజిలాండ్ చేతుల్లో వన్డేల్లో ఓటమి చూశాక.. ఈ టీంతో వన్డే వరల్డ్ కప్ కొట్టడం కష్టమేనన్న వాదన వినిపిస్తోంది.