Hyderabad: ప్రేమోన్మాది హత్యోదాంతాన్నే ఎదిరించింది.. ఆ మహిళ తెగువకు సెల్యూట్
ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో శివకుమార్ అనే ప్రేమోన్మాది బీభత్సం సృష్టించాడు. ప్రేమిస్తున్నానంటూ సంఘవి అని యువతి వెనుక పడుతుండేవాడు. ఆదివారం మధ్యాహ్నం సంఘవి ఇంట్లోకి ప్రవేశించాడు.

Hyderabad: సాధారణంగా మహిళలు హింసాత్మక ఘటనలు చూస్తే తట్టుకోలేరు. రక్తం కనిపిస్తే భయపడి పోతారు. గొడవలు జరిగితే అటువైపు వెళ్లేందుకు సాహసించరు. కానీ ఓ మహిళ తెగువ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఓ ప్రేమోన్మాది నుంచి కుటుంబాన్ని కాపాడగలిగింది. అత్యంత ధైర్యం ప్రదర్శించి నిందితున్ని పోలీసులకు పట్టించింది. హైదరాబాద్ ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో జరిగిన ఘటన ఇది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో శివకుమార్ అనే ప్రేమోన్మాది బీభత్సం సృష్టించాడు. ప్రేమిస్తున్నానంటూ సంఘవి అని యువతి వెనుక పడుతుండేవాడు. ఆదివారం మధ్యాహ్నం సంఘవి ఇంట్లోకి ప్రవేశించాడు. కత్తితో బెదిరింపులకు దిగాడు. అడ్డుకున్న సంఘవి సోదరుడు పృథ్వి రాజ్ ను కత్తితో పొడిచాడు. ఈ హఠాత్పరిణామంతో సంఘవి కేకలు వేసింది. పక్క ఇంట్లో నివాసం ఉంటే ఝాన్సీ అనే మహిళ పరుగు పరుగున అక్కడికి చేరుకుంది. అప్పటికే పృథ్వి రక్తస్రావంతో ఇంటి బయటకు వచ్చాడు. శివకుమార్ ఇంటికి తలుపులు వేసి లోపల ఉండి పోయాడు. అతడికి భయపడి సంఘవి వేరే గదిలో దాక్కుంది.
ఆ సమయంలో ఝాన్సీ ఒక కర్రను పట్టుకుని శబ్దం చేస్తూ శివకుమార్ ను హెచ్చరించింది. ఏమైనా చేస్తే గుణపాఠం తప్పదని హెచ్చరించింది. మరోవైపు స్థానికంగా ఉండే యువకులకు ఈ విషయాన్ని చెప్పింది. భర్తకు,పోలీసులకు ఫోన్లో సమాచారం అందించింది. దీంతో వారంతా అక్కడకు చేరుకున్నారు. శివకుమార్ భయపడి తలుపు గడియలను తీశాడు. పోలీసులు శివకుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. సంఘవి క్షేమంగా బయటపడింది. పృథ్విరాజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. క్లిష్ట సమయంలో అతి వేగంగా స్పందించిన ఝాన్సీ కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
