Pawan Kalyan : ఏపీ ప్రభుత్వంపై గత కొన్నాళ్లుగా విరుచుకుపడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరికను ఎట్టకేలకు ఏపీ యువత తీర్చారు. కొద్దిరోజుల కిందట నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభ వేదికగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. కులం గొడవల్లో పడి యువత వైసీపీకి ఓట్లు వేస్తున్నారని, తన సభలకు మాత్రమే వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి అలా కాకుండా వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని సభా వేదికగా ఆయన పిలుపునిచ్చారు. అయితే ఈ పిలుపుపై రాష్ట్ర యువత గట్టిగానే స్పందించింది. రెండు రోజుల కిందట వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో యువత ఓటుతో వైసీపీ సర్కార్కు గట్టిగానే బుద్ధి చెప్పింది. ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు కారణంగానే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఎప్పటినుంచో పవన్ పిలుపు..
వైసీపీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పవన్ కళ్యాణ్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ యువతకు ఎప్పటినుంచో పిలుపు ఇస్తున్నారు. అయితే తాజా పట్టభద్రుల ఎన్నికల్లో ఎక్కువ మంది యువతే ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు ఫలించినట్టు అయింది. పవన్ కళ్యాణ్ పిలుపుకు అనుగుణంగానే మూడు చోట్ల పట్టభద్రులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పట్టం కట్టారు. దీంతో పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో కోరుకుంటున్న కోరికి నెరవేరింది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అందుకు యువత కంకణ బద్దులు కావాలని పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో పిలుపునిస్తున్నారు. ఆ పిలుపును ఎప్పటికీ అందిపుచ్చుకున్న యువత ప్రభుత్వానికి సరైన రీతిలో బుద్ధి చెప్పారు.
అధికారం తలకెక్కిన వైకాపా నేతలకు కనువిప్పు..
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో వైసీపీ ప్రభుత్వం పైన విమర్శలు ఎక్కుపెట్టారు. అధికారం తలకెక్కిన వైకాపా నేతలకు పట్టబద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించాలని పవన్ కళ్యాణ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇలాంటి వ్యతిరేక ఫలితమే ఉంటుందని పవన్ కళ్యాణ్ జోష్యం చెప్పారు.
ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత..
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తేటతెల్లము చేశాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మార్గదర్శకులు పట్టభద్రులు అన్న పవన్ కళ్యాణ్.. ఈ ఫలితాలు వైసిపి ప్రభుత్వానికి హెచ్చరిక ఉన్నాయనటంలో ఎటువంటి సందేహము లేదని పేర్కొన్నారు. ”అధికారం తలకెక్కిన వైసీపీ నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారు. సందిగ్ధంలో ఉన్న వారికి ఈ ఎన్నిక ద్వారా పట్టభద్రులు దారి చూపారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న తీర్పు పట్టభద్రుడు తమ ఓటు ద్వారా నిరసన తెలిపారు. ఫలితాలు ప్రజల ఆలోచన ధోరణిని తెలియజేస్తున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇలాంటి వ్యతిరేక ఫలితమే ఉంటుంది. ప్రజా కంటక పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు” అని పవన్ కళ్యాణ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.