రేవంత్ రెడ్డి ఈపేరు తెలుగు ప్రజలకు సుపరిచితం. మొదట్నుంచీ ఎప్పుడూ ఏదోఒక కారణంతో వార్తల్లో వుండే వ్యక్తి. తెలుగు ప్రజలు హీరోయిజాన్ని ఎప్పుడూ ఆరాధిస్తారు. ఆకోణంలోనే రేవంత రెడ్డి ని చూడాల్సివుంటుంది. తన రాజకీయ జీవితం తెరాస తో మొదలైనా ఎక్కువకాలం తెలుగుదేశం లో చంద్రబాబు నాయుడుకి అభిమానిగానే వున్నాడు. చివరకి కాంగ్రెస్ లో చేరేముందుకూడా చంద్రబాబుకి చెప్పే చేరాడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వున్నాడు.
రేవంత్ రెడ్డి మొదట్నుంచీ ‘హైలీ యాంబిషస్’ వ్యక్తి. ఎక్కడవున్నా తనకి ప్రత్యేక గుర్తింపు కావాలని కోరుకొనే వ్యక్తి. దానివలన వున్న పార్టీలోనే ఎక్కువమంది శత్రువుల్నితయారుచేసుకుంటుంటాడు. తెలుగుదేశం లో తన సహచర నాయకుల్లో చాలామందికి తనపెరుగుదల నచ్చేదికాదు. అయితే తనకి చంద్రబాబు నాయుడి మద్దత్తు వుంది కాబట్టి ఏమీ మాట్లాడలేకపోయేవాళ్లు. అయితే తనకున్న చురుకుదనం, వాగ్ధాటి తో ప్రజల్లో ఒక సెక్షన్ తనంటే పిచ్చగా అభిమానానించే టట్లు చేసుకోగలిగాడు. రెండోది, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడగలగటం. రెడ్డి కుల సంఘం మీటింగు పెడితే చాలా మంది నాయకులు వెళ్ళటానికి మొహమాటపడితే రేవంత్ రెడ్డి ఎటువంటీ బెరుకు లేకుండా చాలా చురుకుగా పాల్గొనటం అతని మనస్తత్వాన్ని తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. అయితే అతి ఆశయం వలన వచ్చిన అవకాశాల్ని పోగుట్టుకుంటుండాడు . ఉదాహరణకు బీజేపీ లో చేరతాడని అందరూ అనుకున్నప్పుడు తనకి అధ్యక్షపదవి ఇస్తేనే చేరతానని పట్టుబట్టినట్లు తెలిసింది. చివరకు కాంగ్రెస్ లో చేరటానికి కూడా పదవి కోసం బేరాలాడే చేరినట్లు తెలుస్తుంది. అందుకే ఎంతోమంది సీనియర్లు వున్నా తనకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కింది.
ఈ పదవితోపాటు పార్టీలో సమస్యలుకూడా తోడుగా వచ్చాయి. కాంగ్రెస్ సంస్కృతి వేరు. మామూలుగానే ఒక నాయకుడు ముందుకెళ్తే రెండో నాయకుడు కాళ్ళు పట్టుకొని లాగుతాడు. ఆ పార్టీలో వున్నంతమంది నాయకులు ఏ పార్టీలో లేరు. అందరూ ఆరితేరినవాళ్ళే. ఓ కుర్రోడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే సర్దుకుపోయే మనస్తత్వం అసలు ఉండదు. ఎలాగైనా రేవంత్ రెడ్డి ని దెబ్బతీయాలని ప్రయత్నించే వాళ్ళు తెరాస కన్నా కాంగ్రెస్ లోనే ఎక్కువమంది వున్నారు. రేవంత్ రెడ్డి భూ వ్యవహారాలు వీళ్ళే ప్రభుత్వానికి ఉప్పందించారని అనుకుంటున్నారు. అలా జరిగివుండటానికి అవకాశాలు ఎక్కువగానే వున్నాయి. ఇది కెసిఆర్ కి అందివచ్చిన అవకాశం. రేవంత్ రెడ్డి ని దెబ్బతీయటానికి ఏ అవకాశం దొరికినా వాడుకోవటానికి కెసిఆర్ రెడీగా ఉంటాడు. అది సహజం కూడా. కెసిఆర్ రాజకీయ చదరంగంలో రేవంత్ రెడ్డి కన్నా ఆరు రెట్లు ఎక్కువే. అవతలివాడిని ఎలా లొంగతీసుకోవాలో, అది కుదరకపోతే ఎలా దెబ్బతీయాలో తనకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. ఇప్పుడు దొరికిన ఆర్ధిక లావాదేవీలు రేవంత్ రెడ్డి రాజకీయాన్ని దెబ్బతీయొచ్చని కెసిఆర్ అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది.
రేవంత్ రెడ్డి కి రాను రాను పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయనిపిస్తుంది. తన అత్యాశ , చురుకుదనం అభిమానుల్ని తెచ్చిపెట్టినా ఆర్ధిక కుంభకోణాలు ఒకటిమీద ఒకటి బయటపడితే ప్రజలు హర్షించరు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు తరఫున డబ్బులు ఇవ్వచూపటం తన రాజకీయ జీవితం లో మాయని మచ్చ. అయినా జనంలో కెసిఆర్ కి ఎదురునిలబడగల మొనగాడు రేవంత్ రెడ్డేననే అనుకోవటంతో సర్దుకుపోయారు. పోయిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి గెలవటం అందుకు ఉపయోగపడింది. ఓటుకు నోటు కేసు దుష్ప్రభావం పెద్దగా పడలేదు. కానీ ఇప్పుడు బయటపడ్డ భూ కుంభకోణం ప్రజల్లో మార్పుతెచ్చే అవకాశం వుంది. ఓటుకు నోటు కేసు చంద్రబాబు చెబితే చేశాడని అనుకున్నవాళ్ళే ఇప్పుడు బయటపడ్డ భూ కుంభకోణంతో తిరిగి ఆలోచించటం మొదలయ్యింది. ఒకనాడు అభిమానించినవాళ్ళే ఈరోజు భూ కుంభకోణం చూసిన తర్వాత సమర్ధించే పరిస్థితుల్లో లేరు. డ్రోన్లతో కెసిఆర్ కుటుంబం ప్రతిష్ట దెబ్బతీయాలనుకునేవాడు తనలో లోటుపాట్లు లేకుండా చూసుకోవాలి కదా. నేను అవినీతి చేస్తాను అదే సమయంలో శక్తివంతమైన కెసిఆర్ ని ఎదుర్కుంటాను అంటే కుదరదు. అది చివరకు ఫ్యాక్షన్ రాజకీయమయ్యిద్ది తప్పితే సిద్ధాంత రాజకీయం కాదు. ఇక్కడే కెసిఆర్ చాణక్యం ఉపయోగించాడు. ఎవరైనా అధికారం లో వున్న కుటుంబానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడగలిగితే వాళ్లకు సహజంగా ప్రజల మద్దత్తు లభిస్తుంది. అందుకే ఇప్పటివరకూ రేవంత్ రెడ్డి కి ఆ క్రేజ్ వుంది. అయితే ఎప్పుడయితే తను నిజాయితీగా లేడని ప్రజలు అనుకుంటారో అప్పుడు తన పోరాటం వ్యక్తిగతం అవుతుంది. అదే ఫ్యాక్షనిజం గా మారుతుంది. కానీ ఇక్కడొక మెలిక వుంది. ఫ్యాక్షనిజం హైదరాబాద్ లాంటి మహానగరంలో చెల్లదు. రాయలసీమలాంటి గ్రామీణ వాతావరణంలో నే వర్క్ అవుట్ అవుతుంది. అందుకనే ఇప్పుడు బయటపడ్డ భూ కుంభకోణంతో రేవంత్ రెడ్డి ప్రభ తగ్గుముఖం పడుతుందనేది ఖాయం. అందుకు సంతోషించేవాళ్లు తెరాస లో కన్నా కాంగ్రెస్ లోనే ఎక్కువమంది ఉండటం ఆశ్చర్యం. ఈ పరిణామాలు రేవంత్ రెడ్డి కి ఆరిపోయే దీపం కాకుండా చూసుకుంటే మంచిది.