CM Jagan: సాధారణంగా టాలీవుడ్ అగ్రహీరో బాలయ్య సినిమాల్లో ఈ డైలాగ్ ఉంటుంది.. ‘నన్ను తిడితే నా ఫ్యాన్స్ కు బీపీ వస్తుంది’ అని భీకరంగా బాలయ్య సినిమా తెరపై చెబితే ఈలలు గోలలు చేస్తాం..కానీ ఏపీ సీఎం జగన్ సైతం ఇప్పుడు అదే రాయలసీమ లీడర్ లా చెబితే వైసీపీ శ్రేణులు ఊగిపోవా? ఇప్పుడు అదే జరిగింది. జగన్ తొడగొట్టి తనను తిడితే ‘నా అభిమానులకు బీపీ వస్తుంది’ అంటూ అనడం సంచలనమైంది. దీన్ని బట్టి టీడీపీ ఆఫీసులు, నేతలపై దాడులను జగన్ సమర్థించినట్టే కనిపిస్తోంది.
ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలను ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని సీఎం జగన్ ఆక్షేపించారు. టీడీపీ నేతలు, ఆఫీసులపై దాడుల గురించి సీఎం జగన్ తొలిసారి స్పందించారు. హాట్ కామెంట్స్ చేశారు. ఎవరూ మాట్లాడలేని అన్యాయమైన మాటలు, బూతులు మాట్లాడుతున్నారని అన్నారు. బూతులు తిట్టడం వల్ల తనను అభిమానించే వాళ్ళకు, ప్రేమించేవాళ్ళకు బీపీ వచ్చి రియాక్షన్ కనిపిస్తోందన్నారు.
తనని కావాలని తిట్టించి, రాజకీయ లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు ఆరాటపడుతున్నాయని జగన్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సర్కారుపై ప్రజల ప్రేమను విపక్షం జీర్ణించుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు. ‘‘ప్రతిపక్షంలో ఉన్నవారు దారుణమైన, పరుష పదజాలం వాడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. తిట్లు విని భరించలేని అభిమానులు స్పందిస్తున్నారు. కావాలని తిట్టించి వైషమ్యాలు రెచ్చగొడుతున్నారు. వైషమ్యాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకుంటున్నారు. విపక్షం కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతోంది’ అని జగన్ ఆరోపించారు.
ఇక జగన్ సర్కార్ తాజాగా టీడీపీపై దాడులకు చర్యలు తీసుకుంది. టీడీపీ ఆఫీస్ పై దాడి చేసిన వైయస్ఆర్ సీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసింది. దాదాపు 70 మంది వైయస్ఆర్ సీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.