Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికలపై మరో సంచలన సర్వే.. అధికారం ఎవరిదో తేల్చేసింది!?
ఇప్పటికే జాతీయ మీడియా సంస్థలైన ఇండియా టుడే, ఇండియా టీవీలు సర్వేలు చేసి ఫలితాలను వెల్లడించాయి. తాజాగా.. తెలంగాణ ఎన్నికలపై మరో ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ ‘జనతా కా మూడ్’ సర్వే సంచలన ఫలితాలను ప్రకటించింది.

Telangana Assembly Election 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార బీఆర్‌ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రచారం ముమ్మరం చేశాయి. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఒకవైపు అభ్యర్థులు, మరోవైపు అగ్రనాయకుల ప్రచారంతో తెలంగాణ హోరెత్తుతోంది. మరోవైపు.. తెలంగాణ ప్రజలు ఎవరివైపు ఉన్నారో తెలుసుకునేందుకు సర్వే సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. అయితే ప్రజల నాడి ఈసారి సర్వే సంస్థలకు కూడా అంతు చిక్కడం లేదు. కొన్ని సర్వేల్లో కాంగ్రెస్‌దే అధికారమని.. ఇంకొన్ని సర్వేల్లో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొడుతోందని ప్రకటించాయి.
తాజాగా మరో సర్వే..
ఇప్పటికే జాతీయ మీడియా సంస్థలైన ఇండియా టుడే, ఇండియా టీవీలు సర్వేలు చేసి ఫలితాలను వెల్లడించాయి. తాజాగా.. తెలంగాణ ఎన్నికలపై మరో ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ ‘జనతా కా మూడ్’ సర్వే సంచలన ఫలితాలను ప్రకటించింది. బుధవారం నాడు ఈ సర్వే ఫలితాలను ఢిల్లీ వేదికగా జనతా కా మూడ్ వ్యవస్థాపకులు భాస్కర్ సింగ్ విడుదల చేశారు. సర్వేలో భాగంగా పెద్ద ఎత్తున డేటా సేకరించడంతోపాటు.. లోతైన విశ్లేషణ చేసామని తెలంగాణ ఎన్నికల్లో అనేక కీలక అంశాలు ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 1.20 లక్షల శాంపిల్స్ తీసుకొని.. రెండు నెలలపాటు సర్వే చేశామని ప్రతినిధులు స్పష్టం చేశారు. సెప్టెంబర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు శాంపిల్స్ తీసుకోవడంతోపాటు లోతైన విశ్లేషణ చేసి తాము ఈ అంచనాకు వచ్చామని సంస్థ ప్రతినిధులు మీడియాకు తెలిపారు.
బీఆర్‌ఎస్‌కే ఎడ్జ్..
తెలంగాణలో బీఆర్‌ఎస్– కాంగ్రెస్ మధ్యే పోటీ అని ఈ సర్వే కూడా తేల్చింది. గతంలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సర్వేలు నిర్వహించి ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ వివరాలను జనతా కా మూడ్ వెల్లడించింది. 2015లో ఢిల్లీ, బీహార్ ఎన్నికలు.. 2016లో అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి ఎన్నికలు.. 2017లో పంజాబ్ ఎన్నికలకు ఈ సర్వే సంస్థ చెప్పినట్లుగానే.. ఫలితాలు వచ్చాయని జనతా కా మూడ్ ప్రతినిధి వెల్లడించారు.
సర్వే ఫలితాలు ఇలా..
బీఆర్‌ఎస్ : 72 నుంచి 75 వరకు
కాంగ్రెస్ : 31 నుంచి 36 వరకు
బీజేపీ : 04 నుంచి 06 స్థానాల వరకు
ఎంఐఎం : 06 నుంచి 07 స్థానాల వరకు
ఇతరులు : 00 స్థానాలు
పార్టీల వారీగా ఓట్ల శాతం ఇలా..
‘జనతా కా మూడ్’ సర్వే పార్టీల వారీగా ఓట్ల శాతం కూడా ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం ఎంత శాతం ఓట్లు సాధిస్తాయో ప్రకటించింది.
బీఆర్‌ఎస్ : 41 శాతం
కాంగ్రెస్ : 34 శాతం
బీజేపీ : 14 శాతం
ఎంఐఎం : 3 శాతం
ఇతరులు : 8 శాతం
