రాజ్ భవన్ కు చేరిన శాసన మండలి వివాదం
ప్రభుత్వం ప్రతిష్టాకరంగా భావిస్తున్న బిల్లులను సెలెక్ట్ కమిటీకి నివేదించాలని తనకున్న విశేష అధికారాలను ఉపయోగించుకొని చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ నిర్ణయించడంతో ఒక వంక శాసనమండలి రద్దు పక్రియను వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టగా, తాజాగా సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయమని చైర్మన్ ఇచ్చిన ఆదేశాన్ని మండలి కార్యదర్శి తిరస్కరించడంతో ఏర్పడిన రాజ్యాంగ సంక్షోభం ఇప్పుడు రాజ్ భవన్ కు చేరింది. రాజధాని బిల్లులపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అంశంలో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో శాసనమండలి […]

ప్రభుత్వం ప్రతిష్టాకరంగా భావిస్తున్న బిల్లులను సెలెక్ట్ కమిటీకి నివేదించాలని తనకున్న విశేష అధికారాలను ఉపయోగించుకొని చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ నిర్ణయించడంతో ఒక వంక శాసనమండలి రద్దు పక్రియను వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టగా, తాజాగా సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయమని చైర్మన్ ఇచ్చిన ఆదేశాన్ని మండలి కార్యదర్శి తిరస్కరించడంతో ఏర్పడిన రాజ్యాంగ సంక్షోభం ఇప్పుడు రాజ్ భవన్ కు చేరింది.
రాజధాని బిల్లులపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అంశంలో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో శాసనమండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ని కలసి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా నిరాకరిస్తున్నారని.. తనకు సహకరించకపోగా ప్రభుత్వానికి… మండలికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడానికి కారకులయ్యారని ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం మండలికి కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఇన్‌చార్జి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని చైర్మన్ కోరారు. ఆ స్థానంలో విజయరాజును నియమించాలని విజ్ఞప్తి చేశారు.
చట్ట సభ చైర్మన్ సభ నిర్వహణకు సంబంధించిన అంశాల్లో గవర్నర్‌ను కలవడం ఇదే ప్రధమం. అసెంబ్లీ కార్యదర్శి నియామకంలో గవర్నర్‌కు కూడా పాత్ర ఉండడంతో షరీఫ్ నేరుగా ఆయన్నే కలిసి పరిస్థితిని నివేదించారు.
మండలి సమావేశాల్లో రాజధాని బిల్లులు చర్చకు వచ్చిన నాటినుంచి ఇప్పటివరకూ చోటు చేసుకున్న పరిణామాలను వివరిస్తూ ఛైర్మన్ నాలుగు పేజీల వినతిపత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. తాను కార్యదర్శికి జారీ చేసిన ఆదేశాల ప్రతులు, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన నోట్ ఫైల్‌ను కూడా ఇచ్చారు. చట్టసభల నిర్వహణలో రాజ్యాంగ సంప్రదాయాలకు సంబంధించి ప్రమాణంగా పాటించే కౌల్ అండ్ షక్దర్ పుస్తకంలో తన అధికారాల గురించి ఇచ్చిన వివరణను కూడా చైర్మన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
రాజధాని బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ తానిచ్చిన ఆదేశాలను ప్రశ్నిస్తూ మండలిలో సభా నాయకుడిగా ఉన్న రెవెన్యూ మంత్రి (ఉపముఖ్యమంత్రి పిల్లి సుభా్‌షచంద్రబోస్) పంపిన లేఖ.. చైర్మన్ అధికారాలను ధిక్కరించడమేనని పేర్కొంటూ దానిపై కౌల్ అండ్ షక్దర్ ప్రస్తావనను ఆయన ఉటంకించారు.
‘సభాపతి రూలింగ్ ఎవరూ ప్రశ్నించరానిది. దానిని ఏ రూపంలో ప్రశ్నించినా ధిక్కారమే అవుతుంది. సభలో ప్రకటించినా లేదా ఫైలుపై రాసినా సభాపతి ఆదేశం పాటించాల్సిందే. తన నిర్ణయానికి కారణాలను కూడా సభాపతి వివరించాల్సిన అవసరం లేదు’ అని కౌల్ అండ్ షక్దర్ పేర్కొన్నట్లు తెలిపారు.
సభకు వచ్చిన రాజధాని బిల్లులు సభామోదం పొందలేదని, సభలో ఏకాభిప్రాయం సాధించడానికి అనేక ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో తనకు సంక్రమించిన అధికారాల కింద ఆ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించానని చైర్మన్ గవర్నర్ కు స్పష్టం చేశారు.
‘కమిటీ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ సభానాయకుడిగా ఉన్న మంత్రి నాకు లేఖ రాశారు. కార్యదర్శికి రాయలేదు. అయినా ఆ లేఖను ఉటంకిస్తూ మండలి కార్యదర్శి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే ప్రయత్నం చేశారు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ఫైలును నాకు పంపడంలో తన విధిని విస్మరించారు’ అంటూ కార్యదర్శి వ్యవహారాలను తూర్పురాబట్టారు. దానితో ఈ మొత్తం వివాదం కొత్తరూపు సంతరించుకొని అవకాశం ఏర్పడుతున్నది.