Attack On Jagan: ఎన్నికల ప్రచారంలో రకరకాల ఎత్తుగడలు ఉంటాయి. వ్యూహ ప్రతి వ్యూహాలు కూడా ఉంటాయి. ప్రజలు బలంగా నమ్మితేనే ఎన్నికల ప్రచారాలు వర్కౌట్ అయ్యేవి. అయితే గత ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎన్నికల ముందు తనపై జరిగిన కోడి కత్తి దాడి, తరువాత బాబాయ్ వివేక హత్య.. ఇలా అనేక ఘటనలు జగన్ కు కలిసి వచ్చాయి. ఎన్నికల ప్రచారంలో అస్త్రాలుగా మారాయి. అప్పట్లో విపక్షనేతగా ఉండడం కలిసి వచ్చే అంశం. ప్రతి దానికి అధికారపక్షాన్ని కార్నర్ చేస్తూ టార్గెట్ చేయడం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఒక అధికారపక్షంగా ఉండి అలా చేయగలరా? ప్రజలు నమ్ముతారా?ఇప్పుడు విజయవాడలో సీఎం జగన్ పై గులకరాయితో దాడి జరిగిన తర్వాత ప్రజల్లో బలంగా చర్చ నడుస్తోంది.
2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు అంటే.. 2018 అక్టోబర్ 25న విశాఖ ఎయిర్పోర్ట్ లో జగన్ పై కోడి కత్తితో ఒక యువకుడు దాడి చేశాడు. దీంతో అదో సంచలన అంశంగా మారిపోయింది. చంద్రబాబు ప్రభుత్వమే ఈ దాడి చేయించిందని వైసీపీ ఆరోపించడం ప్రారంభించింది. ఎన్నికల ప్రచారంలో కూడా ఇది హైలెట్ అయింది. ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. సానుభూతి వర్కౌట్ కావడంతో జగన్ కు రాజకీయంగా లబ్ధి చేకూరింది. అయితే సరిగ్గా ఇప్పుడు ఎన్నికల ముంగిట విజయవాడలో జగన్ పై గులకరాయితో దాడి జరిగింది. కోడి కత్తి ఘటనను గుర్తుచేస్తూ ఈ పరిణామాలు జరిగాయి. ఇప్పుడు కూడా వైసిపి సానుభూతి అస్త్రం ప్రయోగిస్తోంది. దీని వెనుక చంద్రబాబు ఉన్నారన్న ఆరోపణతో రక్తి కట్టిస్తోంది. అయితే దీనిని ప్రజలు నమ్ముతారా? నమ్మరా? అన్నది చూడాలి.
కోడి కత్తి కేసుకు సంబంధించి విచారణ గత ఐదేళ్లుగా ఎలా జరిగిందో సామాన్య ప్రజలకు తెలుసు. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న యువకుడు ఐదేళ్లపాటు జైల్లోనే ఉండిపోయాడు. ఒక రిమాండ్ ఖైదీ ఇన్ని రోజులు జైలు జీవితం అనుభవించడం ఇదే తొలిసారి. ఇందులో ఎటువంటి కుట్ర కోణం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చింది. కోర్టుకు స్పష్టం చేసింది. అయినా సరే ఇంకా లోతైన దర్యాప్తు జరగాలని జగన్ కోరుకున్నారు. ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నందున కోర్టుకు రాలేనని తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల ముంగిట ఈ గులకరాయి దాడిని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కానీ వైసీపీ శ్రేణులను అలర్ట్ చేసేందుకు ఈ ఘటన దోహదపడుతుంది. ఒకవైపు విపక్షాలన్నీ కూటమి కట్టడం, మరోవైపు సొంత చెల్లెలు ఎదురు దాడి చేయడం, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తెలుగుదేశం కూటమిలోకి రావడం.. తదితర కారణాలతో జగన్ ఆపసోపాలు పడుతున్నారు. ఇటువంటి తరుణంలో ఆయన ఓటమి చవి చూస్తే.. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలుసు. అందుకే ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నారని కూడా విపక్షాలు అనుమానిస్తున్నాయి.
సానుభూతి ద్వారా వచ్చే లబ్ధి గురించి వైసీపీకి తెలుసు. జగన్ కు అంతకంటే తెలుసు. వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్ అంతులేని సానుభూతి పొందగలిగారు. కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా అంతకుమించి ప్రజల నుంచి జగన్ పై సానుభూతి వ్యక్తం అయింది. గత ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి హత్య కేసు, అంతకంటే ముందు కోడి కత్తి దాడి రాజకీయంగా మైలేజ్ ఇచ్చాయి. జగన్ పట్ల ప్రజల్లో సానుభూతి పెంచడానికి కారణమయ్యాయి. అయితే ఈ గులకరాయి దాడి విషయంలో మాత్రం సానుభూతి కంటే ప్రతికూలత ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అప్పట్లో ఆయన విపక్ష నేత. ఇప్పుడు అధికారపక్ష నేత. తనను తాను రక్షించలేనివాడు.. ప్రజలను ఎలా రక్షిస్తాడు అంటూ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. విమర్శలకు కారణమవుతుంది. ఇది రాజకీయ దుమారానికి కారణం అవుతుంది తప్ప.. ఏపీ రాజకీయాల్లో ఎటువంటి ప్రభావం చూపదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.