Anand Mahindra : అమ్మా.. నాకు శిక్షణ ఇచ్చినందుకు ధన్యవాదాలు
మాతృ దినోత్సవం సందర్భంగా ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Anand Mahindra : ఈరోజు మదర్స్ డే… ఇప్పుడు అసలే సోషల్ మీడియా రోజులు కాబట్టి, వ్యక్తిగతంగా ఎక్స్పోజర్ ను మరింత ఎక్కువగా కోరుకునే రోజులు కాబట్టి.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు మాతృ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కో తీరుగా తమ మాతృమూర్తితో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. పాత ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి, దానికి అనుకూలంగా మాటలు రాశారు. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ఎలా రాసినప్పటికీ ఆ మాటల్లో వారి తల్లి మీద ఉన్న ప్రేమ, అందులో గాఢత కనిపించింది. అయితే ఇలాంటి వాటిల్లో విభిన్నతను చూపించే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా మాతృ దినోత్సవం సందర్భంగా తన అమ్మపై ఉన్న ప్రేమను హృదయానికి హత్తుకునేలా వ్యక్తపరిచారు.
తల్లితో కలిసి ఉన్న ఫోటో..
మాతృ దినోత్సవం సందర్భంగా ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో తన తల్లితో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. తన మాతృమూర్తితో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు.” ప్రతి ఏటా వచ్చే మాతృ దినోత్సవం సందర్భంగా మా అమ్మకు సంబంధించిన ఫోటోలను ఆల్బమ్ లో వెతుకుతూ ఉంటాను. వాటిల్లో ఈ ఫోటో ఒకటి. అప్పట్లో మా నాన్న అధ్యక్షతన మహీంద్రా యుగైన్ స్టీల్ వార్షిక వాటాదారుల సమావేశం జరుగుతున్నది. ఆ కార్యక్రమానికి మా అమ్మ నన్ను తీసుకెళ్లింది. అప్పుడు నేను స్కూల్ దశలోనే ఉన్నాను. ఈ ఫోటో నాకు ఎప్పటికీ అపురూపమే. అమ్మా.. థాంక్స్. నాకు ఈ విధమైన శిక్షణ ఇచ్చినందుకు.. నువ్వు ఎక్కడ ఉన్నా.. నీకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మా” అంటూ భావోద్వేగంతో ఆనంద్ మహీంద్రా రాసుకొచ్చారు.
నెటిజన్ల శుభాకాంక్షలు
మాతృ దినోత్సవం సందర్భంగా ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆనంద్ మహీంద్రా కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ” ప్రతి ఒక్కరి విజయం వెనుక అమ్మ ఉంటుంది. మీ విజయం వెనుక కూడా మీ అమ్మ ఉంది. అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్తగా ఆమె మలిచారు. ప్రతి పనిని అత్యుత్తమంగా చేయడంలో మీకు శిక్షణ ఇచ్చారు..మీ అమ్మ గారికి హ్యాట్సాఫ్. పెద్ద విద్యాలయాలు చెప్పని పాఠాలు మీ అమ్మగారు మీకు చెప్పారు. మీ అమ్మగారి పక్కన మీరు ఎంతో ఆసక్తిగా ఉన్నట్టు కనిపిస్తున్నారు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Every year on #MothersDay I go fishing for old pics of my mother…Here’s one blast from the past, when she took me for the first time to the Annual Shareholders’ Meeting of Mahindra Ugine Steel which my father was chairing. Thank you for the coaching, Ma. Happy #MothersDay… pic.twitter.com/ejmBRvtF4Q
— anand mahindra (@anandmahindra) May 14, 2023
