AP Police: అప్పుడెప్పుడో సినిమాల్లో నిత్యం ఒక దృశ్యం కనిపించేది. తనవారిని ప్రత్యర్థి నుంచి కాపాడుకునే క్రమంలో హీరోకు, విలన్లకు పతాకస్థాయిలో ఫైట్ జరుగుతుంటుంది.ఎలాగోలా విలన్లను హీరో మట్టుబెట్టి తన వారిని కాపాడుకుంటాడు. అలా ఎండ్ కార్డు పడేసరికి పోలీసులు ఎంటరవుతారు. ఇలా వస్తారో లేదో సినిమా కూడా పూర్తవుతుంది. ఇటువంటి దృశ్యాలు మనం వందల సినిమాల్లో చూసి ఉంటాం. అప్పుడు అదో ట్రెండ్. కానీ ఇటీవల కాలంలో పోలీస్ శాఖను గొప్పగా చూపిస్తున్నారు. కేసుల ఛేదన నుంచి శాంతిభద్రతల పరిరక్షణ వరకూ వారి చేసే సాహసాలను హైలెట్ చేస్తూ సినిమాలు తెరపైకి వస్తున్నాయి. అంతవరకూ బాగానే ఉంది కానీ. ఏపీ పోలీస్ శాఖ కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. వైసీపీ సర్కారు చర్యలతో ప్రజల్లో చులకనవుతోంది. కొంతమంది అధికారుల కొలువు కాంక్షతో పోలీస్ శాఖనే ప్రభుత్వానికి తాకట్టు పెట్టేస్తున్నారన్న టాక్ నడుస్తోంది.

AP Police
ఎక్కడైనా తమకు అన్యాయం జరిగిందని.. తమపై దాడులకు తెగబడుతున్నారని ఫిర్యాదుచేస్తే బాధితులకు రక్షణ కల్పించాలి. దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదుచేయాలి. కానీ ఏపీలో మాత్రం సీన్ రివర్స్. దాడిచేసిన వారు దర్జాగా ఉంటున్నారు. బాధితులు కేసులపాలవుతున్నారు. నిన్న పుంగనూరులో జనసేన నాయకుడు రామచంద్రయాదవ్ ఇంటిపై దాడి విషయంలో కూడా ఇదే బయటపడింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై రామచంద్రయాదవ్ గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన జనసేనలో యాక్టివ్ గానే ఉన్నారు. నియోజకవర్గంలో ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. అందులో భాగంగా రైతుమహాసభ ఏర్పాటుచేశారు. దానికి అనుమతి లేదంటూ ఆపింది పోలీసులే. ఆయన ఇంటిపై వైసీపీ అల్లరిమూకలు దాడిచేసినప్పుడు ప్రేక్షక పాత్ర పోషించింది పోలీసులే.మీడియాలో ఈ ఘటన హైలెట్ అయ్యేదాక పోలీస్ శాఖ కనీసం స్పందించలేదు. స్టేట్ ఇష్యూగా మారుతుందని గ్రహించి కేసు నమోదుచేసినట్టు లీకులిచ్చారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ అంతకంటే ముందుగానే రామచంద్రయాదవ్ పై నాలుగు కేసులు నమోదుచేశారు.
బాధితులపైనే కేసులు నమోదు కావడం గత మూడున్నరేళ్లుగా కామన్ గా మారిపోయింది. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు. ఎదురించి నిలబడితే ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు సభలు, సమావేశాలు పెట్టుకోవడాన్ని కూడా సహించలేకపోతున్నారు. ఏకంగా దాడులకు తెగబడుతున్నారు. ఈ విధ్వంసాల నుంచి ప్రజలను, బాధితులను రక్షించాల్సిన పోలీసులు వారితో చేయి కలుపుతున్నారు. దీంతో పోలీసులంటేనే జనం జడుసుకునే స్థితికి ఏపీ వచ్చింది. పలానా వారితో ఇబ్బందిపడుతున్నామని తెలిస్తే సమస్య జఠిలమై.. తామే తిరిగి బాధ్యులైపోతామన్న బాధ బాధితులను వెంటాడుతోంది. ఏం జరుగుతుందో అది జరగని కానీ.. పోలీసులను ఆశ్రయించకూడదని భావిస్తున్న వారు ఏపీ సమాజంలో ఇప్పుడు ఎక్కువయ్యారు. ఏపీ సీఎం జగన్ విపక్షంలో ఉన్నప్పుడు అన్న మాటను అందరూ ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు. తాను అధికారంలోకి వస్తే బాధితులపై కేసులు నమోదుచేయిస్తానన్నారు. యధాలాపంగా అన్నారో ఏమో, నాడు ఆయన తూలిన మాట ఇప్పుడు నిజం చేసి చూపిస్తున్నారు.

AP Police
ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి పోలీస్ శాఖ అనుకూలంగా పనిచేస్తుంది. ఇది సర్వసాధారణ విషయమే. కానీ పోలీసులే వైసీపీ మనుషులుగా మారిపోయారు. వారికి పోలీస్ యూనీఫారం పంపించండి అంటూ సాక్షాత్ విపక్ష నేత చంద్రబాబు రాష్ట్ర డీజీపీకి సూచించారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వైసీపీ అరాచక శక్తులను అండగా ఉండేందుకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను, రూల్స్, రెగ్యులేషన్స్ ను మాత్రం వైసీపీ నేతలు మార్చేశారన్న విమర్శనైతే మూటగట్టుకున్నారు. ఆ మధ్యన డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ అల్లరిమూకలు దాడులకు తెగబడ్డారు. దీనిపై వీడియోలతో సహ ఫిర్యాదుచేసినా ఇంతవరకూ బాధ్యులపై చర్యలు లేవు. ఇందులో మరో విషయమేమిటంటే దాడులు చేస్తున్న ఓ వ్యక్తిని టీడీపీ శ్రేణులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాయి. ఆ వ్యక్తి డీజీపీ ఆఫీసులో పనిచేసే సీఐగా గుర్తించారు. అంటే పోలీసులే అరాచక శక్తులుగా మారిపోయారనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ప్రభుత్వ భవనాలకు రంగులు మార్చిన వైసీపీ నేతలు.. త్వరలో పోలీస్ యూనిఫారంను బ్లూ కలర్ లో మార్చిన ఆశ్చర్యపోనవసరం లేదని టీడీపీ నేతలు షటైర్లు వేస్తున్నారు. రౌడీయిజం, పోలీసుల అరాచకం కలిశాక.. అరాచకాంధ్రప్రదేశ్ గా మారిందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.