Pawan Kalyan Ippatam : ఒక ప్రభుత్వాలు చేయాల్సిన పనిని పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. రక్షించాల్సిన ప్రభుత్వాలు భక్షిస్తుంటే.. ప్రజలను పీడిస్తుంటే.. ‘కష్టం’ అంటే చాలు నేనున్నాను అంటూ పవన్ కళ్యాణ్ తరలివస్తున్నారు. పార్టీ అధికారంలో లేకపోయినా.. ప్రతిపక్షంలో ఇబ్బందుల్లో ఉన్నా కూడా తను సినిమాల్లో కష్టపడి సంపాదించిన సొమ్మును బాధితుల కోసం ఖర్చు చేస్తున్నాడంటే పవన్ సేవానిరతిని అర్థం చేసుకోవచ్చు. అధికారంలో ఉన్నా లేకున్నా కోట్లు కూడబెట్టుకుంటున్న నేతలున్న ఈరోజుల్లో ప్రజల కోసం తన ఆస్తిపాస్తులు, సంపాదనను ఖర్చు చేస్తున్న పవన్ కళ్యాణ్ తీరుకు జనాలు జేజేలు పలుకుతున్నారు. తాజాగా ఈరోజు ఇప్పటంలో వైసీపీ సర్కార్ కూల్చివేసిన ఇళ్ల బాధితులకు ఇంటికి లక్ష రూపాయల సాయం అందించేందుకు పవన్ కళ్యాణ్ తరలివస్తున్నారు.
ఏపీ రాజకీయాలు మొత్తం ‘ఇప్పటం’ బాధితుల చుట్టే తిరుగుతున్నాయి. ఇటీవల కోర్టుకు ఎక్కిన ఇప్పటం పిటీషనర్లకు లక్ష జరిమానా విధించింది కోర్టు. దీంతో సుప్రీంకోర్టుకు ఎక్కి బాధితులు పోరాడుతున్నారు. వైసీపీ సర్కార్ అన్యాయాలపై కదం తొక్కుతున్నారు. వారికి బాసటగా నిలిచేందుకు బాధితులకు అండగా ఉండేందుకు పవన్ నేడు ఇప్పటం పర్యటనకు వస్తున్నారు. ముందే హామీ ఇచ్చినట్టు బాధితులకు ఆర్థికసాయం అందించనున్నారు. కూల్చివేతలతో నష్టపోయిన ప్రతీ ఇంటికి లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు.
గుంటూరు జిల్లా ఇప్పటం రైతులు చేసిన తప్పు ఏంటంటే.. జనసేన ఆవిర్భావ సభకు తమ వ్యవసాయ భూములు ఇవ్వడం.. ఒక మారుమూల చిన్న గ్రామస్థులపై పంతం పట్టిన వైసీపీ సర్కార్ రోడ్డు వెడల్పు పేరిట భూములిచ్చిన రైతుల ఇళ్లను కూల్చింది. ఈ అన్యాయాన్ని ఎలుగెత్తి చాటిన పవన్ తమ పార్టీ సభకు భూములిచ్చిన రైతుల కుటుంబాలకు ఇంటికి లక్ష రూపాయాలు ఇవ్వాలని నిర్ణయించారు. నేడు బాధితులకు ఆర్థికసాయం అందించనున్నారు.
పవన్ కళ్యాణ్ పర్యటనలను అడుగడుగునా అడ్డుకుంటున్న వైసీపీ ఈసారి కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేయవచ్చని తెలుస్తోంది. ఇక ఈ వివాదం కోర్టుకు ఎక్కిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం కూడా పవన్ పర్యటనను వ్యతిరేకిస్తోంది. అయితే జనసైనికులు మాత్రం పవన్ పర్యటనను విజయవంతం చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. వైసీపీ వారికి ధీటుగా ఆందోళనలు చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో నేడు ఇప్పటంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోనన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది.