AP Deputy CM Pavan :  పూనకాలు లోడింగ్.. సినిమా సెట్ లోకి పవన్.. వైసిపి స్పందన ఏంటో?

తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ స్టైల్ వేరు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. పదేళ్ల పాటు కష్టపడ్డారు. సినిమాలతో పాటు రాజకీయ రంగంలో కొనసాగారు. గత ఏడాది కాలంగా ముఖానికి రంగు వేసుకోలేదు. ఇప్పుడు ఆ పనిలో పడ్డారు పవన్.

Written By: Dharma, Updated On : September 24, 2024 3:35 pm

AP Deputy CM Pavan

Follow us on

AP Deputy CM Pavan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నారు. దేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన ట్విట్ జాతీయ స్థాయిలో సైతం వైరల్ అయింది. దేశ విదేశాల్లో ఉన్న 150 కోట్ల మంది హిందువుల్లో ఇది చర్చకు దారి తీసింది. మరోవైపు ఈ ఘటనను నిరసిస్తూ పవన్ ప్రాయశ్చిత దీక్షకు దిగారు. 11 రోజులపాటు ఈ దీక్ష కొనసాగనుంది. చివరి రోజు శ్రీవారిని దర్శించుకొనున్నారు పవన్. ఈ వివాదం ఇలా ఉండగానే పవన్ ఏడాది తర్వాత మళ్లీ సినిమా సెట్ పై అడుగుపెట్టనున్నారు. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. సోమవారం నుంచి విజయవాడలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టిన ఈ సినిమా షూటింగ్ చాలా కాలం పాటు నిలిచిపోయింది. మిగతా పెండింగ్ పార్ట్ తో దర్శకుడు జ్యోతి కృష్ణ సినిమాను పూర్తి చేయనున్నట్లు సమాచారం. 2025 మార్చి 28న సినిమా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్రం యూనిట్ ప్రకటించింది.

* దీక్షలో ఉండగా షూటింగ్
తిరుమలలో వివాదం నేపథ్యంలో పవన్ ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్నారు. ఒకవైపు దీక్షలో ఉండగానే సినిమా షూటింగ్లో పాల్గొనడానికి తప్పుపడుతూ.. ఇప్పటికే సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగాయి. మరోవైపు వైసీపీ సైతం విమర్శలు చేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రజలు పవన్ ని ఎన్నుకొని అధికారం అప్పగిస్తే.. పాలనను, ప్రజా సమస్యలను గాలికొదిలి సినిమాలు చేసుకుంటున్నారని విమర్శలు ప్రారంభమయ్యాయి. పవన్ మొదలుపెట్టిన ఉస్తాద్ భగత్ సింగ్, ఓ జి సినిమాలకు సమయం కేటాయించి పూర్తి చేయాలని ఆ సినిమా దర్శక నిర్మాతలు కోరుతూ వస్తున్నారు.

* మూడు చిత్రాలు పెండింగ్
ఈ ఏడాది ప్రారంభం నుంచి పవన్ సినిమాలను విడిచిపెట్టారు. రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఎలక్షన్ క్యాంపెయినింగ్ పై ఫోకస్ పెట్టారు. దీంతో హరిహర వీరమల్లుతో పాటు మిగతా రెండు చిత్రాల షూటింగ్ లు నిలిచిపోయాయి. పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పవన్ పవర్ లోకి వచ్చారు. ప్రభుత్వ ఏర్పాటులో కీలక భాగస్వామ్యం అయ్యారు.పదేళ్లుగా ఎన్నో కష్టాలను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నారు. జనసేన అభిమానులకు పండుగ వాతావరణం తీసుకొచ్చారు.

* అభిమానుల కోరిక మేరకు
తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ ది ప్రత్యేక స్థానం. మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చిన ఆయన తనకంటూ ఒక సొంత బాట ఏర్పాటు చేసుకున్నారు. తన మేనరిజంతో కోట్లాదిమంది అభిమానులను పొందగలిగారు. ఇది రాజకీయంగా సక్సెస్ కావడానికి కారణం అయ్యింది. అయితే అంతటి గుర్తింపు ఇచ్చిన చిత్ర పరిశ్రమను వీడకూడదని అభిమానులు భావిస్తున్నారు. అందుకే ఆయన సినిమాలు చేసేందుకు ముందుకొచ్చారు. వీలైనంత వరకు పెండింగ్ సినిమాలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంలో వైసీపీ నుంచి ఎటువంటి విమర్శలు వస్తాయో నన్న చర్చ అయితే నడుస్తోంది.