Seaplane facility in AP tourism: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ స్వామివారిని దర్శించుకునే సందర్శకులకు సైతం ఇది నిజంగా శుభవార్త. త్వరలో సీ ప్లేన్ రైడ్ లు అందుబాటులోకి రానున్నాయి. ఎంచక్కా నీటిపై తేలియాడుతూ తిరుమల చేరుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం టెంపుల్ టూరిజం కింద ప్రాజెక్టును అందుబాటులోకి తేనుంది. కళ్యాణి ఆనకట్ట వద్ద నీటి ఆధారిత విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది. సాహస, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పెంచే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు వచ్చే మార్చినాటికి ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ సి ప్లేన్ అందుబాటులోకి వస్తే.. అన్ని ప్రాంతాలకు వాయు కనెక్టివిటీ విస్తరించే అవకాశం ఉంది. ప్రకృతిని ఆస్వాదించే పర్యాటకులకు గొప్ప అనుభూతిని మిగిల్చనుంది.
ఆ ఎనిమిది చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు..
రాష్ట్రంలో ప్రధానంగా అమరావతి, తిరుపతి, గండికోట, అరకు, లంబసింగి, కోనసీమ, శ్రీశైలం, ఋషికొండ తో సహా 8 ప్రదేశాలను సి ప్లేన్ సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిలో అమరావతి, తిరుపతి, గండికోట మొదటి పేజీలో ఏర్పాటు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ ఈ ప్రాజెక్టుల నివేదికలను సిద్ధం చేయడానికి బిడ్లను ఆహ్వానించింది. అయితే ఈ మూడు ప్రదేశాలు విమానాశ్రయాలకు సమీపంలో ఉండడంతో అధికారులు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట ప్రధాన దేవాలయాలకు సరసమైన సీ ప్లేన్ సేవలతో అనుసంధానించే పర్యాటక సర్క్యూట్లను రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించి అధ్యయనం చేసే బాధ్యతను ఫీడ్ బ్యాక్ హైవేస్ ప్రైవేట్ లిమిటెడ్ కు అప్పగించారు. మొత్తానికైతే మార్చినాటికి సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నమాట.
ఇప్పటికే సేవలు ప్రారంభం..
గతంలో విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్లేందుకు సీ ప్లేన్ సేవలను ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రారంభించడమే కాకుండా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి శ్రీశైలం వరకు ప్రయాణించారు కూడా. అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న నీటి వనరుల వద్ద.. అవసరమైన చోట సీ ప్లేన్ సేవలను ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 8 చోట్ల వాటి సేవలను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మొదటి పేజ్ లో భాగంగా ఆ మూడు చోట్ల సీప్లేన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.