Bandi Sanjay: ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో సతమతమవుతున్న బిజెపికి ఊరట కలిగించే విషయం ఇది. ఈరోజు ఏసీబీ కోర్టు సిట్ అధికారులు దాఖలు చేసిన మెమో ను కొట్టేసింది. దీంతో బీజేపీ నాయకుల్లో ఒకింత హర్షం వ్యక్తం అయింది. ఇదే సమయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరో తురుపు ముక్క లాంటి ఆయుధాన్ని బయటకు తీశారు. ఇప్పుడు దాని ఆధారంగా టిఆర్ఎస్ నాయకులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ కేసు తో వస్తే.. నేను బెంగళూరు డ్రగ్స్ కేసు నుంచి వస్తానని సవాల్ చేస్తున్నారు.

Bandi Sanjay, KCR
ఏమిటి ఆ కేసు
కర్ణాటక రాజధాని బెంగళూరులో గతంలో డ్రగ్స్ దందా తెరపైకి వచ్చింది. ఇందులో టిఆర్ఎస్ నాయకులు, సినీ తారలు ఉన్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక నోటీసులు ఇచ్చి వారిని అరెస్టు చేయడమే మిగిలింది అని అందరూ అనుకున్నారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ ఆ కేసు చప్పున చల్లారిపోయింది. అయితే ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ఈ విషయాన్ని తిరగతోడుతున్నారు. కర్ణాటకలో ఉన్నది తమ ప్రభుత్వమేనని, ఆ కేసులో ఉన్న వారందరినీ బయటకు లాగుతామని హెచ్చరిస్తున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ కేసులో నిన్నటిదాకా బిజెపిని ఇబ్బంది పెట్టిన టిఆర్ఎస్… బండి వ్యాఖ్యలతో ఇప్పుడు ఆత్మ రక్షణలో పడినట్టు కనిపిస్తోంది..
ఆ నలుగురి లో ఒక ఎమ్మెల్యే కింగ్ పిన్
ఇక మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ కేసులో కీలకంగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే బెంగళూరు డ్రగ్స్ దందాలో కీలక సూత్రధారి అని సమాచారం. ఈ విషయం తెలిసే ప్రస్తుతం బండి సంజయ్ అలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే అప్పట్లో ఆ కేసుకు సంబంధించి సదరు ఎమ్మెల్యేను కాపాడేందుకు తెలంగాణ ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలకమైన నేత ప్రయత్నం చేశారని విశ్వసనీయ సమాచారం. ఈ డ్రగ్స్ దందాలో భారీగా వెనకేసిన ఆ ఎమ్మెల్యే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీగా భూములు కొన్నారని,ఇవి ఆ టీఆర్ఎస్ ముఖ్య నాయకుడి పేరిట రిజిస్టేషన్ చేశారని వినికిడి.

Bandi Sanjay, KCR
ఈ విధంగా టాకిల్ చేస్తున్నారు
మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ కేసులో తమను ఇబ్బంది పెడుతున్న టిఆర్ఎస్ నాయకులకు బండి సంజయ్ బెంగళూరు కేసు ద్వారా కౌంటర్ ఇస్తున్నారు. ఏకంగా మంత్రి కేటీఆర్ పై ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్ కనుసన్నల్లోనే డ్రగ్స్ దందా జరుగుతోందని బండి సంజయ్ అంటున్నారు. ఇదే కేసుకు సంబంధించి గతంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ పేరుతో హడావిడి చేశారు. కేటీఆర్ కు సవాల్ చేశారు. తనతో పాటు టెస్టులకు రావాలని ఒత్తిడి తెచ్చారు. అయితే కేటీఆర్ తనపై ఆరోపణలు చేయకుండా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అప్పట్లో ఈ చాలెంజ్ ను బండి సంజయ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్వీకరించారు. అయితే తాజాగా ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆధారాల కోసం తెలంగాణ బిజెపి నాయకులు కర్ణాటక బీజేపీ ప్రతినిధులను కలిశారని సమాచారం.. వారి ద్వారా కీలక సమాచారం తెప్పించుకున్న తర్వాతే బండి సంజయ్ ఆరోపణలు చేస్తున్నారని తెలుస్తోంది.. ఒకవేళ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో టిఆర్ఎస్ ప్రభుత్వం ముందడుగు వేస్తే… ఈ కేస్ ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పట్టాలని బిజెపి నాయకులు అనుకుంటున్నారు.ఈ సమాచారాన్ని బయటకు పొక్క కుండా బిజెపి నాయకులు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొన్నటిదాకా మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ కేసులో టిఆర్ఎస్ నాయకులను టాకిల్ చేయలేకపోయిన బిజెపి… ఇప్పుడు డ్రగ్స్ కేసు ద్వారా ప్రతిఘటిస్తుండడం గమనార్హం.