Telangana Assembly Election: తెలంగాణలో ‘దొర’ల రాజకీయం.. ఎన్నికల నినాదంగా మార్చిన కాంగ్రెస్.. అదేరాగం అందుకున్న కేటీఆర్!
కాంగ్రెస్ ఎత్తుకున్న దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ఈ ఎన్నికల్లో దొరల తెలంగాణ కావాలో.. ప్రజల తెలంగాణ కావాలో తేల్చుకోవాలని అడుగుతున్నారు.

Telangana Assembly Election: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ‘దొర’ల రాజకీయం తెరపైకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు పార్టీలు దూకుడు పెంచాయి. అయితే కాంగ్రెస్ ఈ ఎన్నికలు ‘దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ’ కు మధ్య జరుగుతున్నాయని నినదిస్తోంది. ఎన్నికల నినాదంగా మార్చుకుంది. ప్రతీ సభలో రాహుల్ గాంధీ ఇదే నినాదంతో ప్రజలను ఓట్లు అడుగుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ దొరల చేతుల్లోకి వెళ్లిందని, పదవులు పంచుకుంటూ ఆస్తులు పెంచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కాళేశ్వరంలో అవినీతే ఇందుకు నిదర్శనమని ఉదహరిస్తున్నారు.
బలంగా ప్రజల్లోకి.. నినాదం..
కాంగ్రెస్ ఎత్తుకున్న దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ఈ ఎన్నికల్లో దొరల తెలంగాణ కావాలో.. ప్రజల తెలంగాణ కావాలో తేల్చుకోవాలని అడుగుతున్నారు. సభలు, రోడ్‌షోలు, కార్నర్ మీటింగుల్లో ఇదే నినాదం వినిపిస్తున్నారు. దీంతో ఈ నినాదం ఓటర్లను ప్రభావితం చేస్తోంది. వాస్తవమే అన్న భావన వ్యక్తమవుతోంది. తెలంగాణ వచ్చాక బాగుపడ్డది కల్వకుంట్ల కుటుంబమే కదా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గ్రామీణులు, రైతులు ఇదే భావనలో ఉన్నారు. రైతులకు రైతుబంధు ఇచ్చి కేసీఆర్ 150 ఎకరాలకు రైతుబంధు ఏటా రూ.15 లక్షల తీసుకుంటున్నాడని అంటున్నారు. ఇక తెలంగాణలో బాగుపడ్డ కుటుంబం కేసీఆర్‌దే అని చర్చించుకుంటున్నారు. రూ60 వేల కోట్ల అప్పును రూ.5 లక్షలకు తీసుకుపోయాడని, అందరి నెత్తిన రూ.లక్ష రూపాయలకుపైగా అప్పు వేశాడని పేర్కొంటున్నారు. కేసీఆర్ మళ్లీ వస్తే తెలంగాణను అమ్మేస్తాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అదే రాగం అందుకున్న కేటీఆర్..
దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్తుండడంతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిస్థితి మారుతుందని అర్థం చేసుకున్నారు. వెంటనే ఈ నినాదాన్ని తిప్పికొట్టాలని భావించారు. దీంతో ఆయన కూడా దొర రాగం అందుకున్నారు. అయితే కాంగ్రెస్ నినాదాన్ని కాస్త మార్చారు. ఈ ఎన్నికలు ‘ఢిల్లీ దొరలకు.. తెలంగాణ ప్రజలకు’ మధ్య జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు. తెలంగాణ ఢిల్లీ దొరలకు తలవంచదు అని సెంటిమెంటు రగిల్చే ప్రయత్నం కూడా చేశారు.
అసలు దొర ఎవరు?
ఇక, దొర రాజకీయం నేపథ్యంలో తెలంగాణలో ఇప్పుడు దొర అంటే ఎవరు అన్న చర్చ జరుగుతోంది. పాత తరం ఓటర్లకు దొర అంటే తెలుసు. కానీ, నేటి యువతరానికి దొర అనే పదానికి అర్థం తెలియదు. ఈ నేపథ్యంలో అసలు దొర పదం ఎలా వచ్చింది.. ఇప్పటికీ ఎందుకు కొనసాగుతోంది అన్నది తెలుసుకుందాం. తెలంగాణను బ్రిటిష్ వారు పాలించినప్పుడు నిజాంలు బ్రిటిష్ సైన్యానికి అనుకూలంగా పనిచేశారు. దీంతో నిజాంలు బ్రిటిష్ సైనికులను దొర అనే పదంతో సంబోధించేవారు. ఇదే సమయంలో నిజాంలకు తొత్తులుగా నాడు దేశ్‌ముఖ్‌లు, వెలమల కులానికి చెందిన పెద్దలు పనిచేశారు. వీరు కూడా బ్రిటిస్ సైన్యాధికారి వచ్చినప్పుడు దొర అంటూ సంబోధించేవారు. తాము దొర అని బ్రిటిష్ సైన్యాధికారులను పిలుస్తున్నట్లుగానే తెలంగాణ ప్రజలతో తమను దొర అని పిలిపించుకోవడం ప్రారంభించారు. ఇలా ఈ దొర పదం మహారాష్ట్రలోని దేశ్‌ముఖ్‌లు, తెలంగాణలోని వెలమలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పటికీ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వెలమలు తమను దొర అని పిలిపించుకోవడానికే ఇష్టపడతారు. అందుకే కాంగ్రెస్ ఇదే ‘దొర’ను తన ఎన్నికల నినాదంగా మలుచుకుంది. ఈ విషయం కేటీఆర్‌కు కూడా తెలుసు. కానీ తమ సామాజికవర్గాన్ని దొర అంటున్నారని నొచ్చుకున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. దానిని దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు ఆపాదించే ప్రయత్నం ప్రారంభించారు. కానీ, వాస్తవం తెలంగాణ సమాజానికి తెలుసు. దొర అనే పదం ఎవరికి వాడతారు.. ఎవరిని పిలుస్తారో అనే విచక్షణ తెలంగాణ సమాజం చేస్తుంది. ఈ విషయం కేటీఆర్ గుర్తించనట్లు ఉన్నారు.
