Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణం రాజు యాక్షన్ ప్లాన్ లోకి దిగారు. గత ఐదేళ్లుగా తనకు ఎదురైన పరిణామాలపై గట్టి రివేంజ్ కు డిసైడ్ అయ్యారు. ఇప్పటికే జగన్ పై అవినీతి కేసులను వేగవంతం చేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గత ఐదు సంవత్సరాలుగా జగన్ తీసుకున్న నిర్ణయాలలో అవకతవకలపై కూడా న్యాయస్థానం తలుపు తట్టారు. ఇప్పుడు తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ పై గుంటూరు ఎస్పీకి నేరుగా ఫిర్యాదు చేశారు. 2021 లో తనను పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసారని ఆరోపిస్తూ జగన్, అప్పటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు తో పాటు ఇతర అధికారులపై ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు కావడమే కాకుండా కీలక అధికారుల మెడకు చుట్టుకోవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. కేవలం ఫిర్యాదు మాత్రమే కాకుండా సాక్షాధారాలతో సహా జతపరచడం సంచలనం సృష్టిస్తోంది.
గత ఎన్నికల్లో వైసీపీ తరఫున నరసాపురం లోక్సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు రఘురామకృష్ణంరాజు. గెలిచిన కొద్ది కాలానికి వైసీపీ నాయకత్వంతో ఆయనకు విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో ఆయన ప్రతిపక్షాలకు దగ్గరయ్యారు. సొంత పక్షం తప్పిదాలపై విరుచుకుపడేవారు. సహజంగానే ఇది అధికార పార్టీకి మింగుడు పడని విషయం. అందుకే జగన్ సర్కార్ రఘురామకృష్ణం రాజును వెంటాడింది. 2021 మే 14న రఘురామకృష్ణంరాజు పుట్టినరోజు. కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఏపీ సిఐడి పోలీసులు ఆయన ఇంటిపై విరుచుకుపడ్డారు. ఏ కేసు పెట్టారో తెలియదు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో కూడా చెప్పలేదు. వెంటనే గుంటూరు తరలించారు. కేవలం సుమోటోగా తీసుకుని రాజా ద్రోహం కేసులు పెట్టినట్లు ప్రకటించారు. చివరకు సుప్రీంకోర్టులో చేరి ఉపశమనం పొందాల్సి వచ్చింది.
అయితే కేవలం కేసులు గాని కాకుండా సొంత నియోజకవర్గం నరసాపురం రాకుండా కూడా అడ్డుకున్నారు. ప్రతిక్షణం టార్చర్ పెట్టారు. అందుకే రఘురామకృష్ణంరాజు జగన్ ఓటమికి కృషి చేశారు. బిజెపి, టిడిపి జనసేన అనుకూల వైఖరితో ముందుకు సాగారు. బిజెపి నుంచి పోటీ చేసేందుకు అవకాశం రాకపోవడంతో.. చివరి నిమిషంలో టిడిపిలో చేరారు. ఉండి అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలుపు సాధించారు. ఇప్పుడు తనపైజరిగిన దాడిపై న్యాయపోరాటాన్ని ప్రారంభించారు. తనను అరెస్టు చేసిన అధికారుల కాల్ రికార్డులను భద్రపరిచేలా ఆదేశాలు తెచ్చుకున్నారు. మరోవైపు సిబిఐ దర్యాప్తు కోసం దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో రఘురామ ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంచలన విషయాలను బయట పెట్టనున్నారు. ముఖ్యంగా రఘురామ అరెస్ట్ ఎపిసోడ్ విషయంలో అతిగా వ్యవహరించిన అధికారులపై మాత్రం చర్యలు తప్పేలా లేవు.