
Hyderabad Fire Accident
Hyderabad Fire Accident: హైదరాబాద్‌పై అగ్నిదేవుడు కోపంతో ఉన్నాడు.. అందుకే దహించి వేస్తున్నాడా.. అగ్నికి ఆజ్యం పోస్టున్న నిర్లక్ష్యం ఎవరిది అంటే అది పూర్తిగా మనదే. చిన్నపాటి నిర్లక్ష్యంతో విశ్వనగరంలో వరుస అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. భాగ్యనగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన మరిచిపోక ముందే మళ్లీ హైదరాబాద్లో ఒక భారీ అగ్నిప్రమాదం జరిగింది.
వేసవి ప్రారంభంలోనే ఇలా..
అగ్ని ప్రమాదాలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. ఎండాకాలం ప్రారంభంలోనే భారీగా అగ్నిప్రమాద ఘటనలు చోటు చేసుకోవడం ప్రతి ఒక్కరినీ ఆలోచించేలా చేస్తుంది. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉత్పన్నమయ్యేలా చేస్తుంది. ఇక తాజాగా శాస్త్రీపురంలోని ఒక ప్లాస్టిక్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో మంటలు ఎగసిపడుతున్నాయి. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదానికి కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా తెలుస్తుంది. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో శ్రమిస్తున్నారు.
కమ్ముకున్న పొగ..
ప్రమాదం కారణంగా పరిసర ప్రాంతాలలో దట్టమైన పొగ అలుముకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి ఉక్కిరిబికిరవుతున్నారు. ఇక ప్రమాదం జరిగిన ప్రాంతానికి పరిసర ప్రాంతాలలో అన్ని ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్‌లు ఉండడంతో వీటికి మంటలు అంటుకోకుండా అగ్నిమాపక సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కువ మొత్తంలో స్క్రాప్ ఉండడంతో మంటలను అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి కష్టంగా మారింది. ఎండాకాలం ఇంకా తీవ్రం కాకముందే హైదరాబాద్ మహానగరంలో వరుసగా చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ముందు ముందు ఎన్ని అగ్ని ప్రమాదాలు చూడాల్సి వస్తుందో అని టెన్ష్‌న్ పడుతున్నారు.

Hyderabad Fire Accident
ప్రమాదాలు జరిగినప్పుడే స్పందన..
ఇక అగ్నిప్రమాదాల నివారణకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అంటే సమాధానం లేదు. కేవలం ప్రమాదం జరిగినప్పుడే అధికారులు, మంత్రులు, హడావుడి చేస్తున్నారు. తర్వాత షరా మామూలే. నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న దాఖలాలు ఎక్కడా కనిపించవు. దీంతో ప్రభుత్వం తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజలు మేల్కోకపోతే ఈ వేసవిలో విశ్వనగరంలో మరిన్ని అగ్నిప్రమాదాలు చూడక తప్పదు.