ఏపీ ప్రభుత్వం భీమా సంస్థకు మోకాలడ్డిన కేంద్రం!
వ్యవసాయ భీమా పధకంలో ప్రైవేట్ భీమా కంపెనీ ప్రమేయం లేకుండా చేయడం కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సొంతంగా నెలకొల్పదలిచిన బీమా సంస్థకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ఐఆర్‌డిఎ) నుంచి అనుమతులిచ్చే విషయంలో కేంద్రం మోకాలొడ్డినట్లు తెలుస్తున్నది. అలాగే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే ప్రీమియం వాటా పైనా సందిగ్ధం నెలకొన్నట్లు చెబుతున్నారు. పంటల బీమా పథకాల అమలు కోసం కేంద్రంలో మోడీ సర్కారు వచ్చాక 2016 ఖరీఫ్ నుంచి సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి వరకు […]

వ్యవసాయ భీమా పధకంలో ప్రైవేట్ భీమా కంపెనీ ప్రమేయం లేకుండా చేయడం కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సొంతంగా నెలకొల్పదలిచిన బీమా సంస్థకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ఐఆర్‌డిఎ) నుంచి అనుమతులిచ్చే విషయంలో కేంద్రం మోకాలొడ్డినట్లు తెలుస్తున్నది. అలాగే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే ప్రీమియం వాటా పైనా సందిగ్ధం నెలకొన్నట్లు చెబుతున్నారు.
పంటల బీమా పథకాల అమలు కోసం కేంద్రంలో మోడీ సర్కారు వచ్చాక 2016 ఖరీఫ్ నుంచి సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి వరకు పంటల బీమా స్కీంలన్నింటినీ ప్రభుత్వరంగంలోని జాతీయ వ్యవసాయ పంటల బీమా సంస్థ (ఎఐసి) నిర్వహించేది.
బిజెపి సర్కారు పంటల బీమాలో ప్రైవేటు కంపెనీలను ప్రవేశపెట్టి ఎఐసి పాత్రను కుదించింది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్‌బివై), పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా (ఆర్‌డబ్ల్యుబిసిఐఎస్) పథకాలను తీసుకొచ్చింది. వీటి వలన రైతులకు కలిగే మేలు కంటే ప్రైవేటు కంపెనీలు అధిక లాభాలు పోగేసుకుంటున్నాయి.
రాష్ట్రంలో అధికారం చేపట్టిన వైసిపి ప్రభుత్వం రైతుల ప్రీమియం వాటాను తానే చెల్లించేందుకు ముందుకొచ్చింది. రైతులు ఒక్క రూపాయి చెల్లించి మీ-సేవా కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రీమియం వాటాను చెల్లిస్తుందని కొత్త పథకం ప్రవేశపెట్టింది. 2019 ఖరీఫ్‌లో ఆ పథకాన్ని అమలు చేసింది.
రబీ నుంచి కేంద్ర పథకాలతో సంబంధం లేకుండా రాష్ట్రమే ఒక ఇన్సూరెన్స్ కంపెనీని నెలకొల్పి ప్రైవేటు కంపెనీలను పంటల బీమా నుంచి తప్పించాలని ఆలోచన చేసింది. డిసెంబర్ 12న మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్న మీదట పంటల బీమా అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం స్వంతంగా ఎపి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను రూ.101 కోట్లతో ఏర్పాటు చేసేందుకు నిరుడు డిసెంబర్ 20న జిఒనెం.157 జారీ చేసింది.
ఏదైనా బీమా సంస్థ నెలకొల్పాలంటే జాతీయ స్థాయిలోని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ఐఆర్‌డిఎ) అనుమతి కావాలి. ఎపి సర్కారు నెలకొల్పదలిచిన జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వ్యవహారం ఐఆర్‌డిఎవద్ద పెండింగ్‌లో ఉంది.
ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు నష్టం కలిగించేలా, అదీ తన నిర్ణయాలను కాదని, వైసిపి సర్కారు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో స్వంత ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటుకు యత్నించడంపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. అనుమతులు ఇవ్వకుండా ఐఆర్‌డిఎ వద్ద కేంద్రం మోకాలొడ్డినట్లు ఆరోపణలొస్తున్నాయి