Ammu Movie Review: వేధింపులు లేదా హింసను ఆడవాళ్ళు ఎందుకు భరిస్తారు? ఒక మనిషి మరొక మనిషిని కొట్టే హక్కు పెళ్లి అనేది ఈజీగా గ్రాంట్ ఇస్తుందా? ఇంత హింస భరిస్తూ కూడా ఆడవాళ్ళు ఎందుకు బయటకు రారు? మానసిక, శారీరక హింస పైకి అంత బానే కనబడుతుంది అలాంటి వాటికి క్లాసిక్ దృశ్యరూపం అమ్ము.. ఇది అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. తెలుగు, తమిళ్ లో స్ట్రీమ్ అవుతోంది. సినిమా ప్రారంభంలోనే అమ్ము ని ఒక పాప అడుగుతుంది “నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నావా ?నాకైతే అతన్ని చూస్తే భయంగా ఉంటుంది .. ఎప్పుడూ భయపెడతాడు.. నీకు భయంగా ఉండదా?” అని అమ్ము అది జోక్ లాగా తీసుకుని నవ్వేస్తుంది.. ఈ సమయంలో సావిత్రి రాసిన “పెళ్లి అవుతుంది నీ పని అవుతుంది లే” అని.. చిన్నప్పుడు మాస్టారు అనగానే మొగుడు అంటే కొట్టేవాడు అని అర్థమైంది అన్నట్టు మొదలవుతుంది.
అమ్ము జీవితం కూడా అలాగే మొదలవుతుంది. చాలాసార్లు పెళ్లిలో ఆడవాళ్ళ మీద జరిగే హింసకి పెద్ద కారణాలు ఉండవు. కాఫీలో పంచదార లేకపోవచ్చు. ఉప్మాలో ఉప్పు తక్కువ కావచ్చు. ఏదైనా కావచ్చు. దెబ్బ, మాట మాత్రం ఆడదాని ఒంటి మీద మనసు మీద తీవ్రమైన గాయం చేస్తుంది. అంతా రొటీన్ కానీ.. ఇలాంటి రొటీన్ హింస నుంచి తెలివిగా బయటపడిన ఒక అమ్మాయి కథ అమ్ము. అమ్ముగా ఐశ్వర్య, తన భర్తగా ఎస్సై రవిగా నవీన్, చంద్ర ఇంకా ఒక సర్ప్రైజ్ పాత్రలో బాబి సింహ నటించారు అనేకంటే జీవించారు అనడం చాలా సహజంగా ఉంటుంది.
-కార్తీక్ సుబ్బరాజు, చారుకేసి శేఖర్ మామూలుగా తీయలేదు
కార్తీక్ సుబ్బరాజు తీసిన ప్రతి సినిమాలోని బాబి సింహ ఉంటాడు. కార్తీక్ సుబ్బరాజు “ఇరైవి” సినిమా నుంచి ప్రత్యేకమైన బెంచ్ మార్కు సృష్టించుకున్నాడు. కానీ అమ్ము సినిమా లో కార్తీక్ సుబ్బరాజు మరో మెట్టు పైకి ఎక్కాడు. దర్శకుడు చారుకేసి శేఖర్ ఈ సినిమా ద్వారా తాను ఏంటో నిరూపించుకున్నాడు. ఈ ఒక్క సినిమాతో అతడి మీద ప్రేక్షకుడికి గౌరవం అమాంతం పెరిగిపోతుంది అంటే అతిశక్తి కాదు.. “హింసకు ఏదో ఒక దారి ఉంటుంది. అది చేసిన తర్వాత అతని కళ్ళల్లోకి చూస్తూ భయపడకుండా నేను బయటికి వెళ్ళాలి. నా తప్పు లేకుండా నేనేం తప్పు చేయకుండా నేను భయపడకూడదు. ఒకవేళ తప్పు చేసినా నన్ను కొట్టే ధైర్యం ఎవరికీ ఉండకూడదు. ఈ శరీరం ఈ మనసు నాది. అతనిది కాదు. నాకైతే, మారతాడు, నన్ను ప్రేమిస్తాడు. పిల్లల కోసం, పరువు కోసం అంటూ నసిగే” ఆడవాళ్ళు సినిమా చూస్తే తమ ఆలోచనను కచ్చితంగా మార్చుకుంటారు.
ప్రేమ కన్నా గౌరవం,హ్యూమన్ రైట్స్ ముఖ్యం అని ఇంతకన్నా ఏ మూవీ చెప్పలేదు. ఇందులో లోపాలు లేవా అంటే లేవు అని కాదు. కానీ సినిమా తీసిన పర్పస్ లోపాల కన్నా గొప్పది.. ఈ రోజుల్లో కూడా, ఈ సబ్జెక్ట్ మీద సినిమాలు రావటం అసలైన సిస్టమిక్ లోపం. ఇటీవల వచ్చిన గార్గి, ఇప్పుడు అమ్ము.. గుండె గాడతను, కంటి పాప తడిని మరింత పెంచే సినిమాలు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి సినిమాలను సమాజం ఓన్ చేసుకుంటుంది అంటే ఇంకా కొందరి మగవాళ్ల మైండ్ సెట్ మారలేదు అని అర్థం.