AP Debts: రూ.10 లక్షల కోట్ల అప్పు సరే.. మరి వాటి లెక్కో?

వాస్తవానికి సంక్షేమ పథకాలు మాటున పంచింది తక్కువే. కానీ అన్ని లెక్కలు కట్టి సంక్షేమ అమలు చేస్తున్నామని ప్రగల్బాలు పలుకుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రైతుల ధాన్యం కొనుగోళ్లు సైతం పంచుడు జాబితాలోనే వేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి.

  • Written By: Dharma
  • Published On:
AP Debts: రూ.10 లక్షల కోట్ల అప్పు సరే.. మరి వాటి లెక్కో?

AP Debts: ఏపీ ప్రభుత్వ అప్పు దాదాపు పదిలక్షల కోట్లు. నేరుగా రుణాలతో పాటు కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులు దాదాపు పది లక్షల కోట్లకు చేరాయి. కానీ దొంగ లెక్కల తో కేవలం నాలుగు లక్షల కోట్లతో సరిపెడుతున్నారు. కార్పొరేషన్లు ద్వారా తీసుకున్న రుణాలు తమవి కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు. అయితే పథకాల ద్వారా రెండున్నర లక్షల కోట్లు పంచామని సీఎం జగన్ చెబుతున్నారు. మరి మిగతా ఏడున్నర లక్షల కోట్లు ఏమయ్యాయి అంటే సమాధానం చెప్పలేని స్థితిలో జగన్ సర్కారు ఉంది. కనీసం దీనిపై శ్వేత పత్రం విడుదల చేసే ధైర్యం కూడా లేదు.

వాస్తవానికి సంక్షేమ పథకాలు మాటున పంచింది తక్కువే. కానీ అన్ని లెక్కలు కట్టి సంక్షేమ అమలు చేస్తున్నామని ప్రగల్బాలు పలుకుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రైతుల ధాన్యం కొనుగోళ్లు సైతం పంచుడు జాబితాలోనే వేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ స్థాయిలో అప్పులు రాష్ట్ర ప్రయోజనాలకు వినియోగించి ఉంటే.. రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి సాధించి.. ప్రగతిపధం వైపు అడుగులు వేసేది.

అమరావతి కట్టాలంటే డబ్బులు లేవు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలంటే నిధుల కొరత. కానీ అప్పులు చూస్తే మాత్రం చాంతాడంత కనిపిస్తున్నాయి. కనుచూపుమేరలో ఉపశమనం కలిగించే పరిస్థితి లేదు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కట్టుకుంటూ పోతే.. దాని విలువ పెరిగేది. ఆదాయం సమకూరేది. 30 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టుగా సేవలు అందించేది. రాష్ట్రంలో కరువు ఛాయలు అనేవి ఉండేవి కావు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేవి. కానీ పంచుడే తప్ప.. శాశ్వత అభివృద్ధి పనులేవీ చేయలేకపోవడం ముమ్మాటికి జగన్ వైఫల్యమే.

ప్రజల జీవన ప్రమాణాలను పెంచామని వైసీపీ ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు. ఊహ నా మేధావులు సమర్థిస్తున్నారు. కానీ ఈ అప్పుల గుదిబండ ఏమిటనేది మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు. అప్పు చేయడం తప్పు కాదు కానీ.. ఆ అప్పునకు లెక్క చూపకపోవడమే పెద్ద తప్పు. సంక్షేమ పథకాల మాటున లూటీ జరిగింది. నాడు నేడు పథకంలో భాగంగా జగనన్న విద్య కానుక కిట్లు అందించారు. ఆ కానుకలు అందించే బాధ్యతను అస్మదీయ కంపెనీకి కట్టబెట్టారు. పాఠశాలల్లో ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. ఆ ఫర్నిచర్ సరఫరా చేసే బాధ్యతను సొంత సంస్థకు కట్టబెట్టారు. ఇలా ప్రతి పథకం వెనుక లూటీ ఉంది. అమ్మ ఒడిలో ప్రతి విద్యార్థికి 15000 అందిస్తున్నారు. అందులో పాఠశాల నిర్వహణ గాను 2000 రూపాయలు పక్కదారి పట్టించారు. ఇలా ప్రతి పథకంలోనూ అస్మదీయ ప్రయోజనాలే అధికం. గత ప్రభుత్వంలో చంద్రబాబు చూసి చూడనట్టుగా వ్యవహరించాలని.. కొందరికి ప్రయోజనం కలిగించారని కేసులు నమోదు చేశారు. ఆ లెక్కన చూసుకుంటే సీఎం జగన్ తో పాటు అనుకూలమైన అధికారులపై ఎన్ని కేసులు నమోదు చేయాలో.. వారికే ఎరుక.

Read Today's Latest Telangana politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు