
AP MLC Elections- Jagan
AP MLC Elections- Jagan: రాష్ట్రంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారా..? జగన్ బొమ్మ చూసే ఓట్లు వేస్తారన్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే ఎమ్మెల్సీ ఎన్నికలను లైట్ తీసుకున్నారా..? రీడ్ దిస్ స్టోరీ.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చుట్టూనే రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. జగన్ బొమ్మ చూసే ఓట్లు వేస్తున్నారన్న భావన ఆ పార్టీలోని కీలక నేతల్లోనూ ఉంది. దీనిపై ఎమ్మెల్యేల్లో, సీనియర్ నేతల్లో తీవ్ర అసహనము ఉంది. సీఎం బొమ్మ చూసే కాకుండా స్థానిక నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మరిన్ని ఓట్లు సంపాదించేందుకు అవకాశం ఉందని ఎంతమంది చెప్పినా అధిష్టానం వినని పరిస్థితి. దీంతో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బయటపడింది. దాని ఫలితమే పొట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఘోర పరాభవంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ప్రాధాన్యం దక్కకపోవడంతో అసహనం..
అధికార పార్టీలో ఎమ్మెల్యే స్థాయి నుంచి కిందిస్థాయిలోని వార్డు మెంబర్ వరకు అందరిలోనూ అసహనం నెలకొని ఉంది. అధికారంలో ఉన్నామని చెప్పుకోవడమే తప్ప.. ఆ అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి పరిస్థితి లేదని కేడర్ వాపోతోంది. ముఖ్యంగా సచివాలయాలు, వార్డు వాలంటీర్లు వ్యవస్థ ఏర్పాటుతో గ్రామస్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర నాయకులు డమ్మీలుగా మిగిలిపోయారు. ఇక నియోజకవర్గస్థాయిలో ఆదాయ వనరుగా ఉన్న ఇసుక, మద్యం అమ్మకాలు ప్రభుత్వంలోని కీలక నేతల కను సన్నల్లో సాగుతున్నాయి. దీంతో ఎమ్మెల్యే స్థాయి నాయకులకు ఆదాయం కరువైంది. అదే సమయంలో నియోజకవర్గాలకు అభివృద్ధికి సంబంధించి నిధులు ఎమ్మెల్యేలకు ఇవ్వకపోవడంతో ఏ పనులు చేయలేక నిస్సహాయులుగా ఎమ్మెల్యేలు మిగిలిపోయారు. అంతా వారిలోనూ అసహనాన్ని పెంచింది.
సమయం చూసి దెబ్బ కొట్టారు..
2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆ తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఉప ఎన్నికల్లోను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించడంతో.. దంతా జగన్ మానియాగా భావిస్తూ వచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు నీరాజనం పడుతున్నారు అంటూ గొప్పలు పోయారు. అయితే, ఎమ్మెల్యేలు పనిచేయకపోతే ఎలా ఉంటుందో అన్న విషయాన్ని తెలియజేసే ఉద్దేశంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పట్ల అనేకమంది ఎమ్మెల్యేలు పట్టనట్టుగా వ్యవహరించారు. దీంతో అధికార పార్టీకి కాస్త అనుకూలంగా ఎంతోమంది ఓటర్లు ఉన్నప్పటికీ.. వారిని ప్రత్యేకించి ఓటు వేయమని ఎవరు అడిగిన దాఖలాలు లేవు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీల నుంచి పదే పదే ఫోనులు రావడంతో వారికి మద్దతు తెలిపారు. ఇదంతా ఎమ్మెల్యేలు, గ్రామస్థాయిలోని నాయకులు రావాలనే చేశారన్న చర్చ ప్రస్తుతం అధికార పార్టీలో నడుస్తోంది. ఎమ్మెల్యేలకు, నాయకులకు ఇవ్వాల్సిన కనీస గౌరవ మర్యాదలను ఇవ్వకపోవడం వల్లే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయని ఆ పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు.

AP MLC Elections- Jagan
వద్దన్నా వినకుండా..
ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ స్థానిక ఎమ్మెల్యేల మాటను అధిష్టానం పరిగణలోకి తీసుకోకపోవడం ఓటమికి కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వద్దంటూ ఇక్కడ పలువురు సీనియర్ నేతలు అధిష్టానానికి సూచించారు. అయినప్పటికీ స్థానిక ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు మాటలను పరిగణలోకి తీసుకోకుండా అభ్యర్థిని ఖరారు చేశారు. దీంతో ఆ అభ్యర్థన వద్దన్న నాయకులంతా ఎన్నికలను లైట్ తీసుకున్నారు. ఫలితమే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించేందుకు దోహదపడింది. అలాగే తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థుల విషయంలోనూ స్థానిక ఎమ్మెల్యేలు వ్యతిరేకతను వ్యక్తం చేశారు. పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థులు అయితే విజయం సాధించడం కష్టమని ముందే చెప్పినప్పటికీ అధిష్టానం పట్టించుకోకపోవడంతో అక్కడ నేతలు తూతూ మంత్రంగానే ప్రచారాన్ని నిర్వహించి వదిలేశారు. దీంతో రాయలసీమ ప్రాంతంలో రెండు స్థానాలను అధికార పార్టీ కోల్పోవాల్సి వచ్చింది. రాయలసీమ ప్రాంతంలో వైసిపి బలంగా ఉందని భావిస్తూ వచ్చినప్పటికీ రెండు పట్టభద్రుల స్థానాలు కోల్పోవడంతో వచ్చే ఎన్నికలపై ఈ ప్రభావం గట్టిగా ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.