మూడు రాజధానుల ప్రతిపాదనతో ఇరకాటంలో బీజేపీ
వైసిపి ప్రభుత్వం అనూహ్యంగా తెరమీదకు తెచ్చిన మూడు రాజధానుల ఏర్పాటు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఎ) చట్టం ఉపసంహరణ పరిణామాలతో బిజెపి పరిస్థితి తీవ్ర ఇరకాటంలో పడుతున్నది. అమరావతి నుంచి పరిపాలనా రాజధానిని విశాఖపట్నానికి తరలించాలన్న జగన్ నిర్ణయంతో కేపిటల్‌కు భూములిచ్చిన రైతుల్లో ఆందోళనలు చెలరేగాయి. వారి ఆవేదనను తమ రాజకీయ లబ్ధికి వాడుకోవాలని ఎత్తువేసి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీని బిజెపి దగ్గర చేసుకుంది. అప్పటి వరకు రాజధాని వికేంద్రీకరణపై […]

వైసిపి ప్రభుత్వం అనూహ్యంగా తెరమీదకు తెచ్చిన మూడు రాజధానుల ఏర్పాటు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఎ) చట్టం ఉపసంహరణ పరిణామాలతో బిజెపి పరిస్థితి తీవ్ర ఇరకాటంలో పడుతున్నది. అమరావతి నుంచి పరిపాలనా రాజధానిని విశాఖపట్నానికి తరలించాలన్న జగన్ నిర్ణయంతో కేపిటల్‌కు భూములిచ్చిన రైతుల్లో ఆందోళనలు చెలరేగాయి.
వారి ఆవేదనను తమ రాజకీయ లబ్ధికి వాడుకోవాలని ఎత్తువేసి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీని బిజెపి దగ్గర చేసుకుంది. అప్పటి వరకు రాజధాని వికేంద్రీకరణపై ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, రాయలసీమ ప్రాంతాల కింద విడిపోయిన ఆ పార్టీ నేతలు తలోమాట మాట్లాడారు.
పవన్ కళ్యాణ్, బిజెపి నాయకుల సంయుక్త సమావేశం, దానిలో అమరావతిని కొనసాగించాలన్న తీర్మానం ఆమోదించాక బిజెపి పరిస్థితి అడకత్తెరలో పావుచెక్క మాదిరిగా మారింది. శాసనసభలో రాజధాని వికేంద్రీకరణ, సిఆర్‌డిఎ చట్టం రద్దు బిల్లులు పాసయ్యాయి. అక్కడ బిజెపి ప్రాతినిధ్యం లేకపోవడంతో వైఖరి చెప్పాల్సిన అవసరం రాలేదు.
శాసన మండలిలో టిడిపికి మెజార్టీ ఉండటం, ఛైర్మన్ తన విచక్షణాధికారాన్ని ప్రయోగించిన దరిమిలా ప్రభుత్వ బిల్లులు సెలెక్టు కమిటీకి వెళ్లాయి. కౌన్సిల్‌లో బిజెపికి ముగ్గురు సభ్యులు ఉండగా (ఒకరు టిడిపి నుంచి బిజెపిలోకి వచ్చారు) ఉత్తరాంధ్ర ఎంఎల్‌సి మాధవ్ వికేంద్రీకరణను స్వాగతిస్తూనే అన్నీ ఒకేచోట పెట్టాలని విన్యాసాలు చేశారు. మరో సభ్యుడు సోము వీర్రాజు సైతం ఇదే పంధా అనుసరించారు.
అమరావతి కొనసాగాలని బిజెపి తీర్మానించిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెపుతుండగా మాధవ్, సోము వీర్రాజు అందుకు భిన్నంగా మాట్లాడారన్న వాదనలు చెలరేగుతున్నాయి.
మండలి రద్దుకు విషయంలో సహితం కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఇప్పటికే సుమారు 10 రాష్ట్రాల నుండి మండలిలను ఏర్పర్చాలనే తీర్మానాలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తున్నది. జగన్ తీర్మానాన్ని పరిగణలోకి తీసుకొంటే వాటిని సహితం తెరపైకి తేక తప్పదు. అందుకనే ఈ విషయంలో కేంద్రం ముందుకు వెళ్లే అవకాశం కనబడటం లేదు.
విశాఖకు ఎగ్జిక్యటివ్ కేపిటల్ రాకకు మోకాలొడ్డిందన్న అసహనాలను ఉత్తరాంధ్రలో, మరికొన్ని ప్రాంతాల్లో ఎదుర్కోవాలని ఆ పార్టీ నేతలు మధన పడుతున్నారు. జనసేనతో కుదుర్చుకున్న పొత్తు అమరావతిలో ఏ మేరకు రాజకీయ లబ్ధి పొందగలమని ప్రశ్న ఆ పార్టీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది. రాజధాని విషయంలో మోకాలడ్డితే చంద్రబాబు హీరో అవుతాడు గాని తాము కాదు గదా అనే సంశయం ఆ పార్టీ వర్గాలను వెన్నంటుతున్నది.
హైకోర్టును కర్నూలులో, అమరావతి, విశాఖల్లో హైకోర్టు బెంచ్‌లు పెట్టాలని వైసిపి సర్కారు శాసనసభలో తీర్మానం చేసింది. హైకోర్టు వ్యవహారం పూర్తిగా న్యాయస్థానాలు, కేంద్రం పరిధిలోనివి. కాబట్టి తమ కోర్టులోకొచ్చిన హైకోర్టు అంశాన్ని ఉపయోగించుకోవాలని బిజెపి తొలుత భావించింది.
రాయలసీమ డిక్లరేషన్‌లో అందరికంటే తామే హైకోర్టును కర్నూలులో పెట్టమన్నాం కనుక వెంటనే ఆ పని చేస్తే వైసిపికి రాజకీయ మైలేజి వస్తుంది మినహా తమకేమాత్రం ఉపయోగపడదని బిజెపి నేతలు అంచనా వేస్తున్నారు.
అయితే హైకోర్టు లో 70 శాతం కేసులు కోస్తా ప్రాంతానివే అని, మిగిలిన 30 శాతం మాత్రమే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవని తెలుస్తున్నది. అటువంటి పరిస్థితులలో హై కోర్ట్ తరలింపుకు సుప్రీం కోర్ట్ ఏ మాత్రం సుముఖత వ్యక్తం చేస్తుందో ప్రశ్నార్ధకరమే. ఇక్కడ హైకోర్టు మార్పుకు, హైకోర్ట్ బెంచ్ లకు ఆమోదం తెలిపితే పలు రాష్ట్రాల నుండి అటువంటి సమస్యలు ఎదురు కావచ్చని బిజెపి అధిష్టానం వెనుకడుగు వేసే అవకాశం లేకపోలేదు.
By నరేంద్ర చలసాని