Pawan Fan post: ఏపీ సీఎం జగన్ ను తిడితే ఆ రాష్ట్ర పోలీసులు ఊరుకోవడం లేదు. కేసులతో బెంబేలెత్తిస్తున్నారు. అయితే వాక్ స్వాతంత్ర్యపు హక్కుతో కొందరు సోషల్ మీడియాలో అనుచితంగా వ్యాఖ్యలు చేసినా వారికి చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా ఓ జనసైనికులు ఏపీ సీఎం జగన్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఏపీ పోలీసులు వెంటనే రియాక్టర్ అయ్యారు. జనసేన సానుభూతి పరుడైన ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా ఏకంగా రాజద్రోహం కేసు పెట్టడమే కాకుండా ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారని సెక్షన్లు పెట్టారు.
అయితే వీటికి ఆధారాలేమిటి అని న్యాయమూర్తి ప్రశ్నిస్తే సోషల్ మీడియా పోస్టును పోలీసులు చూపించారు. దీంతో ఇది ప్రతీకార చర్య అని.. నిందితుడిని జైల్లో ఉంచాలనే ఇలాంటి సెక్షన్లు పెట్టారని ఆగ్రహించారు. రిమాండ్ రిపోర్టును కోర్టు తిరస్కరించి వెంటనే జనసైనికుడికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
రాజమండ్రికి చెందిన పవన్ ఫణీ హైదరాబాద్ లో మెడికల్ రిప్రజెంటీటీవ్ గా పనిచేస్తున్నాడు. జనసేనపై అభిమానంతో టీడీపీ, వైసీపీపై ట్వీట్లు చేస్తూ ఉంటాడు. అయితే ఇటీవల మానవబాంబుగా మారి సీఎం జగన్ ను చంపేస్తానని పోస్టు పెట్టి కాసేపటికి తీసేశాడు.
సీఐడీ అధికారులు మాత్రం వెంటపడి రాజద్రోహం… ప్రభుత్వంపై యుద్ధం కేసులు పెట్టారు. కోర్టుతో చీవాట్లు తిన్నారు. జనసేన పార్టీ కూడా అతడిని పట్టించుకోలేదు. తమకు సంబంధం లేదని ప్రకటించడంతో ఆ యువకుడి పరిస్థితి ఎటూ కాకుండా పోయింది. జనసైనికుడిపై కేసు పెట్టారని తెలియడంతో మిగతా పోస్టులు పెట్టిన జనసేన సానుభూతి పరులు డిలీట్ చేయడమో.. ఖాతానే లేకుండా తొలగించడం చేశారు.
సీఎంపై పోస్టుల కేసులో పవన్ ఫణికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు ఆ సెక్షన్లపై అభ్యంతరం వ్యక్తం చేసింది. నిందితుడిపై పెట్టిన సెక్షన్లపై అభ్యంతరం తెలిపింది. సొంత పూచీకత్తుపై ఫణికి గుంటూరు 6వ అదనపు కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఫణి రిమాండ్ రిపోర్టును కోర్టు తిరస్కరించింది.
సీఎంను చంపుతానని పోస్టులు పెట్టినట్లు పవన్ ఫణిపై నమోదైన కేసు సెక్షన్లపై న్యాయమూర్తి అభ్యంతరం తెలిపారు. ఆధారాలు లేకుండా… రాజద్రోహం, ప్రభుత్వంపై యుద్ధం వంటి సెక్షన్లతో కేసు నమోదు చేయటాన్ని ప్రశ్నించారు. నిందితుడిని జైల్లో ఉంచాలనే ఇలాంటి సెక్షన్లు పెట్టారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.