Jhansi Web Series Review: కోవిడ్ తర్వాత ప్రేక్షకులు సినిమా చూసే విధానంలో చాలా మార్పులు వచ్చాయి.. ఓటీటీ ల వల్ల చాలా వెబ్ సిరీస్ లు ఫోన్ లలోకి చొచ్చుకు వచ్చాయి. అయితే తెలుగులో ప్రేక్షకులను అలరించిన వెబ్ సీరీస్ లు తక్కువే అని చెప్పాలి.. తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రముఖ నటి అంజలి ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఝాన్సీ గురువారం నుంచి స్ట్రీమ్ అవుతున్నది. ఈ సీరీస్ లో అంజలితోపాటు చాందిని చౌదరి, ఆదర్శ్ బాలకృష్ణ, రాజ్ అర్జున్, అభిరామ్ వర్మ, తాళ్లూరి రామేశ్వరి పలువురు కీలకపాత్రలో నటించారు. ఈ సిరీస్ కు తిరు, గణేష్ కార్తీక్ దర్శకత్వం వహించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చారు. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చూస్తే ఆసక్తికరంగా కనిపించింది. ఫలితంగా దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ వెబ్ సిరీస్ ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించిందో ఒక్కసారి చూద్దాం.

Jhansi Web Series Review
కథ ఏమిటంటే
ఝాన్సీ ( అంజలి), సంకీత్( ఆదర్శ్ బాలకృష్ణ) ఇద్దరూ సహజీవనం చేస్తుంటారు. వాస్తవానికి సంకీత్ కు ఝాన్సీ పరిచయం విచిత్రంగా జరుగుతుంది. ఆరు సంవత్సరాల క్రితం గతం మర్చిపోయిన మహిళగా ఝాన్సీ సంకీత్ కు తారస పడుతుంది. ఆమె పరిస్థితి గమనించి సంకీత్ ఆసుపత్రిలో చికిత్స ఇప్పిస్తాడు.. తన వద్ద ఆమెకు ఆశ్రయం కల్పిస్తాడు. అయితే అప్పటికే సంకీత్ తన భార్యతో విడాకులు తీసుకొని ఉంటాడు. తన కూతురితో కలిసి జీవిస్తూ ఉంటాడు. కోలుకున్న ఝాన్సీ అతడి కూతురుని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఇదే సమయంలో ఆమెకు గతంలో జరిగిన ఘటనలు పీడకలలా మాదిరిగా గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇంతకీ ఆమెకు ఆ కలలు ఎందుకు వస్తున్నాయి? తన గతంలో జరిగింది ఏమిటి? అసలు ఆమె ఎవరు? ఈ విషయాలు తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి.
కథ కొత్తది కాదు
ఉమెన్ ట్రాఫికింగ్.. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. దీనికి ఈ వెబ్ సిరీస్ లో మాఫియాను యాడ్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ వాటికి అదనం. ఈ అంశాలపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. సిరీస్ లు కూడా నిర్మితమయ్యాయి.. అయితే వాటికి ఇది ఏ మాత్రం భిన్నంగా అనిపించదు ఓటిటిలో కంటెంట్ విభిన్నంగా ఉంటే తప్ప ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఝాన్సీ వెబ్ సిరీస్ ప్రారంభంలో వచ్చే సన్నివేశాలు, పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి . ప్రారంభ సన్నివేశం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది.. కథలోకి లీనం అయ్యేలా ఆసక్తి కలిగిస్తుంది. కానీ దీనిని చివరి వరకు దర్శకుడు తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఆరు ఎపిసోడ్ లు గా ఉన్న ఈ వెబ్ సీరీస్ లో కథనం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి రెండు ఎపిసోడ్లు కాస్త పర్వాలేదు అనిపిస్తాయి. తర్వాత అంతగా ఆసక్తి అనిపించవు.. ఈ వెబ్ సిరీస్ లో ఐదో ఎపిసోడ్ వరకు కూడా కొత్త పాత్రలు పరిచయం అవుతూనే ఉంటాయి.. దీనివల్ల చూసే ప్రేక్షకులు అయోమయానికి గురవుతూ ఉంటారు. దర్శకుడు కథనంపై దృష్టి సారించకపోవడం వల్ల ట్విస్టులు వస్తూనే ఉంటాయి.. పోనీ వాటికైనా సమాధానం దొరుకుతుందా అంటే అది కూడా లేదు.. ఇంత గందరగోళం మధ్య మరో సీజన్ కోసం వేచి చూడాల్సిందే అంటూ ఆరవ ఎపిసోడ్ ని ప్రశ్నార్థకంగా ముగించారు.. ఫలితంగా ప్రేక్షకులు కథకు అంతగా కనెక్ట్ కాలేరు.. పోనీ ఝాన్సీ తన గతాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించే ఒక సీన్ కూడా బలంగా ఉండదు.. వాస్తవానికి ఆ విధానాన్ని ఎంతో ఎంగేజింగ్ గా తీయవచ్చు.. కనీసం డిటెక్టివ్ సిరీస్ లా అయినా తీయవచ్చు. కథకు సంబంధం లేని హత్యలు జరగడం.. నిందితుల కోసం సూపర్ ఉమన్ గా ఝాన్సీ మారడం పిటీ అనిపిస్తుంది. ఇందులో కాస్త చూడాల్సింది ఏమైనా ఉందంటే.. అంజలి యాక్షన్ మాత్రమే.. అయితే అవి కూడా కొన్నిసార్లు లాజిక్ కి ఏ మాత్రం అందవు. హత్యను ఏదో సింపుల్ గా చేసేయడం, పోలీసులు విచారించడం, హత్య చేసిన వాళ్ళు క్లూలు వదలడం వంటి సీన్లు స్క్రిప్టులో లోపాన్ని ప్రేక్షకుల ముందు ఉంచుతాయి.
ఎవరు ఎలా చేశారంటే
ఝాన్సీ పాత్రలో అంజలి సరిగ్గా సూట్ అయింది.. ఆమె నటన గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అంజలి ఎమోషన్ సీన్లలో బాగా నటిస్తుంది.. కానీ ఈ సిరీస్ లో ప్రేక్షకులను కట్టిపడేసే ఒక్క ఎమోషన్ సీన్ కూడా ఉండదు. ఆదర్శ్ బాలకృష్ణ తన పాత్ర పరిధి మేరకు నటించాడు. చాందిని చౌదరి పాత్ర గెస్ట్ అప్పియరెన్స్ లా కనిపిస్తుంది. ఆమె పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను దర్శకుడు ఈ సీజన్లో చూపించలేదు. ఆమె ఝాన్సీ పై చూపించే ప్రేమ లెస్బియన్ లవ్ మాదిరి కనిపిస్తుంది.. ఒకప్పుడు ఐటెం పాటల్లో నటించిన ముమైత్ ఖాన్ పాత్ర కాస్త షాక్ కు గురిచేస్తుంది.. వుమెన్ ట్రాఫిక్ చేసే మహిళగా ముమైత్ ఖాన్ మంచిగా మారడం ఏమిటో దర్శకుడే చెప్పాలి. విలన్ గా నటించిన రాజ్ విజయ్ పర్వాలేదు అనిపిస్తాడు. అతడి పాత్ర నిడివి తక్కువగా ఉన్నా సిరీస్ మొత్తం ప్రభావితం చేస్తాడు.

Jhansi Web Series Review
సాంకేతిక వర్గం
ఈ సిరీస్ ని డిస్నీ హాట్ స్టార్ చాలా రిచ్ గా తీసింది.. నిర్మాణ విలువలు బాగున్నాయి.. కథకు అనుగుణంగా మంచి లొకేషన్లు ఎంచుకున్నారు.. అయితే కథే రొటీన్ గా ఉంది.. శ్రీ చరణ్ సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్ పనితీరు చాలా బాగుంది.. ఎడిటింగ్ ఇంకాస్త మెరుగుపడాల్సి ఉంది.. చాలా సన్నివేశాలకు కత్తెర వేయవచ్చు. ఇలా చేస్తే ఈ సిరీస్ 5 ఎపిసోడ్ లకు కుదించవచ్చు.. దర్శకుడు తిరు, గణేష్… సిరీస్ స్క్రిప్ట్ పై పూర్తిస్థాయి పరిశోధన చేస్తే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళేది. ఇలాంటి స్టోరీలు దాదాపు ఒకే మాదిరి ఉంటాయి.. కథనం విషయంలో దర్శకుడు జాగ్రత్త పడాల్సి ఉండాల్సింది. ఇందులో అదే పెద్ద మైనస్ అయింది.. ప్రధాన పాత్ర గతాన్ని మర్చిపోయి ఒక్కొక్కటిగా చేదించే అంశాన్ని ఇంకా థ్రిల్లింగ్ గా చూపించవచ్చు.. దర్శకుడు ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యాడు.
చివరగా చెప్పాలంటే… ఝాన్సీ .. ఓ కలగూర గంప..
రేటింగ్: 2.5/5