Bandi Sanjay- Minister Indrakaran Reddy: గజగజ వణికించే చలిలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజాసంగ్రామయాత్ర నిర్మల్ జిల్లాలో ససెగలు పుట్టిస్తోంది. వారం రోజులుగా సాగుతున్న యాత్రలో బండి జోరు రోజురోజుకూ పెరుగుతోంది. నాలుగు రోజులు ముధోల్ నియోజకవర్గంలో సాగిన యాత్రతో స్థానిక నేతల్లో సమరోత్సాహం కనిపిస్తోంది. వివాదాస్పదమవుతుందనుకున్న నియోజకవర్గంలో యాత్ర ప్రశాంతంగా సాగింది. ప్రస్తుతం నిర్మల్ నియోజకవర్గంలో మాత్రం రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఒకవైపు టీఆర్‌ఎస్ కుటుంబాన్ని మరోవైపు జిల్లా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబాన్ని పాదయాత్రలో చెడుగుడు ఆడుకుంటున్నారు. అవినీతి అక్రమాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు. ఇంద్రకరణ్‌రెడ్డి అవినీతి చిట్టాను చేతపట్టుకుని ప్రశ్నలు సంధిస్తున్నారు. వసూలు చేసిన సొమ్ము తిరిగి చెల్లించేందుకు డెడ్‌లైన్ పెడుతున్నారు. దీంతో ఒక్కసారిగా టీఆర్‌ఎస్ దృష్టి నిర్మల్ జిల్లాపై పడింది.

Bandi Sanjay
బీజేపీ నేతల వద్ద అవినీతి ఆధారాలు
నిర్మల్ జిల్లా కేంద్రంలో బండి సంజయ్ ఆదివారం నిర్వహించిన బహిరంగ సభకు భారీగా ప్రజలు తరలివచ్చారు. వీరంతా డబ్బులు ఇచ్చి రప్పించిన వారు కాదు. స్వచ్ఛందంగా వచ్చినవారే. ఇప్పుడు ఇదే జిల్లా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి తలనొప్పిగా మారింది. మరోవైపు సంజయ్ మంత్రి అవినీతి, భూకబ్జాలు, మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇస్తామని వసూలు చేసిన సొమ్ము, చెరువుల దురాక్రమణ ఇలా ఒక్కొక్కటిగా బయట పెట్టారు. మంత్రితోపాటు ఆయన కుటుంబంపైనా ఆరోపణలు చేశారు. మున్సిపల్ ఉద్యోగాల పేరుతో వసూలు చేసిన డబ్బులు జనవరి 10వ తేదీలోగా చెల్లించాలని డెడ్‌లైన్ విధించారు. లేకుంటే తామేంటో చూపిస్తామని హెచ్చరించారు.
ఆరోపణలు నిరూపించాలని సవాల్..
బండి సంజయ్ సభకు వచ్చిన జనం, సభలో సంజయ్ చేసిన ఆరోపణలతో ఉలిక్కిపడ్డ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హైదరాబాద్ నుంచి హుటాహుటిన నిర్మల్‌కు చేరుకున్నారు. సోమవారం హడావుడిగా ప్రెస్‌మీట్ పెట్టారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రివర్స్ ఎటాక్‌కు దిగారు. తనపై వ్యక్తిగత విమర్శలు నిరాధారమైన ఆరోపణలు చేసే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. నిర్మల్ లోని మున్సిపాలిటీలో నాల్గవ తరగతి ఉద్యోగుల నియామకంలో అవినీతి చేసినట్ల నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేకపోతే బండి సంజయ్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా అంటూ ఆయన సవాల్ విసిరారు.
కొన్ని ఆధారాలు బయటపెట్టిన బీజేపీ..
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని చేసిన సవాల్‌కు బీజేపీ నేతలు స్పందించారు. ఆదిలాబాద్ ఎంపీ బాపూరావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి స్పందించారు. మీడియా సమావేశం నిర్వహించి మంత్రి కుటుంబ సభ్యులు చేసిన భూ కబ్జాలను బయటపెట్టారు. డీవన్ పట్టాలతో ఆసైన్డ్ భూములు ఆక్రమించిన విషయాన్ని మీడియాకు చూపించారు. ఇవి కొన్ని మాత్రమే అని స్పష్టం చేశారు. ముందుముందు మంత్రి బాగోతాలు బయటపెడతామన్నారు. బండి సంజయ్ మంత్రిపై చేసిన ఆరోపణలకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

Minister Indrakaran Reddy
రంగంలోని టీఆర్‌ఎస్..
మంత్రి ఇంద్రకరణŠ రెడ్డి టార్గెట్‌గా నిర్మల్ జిల్లాలో బీజేపీ చేస్తున్న ఆరోపణలు, కొన్ని ఆధారాలు బయట పెట్టడంతో టీఆర్‌ఎస్ అధిష్టానం అలర్ట్ అయింది. వెంటనే బండి సంజయ్‌కు చెక్ పెట్టకుంటే నియోజకవర్గంలో పార్టీకి తీవ్ర నష్టం తప్పదని భావించిన ముఖ్యమైన మంత్రి, టీ ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు సంజయ్‌కి కౌంటర్ ఇచ్చేలా నేతలను పురమాయించారు. బండి స్పీడ్‌కు బ్రేకులు వేయాలని ఆదేశించారు. ఈమేరకు ఉమ్మడి జిల్లా నేతలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో మంత్రి పరిస్థితే ఇలా ఉంటే.. మిగతా నేతల పరిస్థితి ఏంటన్న ఆందోళన టీఆర్‌ఎస్ అధిష్టానంలో కనిపిస్తోందని తెలుస్తోంది.