PM Modi: ప్రధాని మోదీ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. బాధ్యత కలిగిన నాయకుడిగా వ్యవహరించారు. ఓ అంబులెన్స్ కు దారి ఇచ్చేందుకు తన భారీ కాన్వాయ్ ను పక్కకు తప్పించారు. కొద్దిసేపు రోడ్డుపై పక్కనే ఉండిపోయారు. ప్రస్తుతం గుజరాత్ ఎన్నికల్లో బిజీగా ఉన్న ప్రధాని బీజేపీ గెలుపునకు గట్టి వ్యూహాలే పన్నుతున్నారు. రెండో విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో భారీ రోడ్డు షో నిర్వహించారు. అహ్మదాబాద్ లో భారీ రోడ్డు షో నిర్వహించారు. దాదాపు 16 నియోజకవర్గాలను కలుపుతూ సుమారు 50 కిలోమీటర్ల రోడ్డు షో చేపట్టారు. భారీ జనసందోహం నడుమ ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని రోడ్డు షో చేపట్టారు.

PM Modi
సాధారణంగా మోదీ రోడ్డు షో అంటే భద్రతా వాహనాలు, అనుసరించే కాన్వాయ్ ఉంటుంది. దీనికితోడు వేలాది మంది జనాలతో రహదారులు నిండిపోతాయి. అయితే అదే సమయంలో కాన్వాయ్ లో ఓ అంబులెన్స్ చిక్కుకుంది. దీనిని గమనించిన మోదీ అంబులెన్స్ కు దారివ్వాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. దీంతో కాన్వాయ్ ను పక్కకు తప్పించి భద్రతా సిబ్బంది యుద్ధ ప్రతిపదికన నిమిషాల వ్యవధిలో అంబులెన్స్ కోసం ట్రాఫిక్ క్లీయరెన్స్ చేశారు. దీంతో అక్కడ నుంచి అంబులెన్స్ ముందుకెళ్లేందుకు మార్గం దొరికింది. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ దీనిని వెలుగులోకి తెచ్చింది. అటు ప్రధాని వాహనం తన వెనుక నుంచి వచ్చిన అంబులెన్స్ కు దారిస్తూ ఉన్న దృశ్యాలను ప్రసారం చేసింది. మానవత్వానికి విలువనిస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

PM Modi
అయితే మోదీ గతంలో కూడా ఈ విధంగానే వ్యవహరించిన సందర్భాలున్నాయి. గతంలో హిమచల్ ప్రదేశ్ ఎన్నికలకు ముందు కూడా ఇటువంటి సీన్ ఒకటి కనిపించింది. కాంగ్రాల్లో ర్యాలీ చేసిన సందర్భంలో అంబులెన్స్ కు దారిచ్చే క్రమంలో ప్రధాని మోదీ తన కాన్వాయ్ ను నిలిపివేయించారు. దీంతో పాటు సెప్టెంబరు 30న అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్ వెళుతుండగా అంబులెన్స్ కోసం ప్రధాని కాన్వాయ్ ఆగింది. ఇప్పుడు మరోసారి ప్రధాని రోడ్డు షోలో అటువంటి దృశ్యమే ఆవిష్కృతమైంది. అయితే దీనిని బీజేపీ హైలెట్ చేయలేదు. ఏఎన్ఐ వార్తా సంస్థ కథనం ప్రచురించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రధాని మానవతావాదం ఇప్పుడు హైలెట్ అవుతోంది. అటు నెటిజన్లు సైతం ఈ కథనాన్ని ట్రోల్ చేస్తున్నారు. అభినందనలతో ముంచెత్తుతున్నారు.