అమిత్ షా మౌనం వ్యూహాత్మకమేనా!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే అక్కడ మూడు రోజులపాటు అల్లర్లు జరగడం, పోలీసులు ఆ సమయంలో ప్రేక్షక పాత్ర వహించడం జరిగినప్పటి నుండి బీజేపీలో, నరేంద్ర మోదీ ప్రభుత్వంలో అత్యంత బలవంతుడిగా భావిస్తున్న హోమ్ మంత్రి అమిత్ షా ప్రాబల్యం మసకబారినట్లు అనిపిస్తున్నది. ప్రభుత్వంలో ఆయన అప్పటి నుండి ప్రముఖంగా కనిపించడం లేదు. లాక్ డౌన్ సందర్భంగా వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయం, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల సరఫరా సక్రమంగా జరిగేటట్లు చేయడం […]

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే అక్కడ మూడు రోజులపాటు అల్లర్లు జరగడం, పోలీసులు ఆ సమయంలో ప్రేక్షక పాత్ర వహించడం జరిగినప్పటి నుండి బీజేపీలో, నరేంద్ర మోదీ ప్రభుత్వంలో అత్యంత బలవంతుడిగా భావిస్తున్న హోమ్ మంత్రి అమిత్ షా ప్రాబల్యం మసకబారినట్లు అనిపిస్తున్నది. ప్రభుత్వంలో ఆయన అప్పటి నుండి ప్రముఖంగా కనిపించడం లేదు.
లాక్ డౌన్ సందర్భంగా వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయం, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల సరఫరా సక్రమంగా జరిగేటట్లు చేయడం కోసం గత నెలలో ఏర్పాటు చేసిన 15 మంత్రులతో కూడిన అత్యున్నత కమిటీకి రాష్ట్రాల వ్యవహారాలు చూసే అమిత్ షా నాయకత్వం వహించాలి. కానీ రక్షణ మంత్రి నాయకత్వం వహించడం, ఆ కమిటీలో అమిత్ షా దాదాపు ప్రేక్షక పాత్ర వహించడం చాలామందికి ఆయనను పక్కన పెట్టారనే అనుమానాలు కలగడానికి దారితీసింది.
అయితే ప్రభుత్వాన్ని, బిజెపిని ఏకపక్షంగా నడిపిస్తున్న మోదీ, అమిత్ షాల మధ్య ఎటువంటి బేదాభిప్రాయాలు లేవని, ఇప్పటికి వారిద్దరూ ఒక జట్టుగానే, ఉమ్మడిగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తున్నది. కేవలం వ్యూహాత్మకంగా ప్రస్తుతం అమిత్ షా తెరపైకి ఎక్కువగా కనిపించడం లేదని చెబుతున్నారు.
కరోనా పై పోరాటంలో కేంద్ర ప్రభుత్వం ఒక విధంగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. క్షేత్ర స్థాయిలో నిజమైన పోరాటం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ సందర్భంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. వాస్తవానికి కేంద్రం ఆలస్యంగా మేల్కొన్నది. ఎన్నో ఆర్ధిక ఇబ్బందులున్నప్పటికీ రాష్ట్రాలు భారీగా వనరులు సమీకరిస్తున్నాయి.
ఈ సందర్భంగా కేరళ, ఒడిశా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్ ఘర్ వంటి పలు ప్రభుత్వాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలతో సామరస్యంగా వ్యవహరింపనిదే కరోనా విషయంలో కేంద్రం ఏమీ చేయలేదని ప్రధానికి తెలుసు.
కానీ బిజెపియేతర ప్రభుత్వాలను అస్థిర పరచడంలో, వారికి అడ్డంకులు సృష్టించడంలో అమిత్ షా పేరొందారు. ఆయన సారధ్యంలో లాక్ డౌన్ అమలు జరిగితే రాష్ట్రాలతో ఘర్షణలకు తెరలేపినట్లు కాగలదని వెనుకడుగు వేసిన్నట్లు వెల్లడి అవుతున్నది. అందుకనే వ్యూహాత్కామగా ఇప్పుడు అమిత్ షా ను పక్కన ఉంచినట్లు తెలుస్తున్నది.
అయితే అమిత్ షా ప్రాధాన్యతను తెలియచెప్పడం కోసం ప్రధాని ఏప్రిల్ 11న ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో తొలుత కొన్ని మాటలు మాట్లాడు మాట్లాడిన తర్వాత అమిత్ షా తో మోడరేట్ చేయించారు. అంతకు ముందు మార్చ్ 20, ఏప్రిల్ 2 లలో ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లలో అమిత్ షా దాదాపు ప్రేక్షక పాత్ర వహించారు. ఆ సమావేశాలను కాబినెట్ కార్యదర్శి మోడరేట్ చేశారు.
అయితే ప్రభుత్వంపై తన పట్టు కోపోలేదని చెప్పడం కోసం అమిత్ షా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కరోనా కట్టడి, లాక్ డౌన్ అమలు సరిగ్గా జరగడం లేదని అంటూ కొన్ని రాష్ట్రాలకు అంతర్ మంత్రిత్వ శాఖల బృందాలను పంపించారు.
ఈ బృందాలను పంపడం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ అభ్యంతరం తెలపడం గమనార్హం. ఒక మధ్య ప్రదేశ్ తప్ప ఆయన బృందాలను పంపిన రాష్ట్రాలు అన్ని బిజెపియేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నవే కావడం గమనార్హం.
