Avatar-the way of water : అవతార్ -2.. కామెరూన్ పని అయిపోయింది.. అప్డేట్ కావాల్సిందే
Avatar-the way of water : కోట్లు కొల్లగొట్టిన ప్రపంచ క్లాసిక్ చిత్రాల దర్శకుడు ఆయన. టైటానిక్, అవతార్ లాంటి అద్భుత ఫీల్ ఎమోషన్ చిత్రాలు తీసిన ఘనడు ఆయన. అలాంటి జేమ్స్ కామెరూన్ ను చూసి మరో మాట లేకుండా థియేటర్ లో అడుగుపెట్టాను. చుట్టూ చూశాను.. సీట్లన్నీ ఖాళీ. టికెట్ దొరకకుండా ఉంటుందని అంచనా వేసుకొని థియేటర్ కు వెళితే ఇలా ఖాళీగా సీట్లు ఉండడం చూసి అప్పుడే డౌట్ కొట్టింది. సినిమా మొదలయ్యాక […]

Avatar-the way of water : కోట్లు కొల్లగొట్టిన ప్రపంచ క్లాసిక్ చిత్రాల దర్శకుడు ఆయన. టైటానిక్, అవతార్ లాంటి అద్భుత ఫీల్ ఎమోషన్ చిత్రాలు తీసిన ఘనడు ఆయన. అలాంటి జేమ్స్ కామెరూన్ ను చూసి మరో మాట లేకుండా థియేటర్ లో అడుగుపెట్టాను. చుట్టూ చూశాను.. సీట్లన్నీ ఖాళీ. టికెట్ దొరకకుండా ఉంటుందని అంచనా వేసుకొని థియేటర్ కు వెళితే ఇలా ఖాళీగా సీట్లు ఉండడం చూసి అప్పుడే డౌట్ కొట్టింది. సినిమా మొదలయ్యాక ఆ అనుమానం నిజమైంది.
ప్రపంచవ్యాప్తంగా అందరూ గగ్గోలుపెడుతుంటే.. ఇంట్లో పిల్లలు గోలపెడుతుంటే.. సరే చూద్దామని ‘అవతార్2’కు వెళ్లాం. అవతార్ 1 చూసిన అంచనాలతోనే థియేటర్ లోకి అడుగుపెట్టాం.. కానీ మా అంచనా తప్పింది. నా పక్కన పిల్లాడు ఈ మూడు గంటల సినిమా చూడలేక గుర్రుపెట్టి నిద్రపోవడం కనిపించింది. సినిమా థియేటర్లో ఒకరు నిద్రపోయారంటే సినిమా ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు.
అవతార్2 అదే సొల్లు భారతం.. రామాయణ , మహాభారతాల్లోని కాసింత నీతిని తీసుకొని.. ఫ్యామిలీ ఎమోషన్ ను యాడ్ చేసి బోర్ కొట్టేలా తీసిన చిత్రమిదీ. జేమ్స్ కామెరూన్ అవతార్ 1ను 2009లో తీశాడు. అవతార్ 2ను 2022లో విడుదల చేశాడు. ఈ పదేళ్ల గ్యాప్ లో ప్రపంచమే మారింది.. కరోనా మార్చేసింది. ఓటీటీల్లో వచ్చిన క్రియేటివిటీ చిత్రాలు చూసి జనాలు మారిపోయారు. ఇంకా జేమ్స్ కామెరూన్ నే మారలేదని అర్థమైంది.
అదే పాతచింతకాయపచ్చడి ఎమోషన్స్ తో ‘అవతార్2’ను నడిపిస్తామంటే ప్రేక్షకులు ఒప్పుకోరని చిత్రం చూస్తేనే అర్థమైంది. ఇంటర్వెల్ వచ్చాకే తెలిసింది. సినిమా ఫ్లాప్ అని.. జనాలు అందుకే రాలేదని..
అవతార్2 గురించి గొప్పగా చెప్పడానికి ఏం లేదు. తొలి చిత్రం భూగ్రహ వాసులు, పండోరా అనే అరణ్యవాసులకు మధ్య ఫైట్. తమ భూమి కోసం వారు పోరాడిన తీరు అద్భుతంగానే సాగింది.
కానీ అవతార్2లో ట్రాక్ తప్పేసింది. మళ్లీ భూమి మీద నుంచి రావడం.. బలంగా మనుషులు తిరగబడడంతో మన హీరో గారు ఫ్యామిలీయే ముఖ్యం అని.. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం పిరికిపందలా పారిపోతారు. ఇదే జనాలకు నచ్చలేదు. ఇక దూరంగా వెళ్లి సముద్రవాసులతో కలిసి అక్కడ బతికేందుకు ఆపసోపాలు పడడం.. మొత్తం విజువల్ వండర్ గా సముద్రంలో వింతలు విశేషాలు చూపిస్తూ ప్రేక్షకుల సహనానికి కామెరూన్ పరీక్ష పెట్టాడు. ట్విస్టులు లేవు.. పోరాటాలు లేవు. క్లైమాక్స్ వరకూ హీరో ఫ్యామిలీ సముద్రంలో ఆటలు ఆడుకోవడానికే టైం సరిపోతుంది.
ఈ మధ్య కాలంలో కొద్దిసేపు బోర్ కొడితేనే జనాలు ఫోన్ చూడడమో.. లేక పడుకోవడమో చేస్తున్నారు. కామెరూన్ సినిమా మొదట్లో.. క్లైమాక్స్ లో తప్పితే మధ్యలో అంతా రొట్టకొట్టుడు స్లో నారేషన్ తో అవతార్ 2ను గ్రాఫిక్స్ తోనే లాగించేశాడు. ఈసారి కథ, కథనాన్ని గాలికి వదిలేసి కేవలం గ్రాఫిక్స్ నే నమ్మాడు. విజువల్ వండర్ గా చేద్దామని కథను గాలికి వదిలేశాడు. అదే ఈ సినిమా లోపంగా చెప్పొచ్చు. ఇలాంటి పిల్ల చేష్టలు.. గ్రాఫిక్స్ మాయాజాలాలు జనాలు బాగానే చూశారు. అందుకే అవతార్1లోని కథకు కనెక్ట్ అయిన ప్రేక్షకుడికి అవతార్2లోని కథ నచ్చలేదు. బోర్ కొట్టేసింది.
పాత విలన్ సినిమాల్లోలాగా బ్లాక్ మెయిల్ దందా కూడా బెడిసికొట్టింది. హీరోను వెతికేందుకు విలన్ ఫొటో పట్టుకొని దీవులు వెతకడం.. క్లైమాక్స్ లో హీరో కూతుళ్లను కిడ్నాప్ చేసి కత్తి చూపి బెదిరించడం పాత రాజనాల సినిమాల్లో చూశాం. ఇప్పుడు అవతార్ 2లో చూస్తున్నాం.. జేమ్స్ కామెరూన్ ఇంకా కొన్నేళ్ల కిందటి రొట్టకొట్టుడు ఐడియాలజీతోనే సినిమా తీశాడని అర్థమైంది. కామెరూన్ అప్డేట్ కావాల్సిన ఆవసరం ఎంతైనా ఉంది. అందుకే ఈ అవతార్ 2 సినిమా ఫ్లాప్ అని చెప్పకతప్పదు.
-నరేశ్
