Bandi Sanjay – Kavitha : బండి సంజయ్.. కల్వకుంట్ల కవిత ఎదురుపడితే ఏం జరిగిందో చూడండి

కార్యక్రమానికి సంజయ్, కవిత ఒకే సమయంలో హాజరయ్యారు. ఇద్దరూ పరస్పరం ఎదురుపడి నమస్కారం చేసుకున్నారు. ఈ సందర్భంగా అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా, జిల్లా జెడ్పీ చైర్మన్‌ విఠల్‌రావును కవిత.. సంజయ్‌కు పరిచయం చేశారు. అంతా ప్రశాంతంగా ఆహ్లాదకర వాతావరణంలో జరుగడంతో ఇటు బీఆర్‌ఎస్, అటు బీజేపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

  • Written By: NARESH ENNAM
  • Published On:
Bandi Sanjay – Kavitha : బండి సంజయ్.. కల్వకుంట్ల కవిత ఎదురుపడితే ఏం జరిగిందో చూడండి

Bandi Sanjay – Kavitha : బీఆర్‌ఎస్‌ పేరు చెబితేనే ఒంటికాలిపై లేస్తారు బీజేపీ స్టేట్‌ చీఫ్‌ బండి సంజయ్‌. ఘాటైన పదజాలంతో కేసీఆర్‌ కుటుంబ సభ్యులను, ఆ పార్టీ నేతలను చీల్చి చెండాడతారు. ఇక తనను ఎంపీగా ఓడించిన బీజేపీపై పీకలదాకా కోపంతో ఉన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూతురు కవిత. ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటికీ టీఆర్‌ఎస్‌లో తన స్పీడ్‌కు బ్రేకులు వేసిందని ఇప్పటికీ గరమవుతుంటారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాం బయట పడిన నాటి నుంచి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కల్వకుంట్ల కవితను టార్గెట్‌ చేస్తున్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి. వాళ్లిద్దరూ రెండేళ్ల క్రితం ఒకసారి ఎదురు పడ్డారు. తాజాగా మళ్లీ అలాంటి ఘటన జరిగింది. ఉప్పు నిప్పు ఎదురు పడితే ఏం జరుగుతుందో అని అంతా ఉత్కంఠగా చూశారు. కానీ అంతా ప్రశాంతంగా, ఆత్మీయ పలకరింపులతో సాఫీగా జరిగిపోయింది. ఈ ఘటన నిజామాబాద్‌లో బుధవారం జరిగింది.

గృహ ప్రవేశానికి ఇద్దరూ హాజరు…
నిజామాబాద్‌కు చెందిన బీజేపీ నేత బస్వ నర్సయ్య నూతన గృహ ప్రవేశం కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు ఆ పార్టీ నేతలను, స్థానిక ఎమ్మెల్యే కవితతోపాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నాయకులను కూడా నర్సయ్య ఆహ్వానించారు. కార్యక్రమానికి సంజయ్, కవిత ఒకే సమయంలో హాజరయ్యారు. ఇద్దరూ పరస్పరం ఎదురుపడి నమస్కారం చేసుకున్నారు. ఈ సందర్భంగా అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా, జిల్లా జెడ్పీ చైర్మన్‌ విఠల్‌రావును కవిత.. సంజయ్‌కు పరిచయం చేశారు. అంతా ప్రశాంతంగా ఆహ్లాదకర వాతావరణంలో జరుగడంతో ఇటు బీఆర్‌ఎస్, అటు బీజేపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

రెండేళ్ల క్రితం అలయ్‌ బలయ్‌లో..
రెండేళ్ల క్రితం కూడా కవిత, బండి సంజయ్‌ కలిశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వేళ.. ఓవైపు బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య హైవోల్టేజ్‌ వార్‌ సాగుతోంటే.. మరోవైపు హైదరాబాద్‌ జలవిహార్‌లో జరిగిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి ఇద్దరూ హాజరయ్యారు. అలయ్‌ బలయ్‌లో వేదికను పంచుకోవడమే కాకుండా.. పక్క పక్కనే కూర్చోవడం ఆసక్తి రేపింది. అంతేకాదు ఇద్దరూ కొద్దిసేపు చెవిలో ఏదో గుసగుసలాడుకోవడం అలయ్‌ బలయ్‌ స్ఫూర్తికి మరింత వన్నె తెచ్చింది.

రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం..
రాష్ట్రంలో ప్రస్తుతం ఢీ అంటే ఢీ అనే అనేట్టుగా ఉన్నారు బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు. పొరపాటున ఎవరైనా పరస్పరం ఎదురుపడితే మాటలతో కాకపోయినా కళ్లతోనే యుద్ధాలు చేసుకునేంత కోపంగా ఉన్నారు. అలాంటి సమయంలో కవిత, సంజయ్‌ ఎదురు పడి ఆత్మీయంగా పలకరించుకోవడం, సుహృద్భావ పూర్వక వాతావరణం నెలకొనడంతో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇక కాంగ్రెస్‌ నేతలు ఈ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.

Read Today's Latest Telangana politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు