Amarinder Singh: పంజాబ్ లో మరో కొత్త పార్టీ పురుడుపోసుకోనుంది. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నూతన పార్టీని స్థాపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ను ఓడించడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానంపై అక్కసుతోనే అమరీందర్ సింగ్ కొత్త పార్టీకి శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీ కన్నా పీసీసీ అధ్యక్షుడు సిద్దూ పైనే అమరీందర్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
గతంలో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబెట్టిన అమరీందర్ సింగ్ ఈసారి కూడా తన గెలుపుకు సహకరించాలని ప్రజలను కోరేందుకు సిద్ధమవుతున్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున కాకుండా సొంత పార్టీని ఆదరించాలని కోరుతున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నారు. అమరీందర్ బీజేపీలో చేరాలని భావించినా దానిపై వ్యతిరేకత ఉన్నందున అటు వైపు మొగ్గు చూపలేకపోయారు.
పార్టీకి ఇంత సేవలందించినా ఆయన సేవలను గుర్తించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను పదవి నుంచి తప్పించడంతో ఆయనలో కోపం పెరిగిపోయింది. దీంతో సిద్దూను రాజకీయాల్లో ఉంచకుండా చేయడమే లక్ష్యంగా అమరీందర్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. సిద్దూ వల్లనే తన ఆశలు గల్లంతయ్యాయని అభిప్రాయపడుతున్నందున సిద్దూపై బాణాలు ఎక్కుపెడుతున్నట్లు సమాచారం.
అమరీందర్ సింగ్ గతంలో కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పార్టీ స్థాపించినా మళ్లీ కాంగ్రెస్ లోనే కలిపేశారు. కానీ ఈ సారి మాత్రం అలా కాకుండా ఉండేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ విధివిధానాలు రూపొందించుకుంటున్నారు. భవిష్యత్ వ్యూహాలపై పదును పెడుతున్నారు. కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు.