
AP MLC Elections Results 2023
AP MLC Elections Results 2023: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు అన్ని పార్టీలకు గుణపాఠాలు నేర్పాయి. అధికార పార్టీకి ఓటమి పలుకరించగా.. విజయం కోసం ముఖం వాచిపోయేలా చూస్తున్న టీడీపీకి ఈ ఎన్నికలు కాస్తా ఉపశమనం కలిగించాయి. అధికార పక్షానికి ప్రమాద సంకేతం ఇవ్వగా.. విపక్షానికి కాస్తా ఊరటనిచ్చి మేలుకొల్పాయి. అయితే ఇది పరాజయమా? లేక ఘోర పరాజయమా? అన్నది పోస్టు మార్టం నిర్వహించుకోవాల్సిన అవసరం అధికార పార్టీపై ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది స్థానిక సంస్థలు, మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకుఎన్నికలు జరిగాయి. అయితే ఐదు స్థానిక సంస్థలను ఏకగ్రీవం చేసుకున్న వైసీపీ, మిగతా నాలుగింటిలో కూడా సునాయాస విజయాలను చేజిక్కించుకుంది. రెండు ఉపాధ్యాయ స్థానాలను దక్కించుకుంది. మూడు పట్టభద్రుల స్థానాల్లో మాత్రం చతికిలపడింది. అయితే ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు ప్రభుత్వంపై కారాలు, మిరియాలు నూరుతున్న వేళ.. జగన్ సర్కారుకు కాస్తా ఉపశమనం కలిగించే విషయం.
ఈ ఎన్నికలు నుంచి ముందుగా వైసీపీయే గుణపాఠం నేర్చుకోవాలి. గత ఎన్నికల్లో అంతులేని మెజార్టీతో గెలుపొందిన ఆ పార్టీ అదే పరంపరను కొనసాగించింది. సంక్షేమ తారకమంత్రంతోనే ఇది సాధ్యమైందని భావించి.. దానిని మరింత పదునెక్కించింది. అభివృద్ది అక్కర్లేదన్న రేంజ్ లో వ్యవహరించింది. దానికి మూల్యం చెల్లించుకుంది. ఎంతసేపూ సమాజంలోని కొన్ని వర్గాల వాళ్లనే పట్టించుకుంటూ, వాళ్లు తప్పకుండా తమకు ఓటేస్తారనే ధీమాతో, తక్కిన వర్గాలను నిర్లక్ష్యం చేస్తే యిదే జరుగుతుంది. పథకాల వలన లాభపడ్డవారు అధికార పార్టీకి తప్పకుండా ఓటేస్తారన్న గ్యారంటీ లేదని ఎన్నికలు నిరూపిస్తున్నాయి. మా డబ్బేగా మాకిచ్చేది అనే భావం వారిలో యిప్పటికే ఉంది. సమాజంలో ప్రతి వర్గానికీ సంక్షేమ పథకాలివ్వడం సాధ్యమయ్యే పని కాదు. బడుగు వర్గాలకే యివ్వాలి. కానీ అది కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా యివ్వాలి. కొన్ని వర్గాల కోసం మానిఫెస్టోలో లేని పథకాలు సైతం కనిపెట్టి, ఖజానా ఖాళీ చేసి, ఉద్యోగులకు జీతాలు ఆలస్యం చేసి, డిఎ బకాయిలు తొక్కి పెట్టి, పెన్షన్ చెల్లింపులు వాయిదా వేసి, కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగు పెట్టి వాళ్లందరినీ ఏడిపిస్తే ఫలితం ఇలానే ఉంటుంది.
తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక లెక్కలు కట్టి ప్రభుత్వ ఉద్యోగుల కళ్లల్లో నవ్వులేదని చెప్పుకొచ్చారు. వారు నిరంతరం నవ్వితేనే ఈ రాష్ట్రం శుభిక్షంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. మరి అటువంటి ఉద్యోగులనే ఏడిపిస్తే దానిని ఏమనాలి? అందుకే వారు కూడా ప్రతిఘటించడం ప్రారంభించారు. రాష్ట్రంలో గుంతల రహదారులు, మౌలిక వసతులు లేని గ్రామాలను పట్టించుకోకుండా గ్లోబల్ సమ్మిట్ లు అని తిరిగినా ప్రజలు నమ్మరు. ఒక రాజధానికే దిక్కలేదనుకుంటే.. మూడురాజధానుల ముచ్చట అని ప్రజలు వినరు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. ఆ అభివృద్ధే లేనప్పుడు ఖాతాల్లో డబ్బులు వేసినా వారు పట్టించుకోరు. అందుకే పనిగట్టుకొని అధికార పక్షాన్ని ఓడించారు. వైఫల్యాలను తమ ఓటు ద్వారా గుర్తుకు తెచ్చేలా చేశారు.

AP MLC Elections Results 2023
తెలుగుదేశం పార్టీకి కూడా ఈ ఎన్నికలు ఒక కనువిప్పే. రాజకీయ పక్షంతో గెలుపోటములతో సంబంధం లేకుండా పోరాడితేనే గుర్తింపు ఉంటుంది. ప్రజాదరణ దక్కుతుంది. గత స్థానిక సంస్థల ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించడం ఒకరకంగా తప్పిదమే. అధికార పార్టీ దాష్టీకాలు పెరుగుతున్న క్రమంలో నాడు నిర్ణయం తీసుకోవచ్చు. కానీ నాటి స్థానిక సంస్థల్లో కనీస స్థాయిలో ప్రజాప్రతినిధులు గెలుచుకున్నా. నేటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించే చాన్స్ దక్కేది. కానీ నాడు చంద్రబాబు వరుసగా పలుకరించిన ఓటములు, అధికార పార్టీ దూకుడు ముందు తేలిపోయారు. పోరాటం చేయలేక చేతులెత్తేశారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధైర్యం పోగుచేసుకొని పోరాడారు. అటు వ్యూహాలు ఫలించాయి. లెఫ్ట్ పార్టీలతో పాటు పవన్ పిలుపు కూడా విజయానికి దోహదం పడింది. గతంలో తాను చేసిన తప్పిదాలకు ఈ ఎన్నికలు కనువిప్పు కలిగించాయి.