మురిగిపోయిన మండలి బిల్లు.. రద్దైన రాజధాని బిల్లు!
ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, సిఆర్‌డిఎ పేరు మార్పు బిల్లులకు శాసనమండలి మోకాలడ్డడంతో ఆర్డినెన్స్ తీసుకు రావడం ద్వారా వెంటనే రాజధాని మార్పు పక్రియను వేగవంతం చేయాలనీ ప్రభుత్వంలో కసరత్తు జరుగుతున్నది. దీనిలో భాగంగానే చట్టపరమైన ఇబ్బందులు లేకుండా ఉభయ సభలను ప్రొరోగ్ వెంటనే సిఆర్‌డిఎ, విభజన బిల్లులపై ఆర్డినెన్సులు తెచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయమై ప్రభుత్వంలోనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఈ బిల్లులు ఇప్పటికే కోర్టులో ఉన్నాయని, వాటిపై ఆర్డినెన్స్ తేవడం అనేది అంత తేలికైన […]

ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, సిఆర్‌డిఎ పేరు మార్పు బిల్లులకు శాసనమండలి మోకాలడ్డడంతో ఆర్డినెన్స్ తీసుకు రావడం ద్వారా వెంటనే రాజధాని మార్పు పక్రియను వేగవంతం చేయాలనీ ప్రభుత్వంలో కసరత్తు జరుగుతున్నది. దీనిలో భాగంగానే చట్టపరమైన ఇబ్బందులు లేకుండా ఉభయ సభలను ప్రొరోగ్ వెంటనే సిఆర్‌డిఎ, విభజన బిల్లులపై ఆర్డినెన్సులు తెచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే ఈ విషయమై ప్రభుత్వంలోనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఈ బిల్లులు ఇప్పటికే కోర్టులో ఉన్నాయని, వాటిపై ఆర్డినెన్స్ తేవడం అనేది అంత తేలికైన విషయం కాదని పలువురు ఎమ్మెల్సీలు చెబుతున్నారు. అయితే సెలెక్టు కమిటీకి పంపి 14 రోజులు దాటిపోవడంతో ఇంతవరకూ ప్రకటన రాలేదని, దీంతో కమిటీకి విలువలేదని, బిల్లులు ఆమోదం పొందినట్లేనని రెవెన్యూ మంత్రి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పడం గమనార్హం.
సెలెక్టు కమిటీపై హైకోర్టులో పిటిషన్ దాఖలైన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ శ్రీరాం బిల్లులు సెలెక్టు కమిటీకి వెళ్లాయని వివరించారు. కమిటీ అభిప్రాయం వ్యక్తంచేసిన తరువాత తాము వాదనలు వింటామని కోర్టు తెలిపింది.
వికేంద్రీకరణ బిల్లు, సిఆర్‌డిఎ బిల్లు అసలు సెలెక్టు కమిటీకి వెళ్లలేదని మంత్రులు ప్రకటనలు చేస్తుండగా, వెళ్లాయని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలపడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. ఒకవేళ వీటిపై ఆర్డినెన్స్ ఇచ్చినా అది కోర్టు పరిధిలోనే ఉంటుందని టిడిపి సీనియర్ సభ్యులు యనమల రామకృష్ణుడు స్పష్టం చేస్తున్నారు.
బిల్లులు సెలెక్టు కమిటీకి వెళ్లాయని ఒకసారి చెప్పి, మరోసారి కాలం చెల్లిపోయిందని చెబుతున్నారని, మరలా ఆర్డినెన్స్ అనేది అర్థంలేని విషయమని, ఈ వ్యవహారంలో ప్రభుత్వం స్పష్టమైన అభిప్రాయం చెప్పలేకపోతోందని అధికార పక్షం నేతలోనే అసహనం వ్యక్తం అవుతున్నది. ఒకవేళ బిల్లు ఆమోదం పొందిందని చెబితే అసెంబ్లీ సెక్రటరీపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆర్డినెన్స్ వ్యవహారం అధికారపక్షంలో కలకలం రేపుతున్నది.
మరోవంక, సెలెక్టు కమిటీ విషయంలో వెంటనే కమిటీల వివరాలను ప్రకటిస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శిని మండలి చైర్మన్ ఆదేశించారు. సాంకేతిక కారణాలు చూపుతూ కమిటీల ఫైలును చైర్మన్‌కు పంపిన నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. వెంటనే ప్రకటన విడుదల చేయాలని సూచించారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఛైర్మన్ హెచ్చరించినట్లు తెలిసింది.