Margadarsi Case: రామోజీ కోడలు శైలజ నోరు విప్పలేదు.. అయినా జగన్ ఊరుకోడు

మార్గదర్శకి ఆయువు పట్టయిన ఆంధ్రప్రదేశ్లో 37 బ్రాంచ్ కార్యాలయాల ద్వారా వసూలు చేసిన నిధులను ఇతర సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టామని ఒప్పుకున్న శైలజ, నిర్దిష్టంగా ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

  • Written By: Bhaskar
  • Published On:
Margadarsi Case: రామోజీ కోడలు శైలజ నోరు విప్పలేదు.. అయినా జగన్ ఊరుకోడు

Margadarsi Case: మార్గదర్శి కేసులో జగన్ మరింత నట్లు బిగిస్తున్నాడు. సిఐడి ద్వారా రామోజీరావుకు మరింత ఉక్కపోత కలిగిస్తున్నాడు. అమిత్ షా నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రెట్టించిన ఉత్సాహంతో అడుగులు వేస్తున్నాడు. ఇక ఈ కేసులో జగన్ ఎవరి మాటా వినడు. ఒకవేళ అతడికి ఎవరూ చెప్పే సాహసం కూడా చేయక పోవచ్చు. ఏపీ సిఐడి వర్గాల ప్రకారం మంగళవారం నిర్వహించిన విచారణలో శైలజ “లేదు, తెలియదు, ఏమో” అనే తీరుగా సమాధానాలు చెప్పినప్పటికీ.. వదిలే ప్రసక్తి ఉండదని తెలుస్తోంది. జగన్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, పైగా తనకు కక్ష సాధింపునకు అవకాశం ఉండడంతో మార్గదర్శి మీద మరిన్ని కత్తులు, బళ్ళాలు విసిరే అవకాశం ఉంది. మంగళవారం జరిగిన విచారణ జస్ట్ శాంపిల్ మాత్రమేనని.. ముందు ముందు అసలు సినిమా చూపిస్తామని ఏపీ వైసీపీ వర్గాలు అంటున్నాయి.

డబ్బులు వసూలు చేసింది నిజమే

” చందాదారుల నుంచి డబ్బులు వసూలు చేసింది నిజమే. బ్రాంచీలు, కార్యాలయంలో నిధులు ఉన్న మాట వాస్తవమే. అయితే వాటిని ఎక్కడెక్కడికి తరలించామో?, ఏ రూపంలో పెట్టుబడులు పెట్టామో తెలియదు. కేంద్ర చిట్ ఫండ్స్ చట్టాన్ని కూడా అమలు చేయలేదు.” ఇవీ తమ విచారణలో మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ తమ విచారణలో ఈ వివరాలు చెప్పారని ఏపీ సిఐడి అధికారులు అంటున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసుకు సంబంధించి ఏ_2 గా ఆ సంస్థ ఎండీ చెరుకూరి శైలజా కిరణ్ ను సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. సిఐడి అధికారులు మంగళవారం హైదరాబాద్ లో విచారణ నిర్వహించారు. సుమారు 30 మందితో కూడిన అధికారుల బృందం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసానికి ఉదయం 10 గంటలకు చేరుకున్నారు. వారు వెళ్లిన అరగంట దాకా గేటు తాళం తీయలేదు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అంటే దాదాపు 11 గంటలు అధికారులు విచారణ చేశారు..”మీరు మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండి కదా? మీ పేరిట చెక్ పవర్ కూడా ఉంది. మార్గదర్శనుంచి అక్రమ మార్గంలో నిధులు వివిధ కంపెనీలకు మళ్లించారని మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. వీటికి సంబంధించి మీరు ఏం సమాధానం చెబుతారు?” అని సిఐడి అధికారులు ప్రశ్నిస్తే..” నా ఆరోగ్యం బాగాలేదు. నేను అమెరికా నుంచి వచ్చాను. మీ ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పే స్థితిలో లేను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు.” అంటూ శైలజ తప్పించుకునే ప్రయత్నం చేశారు. విదేశాల నుంచి రావడంతో విచారణకు తాను సహకరించాలని కొద్దిసేపు ఏపీ సిఐడి అధికారులను ఇబ్బంది పెట్టారని తెలుస్తోంది.

కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి

విచారణ మొదలైన కొద్దిసేపటికే జ్వరంగా ఉందని, కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి, అక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు ప్రయత్నించారని సిఐడి అధికారులు అంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారితే తలకాయ నొప్పులు వస్తాయని భావించిన సిఐడి అధికారులు ఒక వైద్యుడిని పిలిపించి.. అతనితో ఆమెను పరీక్షించారు. వైద్యుడి సిఫారసు మేరకు ఆమె కొన్ని మాత్రలు వేసుకున్నారు. ఈ ప్రక్రియ మొత్తం జరిగిన తర్వాత సిఐడి అధికారులు మళ్లీ విచారణ ప్రారంభించారు. కొద్దిసేపటికి నా ఆరోగ్యం బాగోలేదని మళ్లీ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పూర్తి సహనం వహిస్తూ ఏపీ సిఐడి అధికారులు విచారణ సాగించారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

నిధులు ఏమయ్యాయి

అయితే ఈ విచారణలో ప్రధానంగా మార్గదర్శి నుంచి నిధులు ఎటువైపు మళ్ళించారనే విషయాన్ని తెలుసుకునేందుకు సిఐడి అధికారులు ప్రయత్నించారు. మార్గదర్శి బ్రాంచీల కార్యాలయాల్లోని రికార్డుల ప్రకారం వేలకోట్లు చందాదారుల నుంచి వసూలు చేసినట్టు తేలింది. అయితే వాటిని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టినట్టు సిఐడి అధికారులు గుర్తించిన నేపథ్యంలో.. సుమారు 793 కోట్లను అటాచ్ చేసేందుకు సిఐడి కి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం విధితమే. చందాదారుల నుంచి భారీగా వసూలు చేసిన మిగతా నిధులను ఎక్కడికి మళ్ళించారని శైలజను సిఐడి అధికారులు ప్రశ్నించగా.. ఎక్కడికి అవి తరలి వెళ్ళాయో తెలియదు అంటూ శైలజ తప్పించుకునే ప్రయత్నం చేశారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు మార్గదర్శి రికార్డుల్లో సరైన వివరాలు లేకుండా ఆడిటర్ల ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని సిఐడి అధికారులు గుర్తించారు. ఈ విషయంపై శైలజను ప్రశ్నించగా ఆమె ఎటువంటి సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది.

ఇతర సంస్థల్లో పెట్టుబడులు

మార్గదర్శకి ఆయువు పట్టయిన ఆంధ్రప్రదేశ్లో 37 బ్రాంచ్ కార్యాలయాల ద్వారా వసూలు చేసిన నిధులను ఇతర సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టామని ఒప్పుకున్న శైలజ, నిర్దిష్టంగా ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇది మాత్రమే కాకుండా చందాదారులకు చిట్టీల మొత్తాన్ని ఎందుకు చెల్లించలేకపోతోందనే విషయాన్ని సిఐడి అధికారులు అడిగితే ఆమె ఎటువంటి సమాధానం చెప్పలేదు. చందాదారుల సొమ్ము మొత్తం భద్రంగా ఉందని ఆమె చెప్పిన నేపథ్యంలో.. అధికారులు అదే దిశగా పలు ప్రశ్నలు అడిగారు. సొమ్ము అంత భద్రంగా ఉన్నప్పుడు డబ్బులు ఎందుకు చెల్లించలేకపోతున్నారని సిఐడి అధికారులు ప్రశ్నిస్తే.. శైలజ నీళ్లు నమిలారు. విచారణకు శైలజ సరిగా సహకరించకపోవడంతో ఆమెకు మరోసారి నోటీసులు జారీ చేయాలని సిఐడి అధికారులు భావిస్తున్నారు. ఆమెకు అనుకూలంగా ఉన్న రోజే విచారిస్తామని వారు చెబుతున్నారు. ఈ మేరకు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత రామోజీరావును కూడా మరోసారి విచారించాలని ఏపీ సీఐడీ భావిస్తోంది.

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు