YS Avinash Reddy: కడప జిల్లాలో రాజకీయాలు మారుతున్నాయి. ముఖ్యంగా కూటమి దూకుడుగా ముందుకు సాగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. గత ఎన్నికల్లో ఎదురైన ఓటమిని తట్టుకొని మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేసే క్రమంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో వివాదం సద్దుమణగడం లేదు. రోజురోజుకు ఆ సమస్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి తేల్చేసినట్లు ప్రచారం నడుస్తోంది.
* నాలుగు దశాబ్దాలకు పైగా హవా..
కడప జిల్లాలో 1978లో తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేశారు రాజశేఖర్ రెడ్డి. అలా గెలిచిన రాజశేఖర్ రెడ్డి మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి రాజశేఖర్ రెడ్డి కుటుంబ హవా కడప జిల్లాలో కొనసాగుతూ వస్తోంది. రాజశేఖర్ రెడ్డి ది ఉమ్మడి కుటుంబం. ఈ పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ఒకవైపు రాణిస్తుంటే.. కడప జిల్లా బాధ్యతలు వైయస్ వివేకానంద రెడ్డి చూసేవారు. కుటుంబంలో ఎంతోమంది ఉన్నా వివేకాకు ఛాన్స్ ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి. అన్న ఆదేశాలను క్రమం తప్పకుండా పాటించేవారు వివేకానంద రెడ్డి. ఈ క్రమంలో ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఉన్న రాజకీయంగా పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి చనిపోయారో.. నాటి నుంచి వివేకానంద రెడ్డి ప్రాధాన్యత తగ్గించి.. భాస్కర్ రెడ్డి కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి.
* ఆలస్యంగా ఎంట్రీ..
2014 తర్వాత ఒక ప్రత్యేక పరిస్థితుల్లోనే వివేకానంద రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు జిల్లా పై ఉన్న పట్టు దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి తెచ్చుకున్నారు. అయితే రాజశేఖర్ రెడ్డి మాదిరిగా వివేకానంద రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పెద్దగా ప్రాధాన్యం కల్పించలేదు. 2019 ఎన్నికల్లో కడప పార్లమెంటు సీటు షర్మిలకు ఇద్దామని ప్రతిపాదించారు వివేకానంద రెడ్డి. అటు తరువాత వివేకానంద రెడ్డి హత్యకు గురి కావడం.. అది రాజకీయ లబ్ధి కోసం చేసిన హత్య అని.. అవినాష్ రెడ్డి తో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి చేయించారంటూ వివేక కుమార్తె సునీత, వైయస్ షర్మిల సైతం ఆరోపించారు. ప్రజల్లోకి ఈ అంశం బలంగా వెళ్ళింది. అవినాష్ రెడ్డి తక్కువ ఓట్లతో మొన్నటి ఎన్నికల్లో బయటపడ్డారు.
* ప్రతికూల అంశాలతో.
అయితే ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు మళ్లీ రీఓపెన్ అయింది. ఈసారి ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించడం ఖాయం. పైగా మునుపటిలా కేంద్ర ప్రభుత్వ సహాయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదు. అందుకే ఈసారి దొరికిపోతామని అవినాష్ రెడ్డికి తెలుసు. ఆపై రాజకీయ ప్రత్యర్ధులు బిటెక్ రవి, రెడ్డప్ప గారి మాధవి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు పట్టు బిగిస్తున్నారు రాజకీయంగా. మునుపటిలా జిల్లాలో రాజకీయాలు చేయలేమని అవినాష్ రెడ్డి గుర్తించారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి తేల్చి చెప్పారు. తనకు బాధ్యతలు నుంచి తప్పించాలని.. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనని కుండ బద్దలు కొట్టి చెప్పినట్లు ప్రచారం నడుస్తోంది. అందులో ఎంత నిజం ఉందో చూడాలి.
