Bandla Ganesh: చంద్రబాబు అరెస్ట్: వినాయకచవితి కూడా బండ్ల గణేష్ జరుపుకోలేదట
వాస్తవానికి చంద్రబాబు అరెస్టు తర్వాత బండ్ల గణేష్ చాలా టీవీ డిబెట్లలో పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టుపై స్పందించాలని కోరితే ఆసక్తి చూపలేదు. ఏపీ రాజకీయాలపై తాను మాట్లాడదలచుకోలేదని తేల్చి చెప్పారు.

Bandla Ganesh: చంద్రబాబు అరెస్ట్ అయిన చాలా రోజుల తర్వాత సినీ నిర్మాత బండ్ల గణేష్ హాట్ కామెంట్స్ చేశారు. టిడిపి, జనసేనల మధ్య పొత్తు కుదిరిన తర్వాత మాత్రమే ఈ అంశంపై స్పందించడం విశేషం. చంద్రబాబు తెలుగు జాతి సంపదగా అభివర్ణించారు. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు గెలిపిస్తారని.. టిడిపి మళ్లీ అధికారంలోకి వస్తుందని గణేష్ జోస్యం చెప్పడం విశేషం.
వాస్తవానికి చంద్రబాబు అరెస్టు తర్వాత బండ్ల గణేష్ చాలా టీవీ డిబెట్లలో పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టుపై స్పందించాలని కోరితే ఆసక్తి చూపలేదు. ఏపీ రాజకీయాలపై తాను మాట్లాడదలచుకోలేదని తేల్చి చెప్పారు. తాను కేవలం తెలంగాణ రాజకీయాలకే పరిమితమని.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మాత్రమే చెప్పుకొచ్చేవారు. అటువంటి బండ్ల గణేష్ ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. చంద్రబాబుపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఇందులో కమ్మ సామాజిక వర్గాన్ని తేవడం విశేషం. విదేశాల్లో ఉండి నిరసనలు చేపట్టడం కాదు.. సొంత ప్రాంతాలకు వచ్చి ఆందోళనను ఉధృతం చేయాలని పిలుపునివ్వడం విశేషం. మా సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబుకు ఈ విధంగా జరిగిందని.. వేరే సామాజిక వర్గ నేతకు ఈ పరిస్థితి వచ్చి ఉంటే ఇంకోలా ఉండేదని గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
సినీ పరిశ్రమ నుంచి బండ్ల గణేష్ తొలిసారిగా స్పందించినట్లు అయింది. రాఘవేంద్రరావు, అశ్విని దత్, మురళీమోహన్ వంటి వారు స్పందించినా.. వారు టిడిపి అభిమానులు, నాయకులు. నిర్మాత దగ్గుబాటి సురేష్ చంద్రబాబు అక్రమ అరెస్టుపై సినీ పరిశ్రమ స్పందించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. దానికి కౌంటర్ ఇస్తున్నట్లుగా బండ్ల గణేష్ కామెంట్స్ సాగాయి. చంద్రబాబు ద్వారా ఎంతో లబ్ది పొందిన వారు సైతం ఇప్పుడు పట్టించుకోకపోవడం దారుణమని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని వదలి పెట్టకూడదని.. పెద్ద ఎత్తున పోరాటం చేపట్టాలని గణేష్ అభిప్రాయపడ్డారు. ఐటీ ఉద్యోగులు పార్కుల ముందు, రోడ్లపైన కాదు సొంత ఊర్లకు వెళ్లి అక్కడ ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. అవసరమైతే నెలరోజుల పాటు ఉద్యోగాలు మానేసి సొంత ఊర్లకు వెళ్లాలని పిలుపునివ్వడం విశేషం. చంద్రబాబు లాంటి నేతను అరెస్టు చేసి జైలుకు పంపించడం దారుణమని.. గుండె తరుక్కుపోతోందని.. అందుకే వినాయక చవితి వేడుకలు చేసుకోలేదని గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పవన్ పొత్తుల వ్యవహారం తేల్చిన తర్వాతే.. బండ్ల గణేష్ బయటకు వచ్చి చంద్రబాబు అరెస్టుపై పోరాటం చేయడం చర్చనీయాంశంగా మారింది.
