
Bandi Sanjay
Bandi Sanjay: తెలంగాణ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బిడ్డ కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట శనివారం హాజరయ్యారు. భాజపా లీగల్ సెల్ ప్రతినిధులతో కలిసి కమిషన్ కార్యాలయానికి వెళ్లారు.
సంజయ్ వ్యాఖ్యలపై నోటీసులు..
ఇటీవల కవితపై సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. సంజయ్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మార్చి 15న కమిషనర్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. తనకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున ఈరోజు హాజరుకాలేనని తెలిపారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కు లేఖ రాశారు. ఈనెల 18న విచారణకు వస్తానని తెలిపారు. అందుకు కమిషన్ సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఆయన కమిషన్ ఎదుట హాజరయ్యారు.
బీఆర్‌ఎస్ నేతల ఆందోళన..
ఇదిలా ఉండగా సంజయ్ మహిళా కమిషన్ విచారణకు హాజరైన విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ మహిళా నేతలు మహిళా కమిషన్ కార్యాలయం ఎదుటు ఆందోళనకు దిగారు. ఇది ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్‌ఎస్ నేతల ఆందోళనను బీజేపీ మహిళా నేతలు తప్పుపట్టారు. ఒక విచారణ సంస్థ ఎదుట ఆందోళన చేయడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసుల వైఫల్యాన్ని ఎత్తిచూపారు. ఆందోళన విరమించకుంటే తాము మహిళా కమిషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. దీంతో పోలీసులు ఇరు పార్టీల మహిళా నేతలను అక్కడి నుంచి పంపించారు.

Bandi Sanjay
తెలంగాణ భాషనే వాడాను..
ఇక బండి సంజయ్ మహిళా కమిషన్ ఎదుట తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను తప్పుడు ఉద్దేశంతో కవిత గురించి మాట్లాడలేదని స్పష్టం చేశారు. తాను వాడిన భాష తెలంగాణలో సాధారణంగా వాడే భాష అన్నారు. తెలంగాణ కుటుంబాల్లో తాను వాడిన పదాలను తరచూ వాడతారని తెలిపారు. తన ఉద్దేశంలో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు. ఈమేరకు 2 పేజీల వివరణ ఇచ్చారు. అయితే అంతకుముందు సంజయ్ తన న్యాయవాదితో కార్యాలయానికి రాగా, పోలీసులు అడ్డుకున్నారు. సంజయ్ ఒక్కడినే కార్యాలయంలోకి అనుమతించారు. న్యాయవాదిని అనుమతించలేదు.
మొత్తంగా సంజయ్ తన వ్యాఖ్యలను తప్పు అని అంగీకరించలేదు. క్షమాపణ కూడా చెప్పలేదు. మరి సంజయ్ వివరణపై మహిళా కమిషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.