Avanthi Srinivas Rao: భీమిలి నుంచి అవంతి అవుట్..తెరపైకి లోకల్ నినాదం
2009లో భీమిలి నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీచేసి అవంతి శ్రీనివాసరావు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరిన అవంతి అనకాపల్లి ఎంపీ అయ్యారు. గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి బరిలో దిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Avanthi Srinivas: ఏపీలో భీమిలి నియోజకవర్గం స్పెషల్. ఎంతోమంది హేమాహేమీలు సైతం ఇక్కడ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఎన్నికయ్యారు. మాజీ సీఎం ఎన్టీ రామారావులాంటి నేతలే భీమిలి నుంచి పోటీచేసేందుకు ఉత్సాహం చూపించారు. ఉమ్మడి ఏపీలోనే ఒక అందమైన నియోజకవర్గం. అయితే ఇప్పటివరకూ స్థానికేతర నాయకులనే గెలిపిస్తూ వచ్చింది ఈ నియోజకవర్గం. కానీ ఫస్ట్ టైమ్ లోకల్ స్లోగన్ బలంగా వినిపిస్తోంది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు సీటుకే ఎసరుపడినట్టు కనిపిస్తోంది. ఆయనకు టిక్కెట్ ఇస్తే పనిచేయలేమంటూ ఓ బలమైన సామాజికవర్గం నుంచి ఒక నినాదం బయటకు వచ్చింది.
2009లో భీమిలి నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీచేసి అవంతి శ్రీనివాసరావు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరిన అవంతి అనకాపల్లి ఎంపీ అయ్యారు. గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి బరిలో దిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా కూడా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాసరావు మరోసారి భీమిలి వైపు వచ్చారు. ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. జగన్ కేబినెట్ లో తొలి మూడేళ్లు మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు పదవులు అయితే నిర్వర్తిస్తున్నారు.. కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నారన్న అపవాదు ఉంది. అందుకే అధికార పార్టీ నుంచి బలమైన లోకల్ నినాదం బయటకు వచ్చింది.
పద్మనాభం మండలానికి చెందిన అధికార పార్టీ నాయకులు ఒక చోట సమావేశమయ్యారు. అవంతి శ్రీనివాసరావుకు టిక్కెట్ ఇస్తే సహకరించమని తేల్చేశారు. స్థానిక నాయకుడికి ఇస్తే గెలిపించుకుంటామని.. ఇక మీ ఇష్టమని హై కమాండ్ కు అల్టిమేటం ఇచ్చారు. గత కొన్నాళ్లుగా అవంతి శ్రీనివాసరావు పరిస్థితి ఏమంత బాగాలేదు. మంత్రి పదవి తొలగించిన నాటి నుంచే అసమ్మతి తెరపైకి వచ్చింది. పైగా ఆయన పార్టీలో ఉండరని ఒక టాక్ నడుస్తోంది. సరిగ్గా ఎన్నికల ముందే పార్టీలో చేరిన ఆయనకు జగన్ మంచి స్థానమే ఇచ్చారు. ఎమ్మెల్యే టిక్కెట్ తో పాటు మంత్రి పదవిని కూడా ఇచ్చారు. కానీ అధినేత అంచనాకు తగ్గట్టు పనిచేయలేకపోయారు.
భీమిలిలో కాపు సామాజికవర్గం అధికం. ఇక్కడ జనసేన ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఈ సీటు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తారన్న టాక్ నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే కాపు సామాజికవర్గం నేతలంతా ఏకతాటిపైకి వచ్చారు. స్థానిక నినాదాన్ని బయటకు వదిలారు. దీంతో అవంతి శ్రీనివాస్ అవుట్ అని టాక్ నడుస్తోంది. అసమ్మతి నాయకులకు కీలక నేతల హస్తం ఉందన్న ప్రచారం విశాఖలో వినిపిస్తోంది. ఎన్నికల ముంగిట చాలా రకాల పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
